‘‘సుప్రీమ్ కోర్ట్ తనకున్న విశిష్ట అధికారమైన స్వీయ సమీక్షను ఉపయోగించుకోకుండా కేసును ప్రభుత్వ పునః పరిశీలనకు పంపించడం చట్టాలపై వ్యాఖ్యానించే భాద్యతను ప్రక్కకు పెట్టినట్లు అవుతుంది. ఒకవేళ ప్రభుత్వము నిజంగానే పరిశీలించి ఈ అణిచివేత చట్టం స్థానములో దొడ్డి దారిన మరియొక చట్టం తెస్తుంది అని చారిత్రిక అనుభవము ద్వారా అనుమానిస్తున్నారు.’’
భాధ్యత కంటె ముందు ఆత్మ ప్రభోధము అనుస రించడం ముఖ్యము విధి నిర్వహణ చేయడానికి ముందు సరిఅయిన ఆత్మ ప్రభోదం ఏర్పర్చుకొనుట తప్పనిసరి బాధ్యత (జస్టిస్ ఆంథోనిన్ స్కేలియా)
(More Important than your obligation to follow your conscience or at least prior to it is your obligation to form your conscience correctly — Justice Antonin Scalia)
సుప్రీమ్ కోర్ట్ ఇటీవల 11-05-2022 నాడు దేశ ద్రోహము అనే నేరము భారత శిక్షాస్మృతి నుండి తొలిగించాలనే వ్యాజ్యము లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సందర్భములో మిశ్రమ స్పందనలు చవి చూస్తుంది. పైన పేర్కొన్న కొటేషన్ ప్రకారము సుప్రీమ్ కోర్ట్ రాజ్యాంగ మౌళిక సూత్రమైన న్యాయ సమీక్ష ( ఆర్టికల్ 13) అనే ఆత్మ ప్రభోదం ఏర్పరుచుకొనుటలో విఫలముఅయినది అని న్యాయ కోవిదులు, విద్యావేత్తలు, న్యాయమూర్తులు, మేధావులు, హక్కుల కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు. సుప్రీమ్ కోర్ట్ తనకున్న విశిష్ట అధికారమైన స్వీయ సమీక్షను ఉపయోగించుకోకుండా కేసును ప్రభుత్వ పునః పరిశీలనకు పంపించడం చట్టాలపై వ్యాఖ్యానించే భాద్యతను ప్రక్కకు పెట్టినట్లు అవుతుంది. ఒకవేళ ప్రభుత్వము నిజంగానే పరిశీలించి ఈ అణిచివేత చట్టం స్థానములో దొడ్డి దారిన మరియొక చట్టం తెస్తుంది అని చారిత్రిక అనుభవము ద్వారా అనుమానిస్తున్నారు.
ప్రభుత్వము కోర్టుకు ఇచ్చిన ఆఫ్ఫిడవిట్ లో ఇలా మనవిచేసింది. ‘‘ దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పువాటిల్లే త్రీవ్రమైన నేరాలను చర్యలు చట్టబద్దంగా ఏర్పడిన ప్రభుత్వాలను చట్టం ఆమోదించని నిషేదించిన చర్యల ద్వారా అస్థిర పరిచినట్లయితే వారిని శిక్షించడానికి బహుశా ఈ చట్టం ఉండాలని, మేధావులు, విద్యావేత్తలు న్యాయకోవిదులు కోరుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏమనుకొంటుందో అందులో చెప్పలేదు పైగా శ్రీ నరేంద్ర మోడీ ఈ రాజ ద్రోహ నేరం కాలం చెల్లిందని, వలసవాద అవశేషం అని అనుకొం టున్నారు అని వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తపరచినట్లు చెప్పారు కానీ అసలు ఏమనుకొంటుందో చెప్పలేదు. బహుశా 75వ స్వతంత్ర అమృత మహోత్సవం అనగా 15-08-2022 నాడు కంటి తుడుపు చర్యగా దేశ ద్రోహ నేరం యొక్క పేరును మార్చి దాని స్థానములో ఇంకొక క్రూరమైన చట్టం రావచ్చు?
దేశ ద్రోహము కానీ, రాజ ద్రోహం అనే నేరాకృతి నిర్మాణానికి ప్రాతిపదికలు ( (ingredients)•) నేరాలుగా పరిగణించేంతవరకు చట్టం పదిలంగా వుంటుంది కాబట్టి ఆ నేరపూరిత ప్రతిపా దికలను ప్రతి నిర్బంధ చట్టం నుండి తొలిగింపబడాలి. ఉదాహరణకు ప్రభుత్వము పట్ల అవిధేయత, ప్రేమ అభావము, ప్రజలకు ద్రోహము, చట్టాల పట్ల అవగాహన కల్పించడం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను మార్చాలని ప్రభోధం చేయడం, సమీకరి ంచడం ప్రచారం చేయడం నేరాలు అని చెప్పినప్పుడు చట్ట బద్దంగా ఏర్పడ్డ ప్రభుత్వము కూడా పోయి దాని స్థానములో కొత్త ప్రభుత్వము రావచ్చు. ఈ ప్రక్రియ కూడా దేశద్రోహం అంటే ప్రజలు ప్రత్యమ్నాయాలు వెతుక్కుంటారు. రాజకీయ అరాచకం ఏర్పడవచ్చు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రతిఘాతం.
ప్రజాస్వామ్యం మౌళిక సూత్రం ప్రభుత్వ అధికారాల విభజన శాసన వ్యవస్థ కార్య నిర్వహణ వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థల మధ్య జరగడం. న్యాయ వ్యవస్థకు ఇచ్చిన అధికారం చాలా విశిష్టమైనది. శాశనసభ ఏదైనా చట్టం రాజ్యాంగానికి విరుద్దంగా చేసినట్లయితే దానిని కొట్టివేసే అధికారం సుప్రీమ్ కోర్టుకు ఉంది. అంతే కాకుండా కార్య నిర్వహణ వ్యవస్థ చేసే చర్యలు ఒక వేళ శాసన బద్దంగా కానీ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నా ఆ చర్యలను రద్దు చేయవచ్చు. ఈ ప్రక్రియను రాజ్యాంగ వాదం (•(constitutionalism)) అంటారు. ఈ ప్రక్రియ ద్వారానే ఇప్పటికి రాజ్యాంగం 104 సార్లు సవరణ కు గురి అయ్యింది.
ఒక్కప్పుడు జీవించే హక్కు, స్వేచ్ఛను ప్రభుత్వం కావాలనుకొంటే హరించవచ్చును అన్న A.K. Gopalan కేసు నుండి మేనకా గాంధీ కేసు మరియు అనేక ఇతర కేసులలో సుప్రీమ్ కోర్ట్ తనకు ఉన్న విశేష న్యాయ సమీక్షా అధికారం ద్వారా అప్రజాస్వామిక చట్టాలను కొట్టివేస్తే తదనుగుణంగా రాజ్యాంగ సవరణలు జరిగాయి.
న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించి ఒకప్పుడు బాల గంగాధర్ తిలక్, మహాత్మా గాంధీలపై ప్రయోగించిన వలస వాద దేశ ద్రోహ చట్టాన్ని సుప్రీమ్ కోర్ట్ రద్దు చేయకుండా ఉండడం చాల విచారకరం. అయితే ఈ దేశ ద్రోహ చట్టాన్ని సుప్రీమ్ కోర్టులో అనేక సార్లు సవాలు చేశారు. సుప్రీమ్ కోర్ట్ చాలా కేసుల్లో దేశ ద్రోహం నేరము యొక్క నిర్వచనాన్ని వ్యాఖ్యానిస్తూ నేరాలను ఆపాదించడం రాజ్యాంగ విరుద్ధం అన్నది కానీ ఆ నేరాన్ని చట్ట గ్రంధము నుండి తొలగించలేదు.
మచ్చుకు కొన్ని దేశ ద్రోహ కేసులు :
(1) రమేష్ థాపర్Vs స్టేట్ అఫ్ మద్రాస్ : ఈ కేసులో క్రాస్ రోడ్ అనే పత్రికలో ప్రచురించ బడిన వ్యాసాలు పబ్లిక్ ఆర్డర్ కు భంగము కలుగ చేస్తున్నాయి అన్న ఆరోపణను సుప్రీమ్ కోర్ట్ కొట్టివేసినది. (1950 AIR 124)
(2) కేదారనాథ్ సింగ్ Vs స్టేట్ అఫ్ బీహార్ : ఈ కేసులో సుప్రీమ్ కోర్ట్ అసలే దుర్మార్గమైన దేశ ద్రోహ స్మృతికను తన వ్యాఖ్యానము ద్వారా మరింత దృఢ పరిచినది. ఒరిజినల్ నిర్వచనము ప్రకారము ‘‘ ఎవరైనా మాటలు, రాతలు, సైగలు, అగుపించే ఏ ప్రాతినిధ్యధ్యాలు మొదలగు ప్రక్రియల ద్వారా చట్ట బద్దంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అసహ్యించుకున్నా, ధిక్కరించినా, ఉత్తేజితుడైనా, ప్రేమ రాహిత్యాన్ని చూపిన లేక పై చర్యలకు పాటుబడటానికి ప్రయత్నించినా వేరేవారిని ప్రేరేపించినా శిక్షార్హము. ఐదుగురు (5) న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనము ముందుకు దేశ ద్రోహ వ్యాజ్యం పరిశీలనకు వెళ్లినప్పుడు పై చర్యల వలన వెంటనే ప్రభుత్వము పై ద్వేషం అసహ్యం కలిగించకున్నప్పటికీ ఆ మాటలు, చేతలు, కూతలు, సైగలు, భవిష్యతులో పై చర్యలకు పురికొల్పే ధోరణి కనిపిస్తుందని కూడా శిక్ష వేయవచ్చును అని చెప్పింది. .
అనగా ఎవరైనా ఏ ప్రాంతము వాడైనా భవిష్యతులో ఎప్పుడైనా ప్రేరితుడై ప్రభుత్వముపై ధిక్కారం చూపినా, ఇంకా హింసాత్మకంగా స్పందించినా ఆ మొదటి వ్యక్తి శిక్షార్హుడు. ఇది చరిత్రలో జరిగింది. మహాత్మా గాంధీ తన యంగ్ ఇండియా పత్రికలో ఖలీఫాత్ ఉద్యమానికి మద్దతుగా వ్యాసాలు వ్రాసినందుకు తర్వాత, తరువాత అలీ సోదరులు ప్రేరణకు గురై హింసాత్మక చర్యలకు పాలుబడేటట్టుగా ఉపన్యాసాలు యిచ్చారని మహాత్మా గాంధీని రాజ ద్రోహ నేరం క్రింద శిక్షించారు. ఇంత భయంకరమైన, ప్రమాదకర, అప్రజాస్వామిక నియమం హీనమైన చరిత్ర ఉన్నప్పటికీ సుప్రీమ్ కోర్ట్ ప్రభుత్వ పరిశీలనకు పంపడం దురదృష్టకరం. కాబట్టి సుప్రీమ్ కోర్ట్ త్వరగా అన్నీ సాంకేతిక న్యాయ ప్రక్రియలను, పాటిస్తూ ఈ దేశ ద్రోహ నియమాన్ని భారత శిక్షా స్మృతి నుండి శాశ్వతంగా తొలగించాలి. అదేవిధంగా అన్నీ నిర్బంధ చట్టాలను మళ్ళీ సమీక్ష చేయాలి.
– మల్లికంటి వెంకన్న అడ్వకేట్, ఉపాధ్యక్షులు
భారత ప్రజా న్యాయవాదుల సంఘం (IAPL)
9440496422