మండిపడ్డ సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఫోటో లేకుండా అజాది కా అమృత్ ఉత్సవాలు చేయడం అక్షేపణీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రథమ ప్రధాని నెహ్రూను విస్మరించడం దారుణమన్నారు. నెహ్రూ త్యాగాలను మరచిపోవడం దారుణమన్నారు. శనివారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ..సాలర్జంగ్ మ్యూజియంకు వెళ్ళిన యువజన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయని భట్టి పేర్కొన్నారు. సావర్కర్ లాంటి వారి ఫోటోలు పెట్టడం దుర్మార్గమన్నారు. మిమ్మల్ని ప్రజలు క్షమించరని..గుణపాఠం చెబుతారన్నారు.
చదువుకోని వారు ప్రధానులు అయితే ఇలాగే చరిత్రను వక్రీకరిస్తారని భట్టి పేర్కొన్నారు. పరిపాలన, మతాలకు సంబంధం ఉండదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. పరిపాలన చేతకాక.. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. అందులో భాగంగానే మసీదుల తవ్వకాల కామెంట్స్ చేస్తున్నారన్నారు. మతాన్ని వోట్ల కోసమే తెరపైకి తెస్తున్నారన్నారు. కాంగ్రెస్.. దేశాన్ని ఏకతాటిపైకి తెస్తే.. బీజేపీ దేశాన్ని విచ్చిన్నం చేసే కుట్ర చేస్తుందన్నారు. ఏ మతం కూడా హింసను కోరుకోదని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.