నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

  • భారీగా ఏర్పాట్లు చేసిన బోర్డు అధికారులు
  • నిముషం నిబంధన ఖచ్చితంగా అమలు… సెంటర్ల వద్ద 144 సెక్షన్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు బోర్డు అధికారులు తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. నిముషం నిబందన ఖచ్చితంగా అమలు చేస్తారు. మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇంటరోబోర్డు ఇప్పటికే అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 సెంటర్లను అధికారులు ఏర్పాటుచేశారు. వీటిలో 880 సెంటర్లను ప్రైవేట్‌ కాలేజీల్లో, 407 సెంటర్లను ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో, మరో 234 సెంటర్లను గురుకులాల్లో ఏర్పాటు చేశారు.

ఇక పరీక్షల కోసం 27,900 మంది ఇన్విజిలేటర్లు,విధులు నిర్వర్తించ నున్నట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది. అన్ని జిల్లాల్లోనూ అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, సిబ్బందిని పరీక్షల విధుల్లోకి తీసుకొంటున్నట్టు వివరించారు. కలెక్టర్లు, పోలీసు అధికారులు పరీక్షాకేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. చీఫ్‌ సూపరింటెండెంట్లు`1,521 మందిÑ ప్లయింగ్‌ స్కాడ్‌`75 మందిÑ సిట్టింగ్‌ స్కాడ్‌ ` 200 మంది విధులు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 9,80,978 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 4,78,718 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. ద్వితీయ సంవత్సరం నుంచి 5,02,260 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. సెకండియర్‌ పరీక్షలకు హాజరయ్యే వారిలో 58,071 మంది ప్రైవేట్‌ విద్యార్థులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *