- సచివాలయ కార్యాలయాల్లో పూజలతో ప్రవేశం
- సిఎం జగన్ ఆకాంక్షల మరకు పనిచేస్తామని వెల్లడి
- కొట్టు , నారాయణస్వామి, తానేటి వనిత, రజని, మేరుగల బాధ్యతలు
అమరావతి,ఏప్రిల్ 18 : ఎపిలో ఇటీవల మంత్రులుగగా ప్రమాణలం చేసిన పలువురు బాధ్యతలు చేపట్టారు. అలాగే సోమవారం ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు,పలువురు మంత్రులు కూడా బాధ్యతలు చేపట్టారు. ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… దేవాలయాలకు భక్తులు ఇచ్చిన భూముల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ఆలయాల్లో సౌకర్యాల పెంపుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా తర్వాత ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగిందని… వరుస సెలవులతో తిరుమలలో రద్దీ పెరిగిందని చెప్పారు. ఆలయాల్లో భద్రత పెంపుకు చర్యలు చేపటడతామన్నారు. ఆలయాల్లో జరుగుతున్న దాడులు ప్రేరేపితంగా ఉన్నాయని ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మరోఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కూడా బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లోని ఆయన చాంబర్‌లో వేద పండితుల మంత్రో చ్ఛారణల మధ్య ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎక్సైజ్‌శాఖలో ఇటీవల మరణించిన ఇద్దరు ఉద్యోగు లకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు. తమది బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని… ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలతో తామంతా ముందుకెళ్తామన్నారు. 1981లో చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం అన్నూరు సర్పంచ్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1981-86 వరకు కార్వేటినగరం సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1987లో కార్వేటినగరం మండలాధ్యక్షుడు అయ్యారు. 1989-94 వరకు పీసీసీ సభ్యుడిగా వ్యవహరించారు. 1994, 1999ల్లో సత్యవేడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2004లో సత్యవేడు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఓటమి చెందారు. 2014, 2019 ఎన్నికల్లో గంగాధరనెల్లూరు నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 నుంచి 2022 వరకు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు రెండోసారి మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఇకపోతే రాష్ట్ర హోం మంత్రిగా తానేటి వనిత సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఆపై జైళ్లలో ములాఖత్ వెంటనే జరిగేలా అనుమ తిస్తూ మొదటి సంతకం చేశారు.
ఈ సందర్భంగా హోంమంత్రి వనిత మాట్లాడుతూ…సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా నన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా అందరికి న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుపై దృష్టి పెడతామని చెప్పారు. టెక్నాలజీని ఉపయోగించి సత్వర న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. దిశ బిల్లును చట్టం చేసేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. కొంతమంది కావాలని అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వనిత వెల్లడించారు. న్యాయం, చట్టం వివక్ష లేకుండా అందిస్తున్న ప్రభుత్వంలో.. ఫ్రెండ్లీ పోలీస్, క్విక్లీ రెస్పాన్స్ విధానంతో పనిచేస్తామని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో మూడు ఏళ్లుగా సీఎం జగన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ఏపీకి జాతీయ అవార్డులు కూడా తీసుకొచ్చారని కొనియాడారు. టెక్నాలజీ వినియోగలోనూ మన పోలీస్ విభాగం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. రాబోయే రెండేళ్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాం. మహిళలపై నేరాల నియంత్రణకు కృషి చేస్తాం. దిశ చట్టం కేంద్రంలో పెండింగ్‌లో ఉన్నా అందులోని అంశాలను అమలు చేస్తున్నాం. దిశా యాప్ ద్వారా 900 మందికిపైగా ఆడపిల్లల్లను కాపాడారు. పోలీస్ వ్యవస్థలో పారదర్శకత, ఫ్రెండ్లీ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్ అమలును కొనసాగిస్తాం. శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడ రాజీ పడకుండా పనిచేస్తాం. జగనన్న స్ఫూర్తి తోనే పనిచేస్తామని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ… మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. సంక్షేమ పథకాలన్నీ ప్రతి దళితుడికి అందించే బాధ్యత సీఎం తనకు ఇచ్చారన్నారు. ఎక్కడా చిన్న తప్పు కూడా చేయకుండా పని చేస్తానని తెలిపారు. అంబేద్కర్ ఆలోచనతో దళిత సంక్షేమానికి సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారని మంత్రి నాగార్జున పేర్కొన్నారు. దళితుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయనని.. అంబేద్కర్ ఆలోచన, జగ్జీవన్‌రావు కాన్సెప్ట్‌తో ఆయన పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. దళితులు ఎవ్వరికీ అన్యాయం జరగకూడదని సీఎం ఆలోచన అని మంత్రి అన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రిగా విడదల రజిని బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డియాతో మాట్లాడుతూ, పేదలకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైద్య రంగాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారన్నారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వాసు పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. బీసీలకు సీఎం జగన్.. ఎవ్వరు ఇవ్వనంత ప్రాధాన్యం ఇచ్చారని, బీసీలు ఎప్పటికీ సీఎం జగన్ వెంటే ఉంటారని విడదల రజిని అన్నారు. ఆమె హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది. చిలకలూరిపేటకు చెందిన కుమారస్వామిని వివాహం చేసుకున్నారు. యూఎస్‌ఏలోని కాలిఫోర్నియాలో ప్రాసెస్ వీవర్ సాప్ట్‌వేర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2018లో వైఎస్సార్‌సీపీలో చేరారు. 2019లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు.