- సోనియా, రాహుల్ నాయకత్వంలోనే దేశాభివృద్ధి
- సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం
- కోమటిరెడ్డి గైర్హాజరు, హాజరైన జగ్గారెడ్డి
ప్రజాతంత్ర , హైదరాబాద్ : రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. గాంధీ కుటుంబమే దేశానికి శ్రీరామరక్ష అని ఆయన నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడింది. బుధవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం వివరాలను భట్టి విక్రమార్క మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. దేశంలో ప్రస్తుతం అనేక రకాలైన విధ్వంసకర పరిస్తితులు నెలకొని ఉన్నాయనీ, ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ సంపదను ప్రైవేటు శక్తులకు అప్పగించడం, మత చాందసవాదులు మతతత్వ వాదులు జాతిని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. దేశానికి గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందనీ, ఇలాంటి పార్టీని అధికార పక్షం దెబ్బతీసేందుకు కుట్ర పన్నిందని విమర్శించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని సీఎల్పీలో ఏకగ్రీవ తీర్మానం చేశామనీ, దీనికి సంబంధించిన కాపీని ఏఐసిసికి పంపిస్తున్నామని తెలిపారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసమనీ, దేశం కోసం పార్టీ కోసం రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 1970లో కాంగ్రస్ పార్టీ ఇంతకన్నా దారుణంగా దెబ్బతిన్నప్పటికీ 1980లో అనూహ్యంగా పుంజుకుందనీ, అదే రీతిలో కాంగ్రస్ పార్టీ కూడా పుంజుకుంటుందని పేర్కొన్నారు. కాగా సీఎల్పీ సమావేశానికి ఇటీవల పార్టీపై అసమ్మతి గళం వినిపిస్తున్న జగ్గారెడ్డి హాజరయ్యఆరు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్గి గైర్హాజరయ్యారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రిపై వ్యాఖ్యలు చేసిన సందర్భంగా తనకు పార్టీ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలవలేదనే అసంతృప్తితోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్గి సీఎల్పీ సమావేశానికి గైర్జాజరై తన నిరసనను వ్యక్తం చేశారని పార్టీ వర్గాలలో ప్రచారం జరిగింది. కాగా, రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గ పర్యటనలో ఉన్నందునే సీఎల్పీ సమావేశానికి హాజరు కాలేదని కాంగ్రస్ పార్టీ వర్గాలు పేర్కొన్నారు.