Take a fresh look at your lifestyle.

‌ప్రధాని మోదీ విద్యార్హతల వివరాలు మీకెందుకు

  • దిల్లీ సిఎం కేజ్రీవాల్‌పై గుజరాత్‌ ‌హైకోర్టు అసహనం
  • 2016 నాటి సీఐసీ ఉత్తర్వులను కొట్టివేస్తూ ప్రతివాది కేజ్రీవాల్‌కు రూ. 25 వేల జరిమానా
  • ప్రధాని సర్టిఫికెట్లను బయటికి చూపించాల్సి అవసరం లేదన్న ఉన్నత న్యాయస్థానం
  • ప్రధాని ఏం చదువుకున్నాడో తెలుసుకోవడం తప్పెలా అవుతుంది : కోర్టు తీర్పుపై కేజ్రీవాల్‌ ‌ప్రశ్న

న్యూ దిల్లీ, మార్చి 31(ఆర్‌ఎన్‌ఎ) : ‌దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజీవ్రాల్‌కు గుజరాత్‌ ‌హైకోర్టు షాకిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలకు సంబంధించి డిగ్రీ, పోస్ట్ ‌గ్రాడ్యుయేట్‌ ‌డిగ్రీ సర్టిఫికెట్లను బయటకు చూపించాల్సిన అవసరం లేదని గుజరాత్‌ ‌హైకోర్టు స్పష్టం చేసింది. ప్రధాని విద్యార్హతల వివరాలు అడుగుతూ కోర్టును ఆశ్రయించిన అరవింద్‌ ‌కేజీవ్రాల్‌కు రూ.25 వేల జరిమానా విధించింది. ప్రధాన మంత్రి కార్యాలయం అలాంటి వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఎంఏ డిగ్రీ వివరాలను అందించాలని గుజరాత్‌ ‌యూనివర్సిటీని ఆదేశించిన సెంట్రల్‌ ఇన్ఫర్మేషన్‌ ‌కమిషన్‌(‌సీఐసీ) 2016 నాటి ఉత్తర్వులను గుజరాత్‌ ‌హైకోర్టు కొట్టివేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మాస్టర్‌ ఇన్‌ ఆర్టస్(ఎంఏ) ‌డిగ్రీ వివరాలను వర్సిటీ హక్కు కింద అందించాలని కేంద్ర సమాచార కమిషన్‌ (‌సీఐసీ) ఆదేశాలను సవాలు చేస్తూ గుజరాత్‌ ‌యూనివర్సిటీ(జీయూ) దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్‌ ‌హైకోర్టుకు చెందిన జస్టిస్‌ ‌బీరెన్‌ ‌వైష్ణవ్‌ అనుమతించారు.

ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కోర్టు రూ. 25,000 జరిమానా విధించింది. అంతేకాకుండా, తీర్పుపై హైకోర్టులో అప్పీల్‌ ‌చేసిన తర్వాత దిల్లీ సిఎం తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కొట్టివేస్తూ, తన ఆర్డర్‌పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఫిబ్రవరి 9న, ఈ అంశంపై గుజరాత్‌ ‌విశ్వవిద్యాలయం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణను ముగించింది. ఇక గుజరాత్‌ ‌హైకోర్టు తీర్పుపై  అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌స్పందిస్తూ…ప్రధాని మోదీ ఏం చదువుకున్నాడో తెలుసుకోవడం తప్పేలా అవుతుందంటూ చెప్పుకొచ్చారు. మోదీ విద్యార్హతలు చెప్పడానికి పీఎంవోకు ఏంటీ సమస్యా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఏం చదువుకున్నారో తెలుసుకోవద్దా అని నిలదీశారు. మోదీ విద్యార్హతలు అడిగితే జరిమానా వేస్తారా…అని అడిగారు.

Leave a Reply