Take a fresh look at your lifestyle.

పట్టాభిషిక్తుడైన రామయ్య

  • భదాద్రిలో వైభవోపేతంగా స్వామి వారి పట్టాభిషేకం
  • పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌
  • ‌సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం కావడంతో వేడుకకు భారీ సంఖ్యలో హాజరైన భక్తులు

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 31 : భద్రాచల క్షేత్రంలో వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణం జరిగిన మరుసటి రోజైన శుక్రవారం నాడు మిథిలా మండపంలో స్వామివారి పట్టాభిషేకం అత్యంత వైభవంగా  జరిగింది. ఈ అపురూప సన్నివేశాన్ని తిలకించిన భక్తులు ఆనంద పరవసులయ్యారు. ప్రతి సంవత్సరం కల్యాణం మరుసటి రోజు స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించినా…ఈ సారి 12 సంవత్సరాలకు ఒక సారి నిర్వహించే శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం కావడంతో…ఈ వేడుకను తిలకించిడానికి వేలాది మంది భక్తులు భదాద్రి చేరుకున్నారు. శ్రీరామ….జయరామ….రామ జయం…. శ్రీరామ జయం అనే భక్తుల ద్వానాలతో భదాద్రి మార్మ్రోగింది. భద్రాచలంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీ సీతారామచంద్రస్వామి వారి పట్టాభిషేకం ఘనంగా జరిగింది. అభిజిత్‌ ‌లగ్నంలో కల్యాణం జరుపుకున్న వేదకపైనే శుక్రవారంనాడు రామచంద్రమూర్తి దశమినాడు పట్టాభిషిక్తుడయ్యాడు.

ఈ పుష్కర పట్టాభషేకం మహా వేడుక కోలాహలంగా సాగింది. భక్తులు పారవశ్యంతో పట్టాభిషేకాన్ని తిలకించి పునీతులయ్యారు. రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళి సై దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి పట్టాభిషేక వేడుకకు రాజ్యాధికార హోదాలో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. శ్రీరామ పుష్కర పట్టాభిషేక మహా వేడుకను పురస్కరించుకొని ముందుగా ఉత్సవానికై చతుస్సముద్ర జలములు, 12 ప్రసిద్ధ నదుల తీర్ధములు, 12 పుణ్య పుష్కరిణుల తీర్ధములను సేకరించడమైనది. ఈ ఉత్సవాలకు మరింత దివ్యత్వాన్ని కలిగించే విధముగా చతుర్వేదహవనములు, ఆగమోక్తములైనఐదు విధాల ఇష్టహోమములు, తొమ్మిది రోజులపాటు 108 మంది ఋత్వికులచే వివిధ పారాయణములు 12 కుండములతో శ్రీ రామాయణము సంపూర్ణముగా, శ్రీ రామషడక్షరీ సంపుటితంగా, నారాయణాష్టాక్షరీ మంత్రహోమ సమన్వితంగా జరుగుతున్నది. సిద్ధులైనయతిపుంగవుల అనుగ్రహభాషణ ములతో సుప్రసిద్ధులైన ప్రవచనపరులు ఉపన్యాసములతో పుష్కరపట్టాభిషేక మహోత్సవములు అద్భుతమైన సంప్రదాయ సమారోహముగా జరిపారు.

ప్రత్యేకంగా సేకరించిన జలాలను వేద మంత్రోచ్ఛారణలు, మేలతాళాలతో ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం ఆ పవిత్ర నదీ, పుష్కరిని, సముద్ర జలాలతో స్వామి వారి పాదాలకు భద్రుని కోవెలలో ప్రత్యేక స్నపనం నిర్వహించారు. పవిత్ర నదీ జలాలతో ఉన్న కలశాలను శిరస్సుపై ధరించి అర్చకులు అగ్ర భాగాన నడువగా వేద పండితులు మంగళవాయద్యాల నడుమ పట్టాభిషేకం జరగే కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. ముందుగా పట్టాభిషేక మహోత్సవానికి ఎటువంటి విఘ్నాలు కలుగకుండా విశ్వక్సేన పూజను నిర్వహించారు. అనంతరం పట్టాభిషేక మహోత్సవానికి తీసుకొచ్చిన జలాలను ఆభరణాలను, ఆయుధాలు, వేదికకు స్థలశుద్ధి, ద్రవ్యశుద్ధ నిమిత్తం పుణ్యహావచనం నిర్వహించారు. చతుర్వేదాలను వేదపండితులు పఠించారు. పుష్కర పట్టాభిషేకం యొక్క విశిష్టతను భక్తులకు వివరించారు.

తరువాత పట్టాభిషేకం వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపారు. ముందుగా స్వామి వారికి బంగారు పాదుకలు సమర్పించగా అనంతరం విశ్వక్సేనుడు అధిపతి అయిన రాజముద్రికను సమర్పించారు. సుదర్శనుడు అధిపతి అయిన రాజదండం, చామరం, చత్రం, ఖడ్గం, వెండి విసునకర్ర మణిరత్న మాలిక, చివరగా కిరీటాన్ని ధరింపజేశారు. తరువాత ముత్యాల హారాన్ని సీతమ్మవారికి సమర్పించగా తన మెడలో ఉన్న హారాన్ని సీతమ్మవారు ఆంజనేయుడికి సమర్పించినట్లు అర్చకులు పట్టాభిషేక ఘట్టాన్ని పూర్తిచేశారు. అనంతరం భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం, శ్రీరామమాడ, చింతాకు పతకం అనంతరం కుంభ హారతి, నక్షత్రంహారతులను స్వామి వారికి సమర్పించి సంప్రోక్షణ గావించారు. ఈ వేడుకకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జిల్లా కలెకర్టర్‌ అనుదీప్‌ , ఎస్పీ డాక్టర్‌ ‌వినీత్‌, ‌జిల్లా సంయుక్త కలెక్టర్‌వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply