దేశం నుండి కుటుంబ పాలనను పారదోలాలి

మోదీతోనే సుస్థిర పాలన సాధ్యం
ఇండియా కూటమిలో ఎవరికి వారే ప్రధాని
అవినీతితో జైళ్లపాలవుతున్న కూటమి నాయకులు
పదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అప్పులపాలు
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం రూ. 10 వేల కోట్లు
కొత్తగూడెం ఎన్నికల ప్రచారంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29 : ఇండియా కూటమిలో ఎవరికి వారే ప్రధాని అవుతామని కలలు కంటున్నా రని బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు జేపీ నడ్డా అన్నారు. ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి తాండ్ర వినోద రావు గెలుపు కోసం సోమ వారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన భారీ  బహిరంగ జనసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లా డుతూ… బిజెపిని గెలిపిస్తే మోదీ ప్రధానిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేశారు. అదే కూటమి అభ్యర్థిని గెలిపిస్తే ప్రధాని ఎవరు అంటూ కొట్టుక చస్తారన్నారంటూ ఎద్దేవా చేశారు. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ ఆడివాసీలను, గిరిజనులను కేవలం వోటు బ్యాంకుగానే చూస్తూ వారికి అన్యాయం చేసిందాన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం ఆడివాసీల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. భదాద్రి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి బిజెపితోనే సాధ్యం అన్నారు. ఇండియా కూటమి అవినీతిపరులతో నిండిపోయిందని, ఇప్పటికే కూటమిలోని సగం మంది జైలు పాలయ్యారని, ఎన్నికల తర్వాత మరికొంతమంది జైలుకు వెళ్తారని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ అధికారం కోసం కులాల మధ్య చిచ్చు పెడుతూ రిజర్వేషన్ల అంశాన్ని తెరమీదకి తీసుకుని వొచికునివొచ్చి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ విషయానికొస్తే అనేక బూటకపు హామీలతో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి నేడు కేంద్రంలో అధికారంలోకి వొస్తేనే అమలు చేస్తామని మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధపడ్డారని విమర్శించారు. గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బిఆర్‌ఎస్‌ వేలకోట్ల ప్రజా ధనాన్ని దోచుకుని తెలంగాణ అప్పులపాలు చేసిందన్నారు. లిక్కర్‌ స్కామ్‌లో ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్‌ కూతురు కవిత జైలు పాలయ్యారని, త్వరలో మరికొంతమంది సైతం జైలుకు వెళ్లక తప్పదు అన్నారు. బిఆర్‌ఎస్‌ పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కంటే  కేంద్ర ప్రభుత్వం రూ10 వేల కోట్ల నిధులతో జరిగిన అభివృద్దే కనిపిస్తుంది అన్నారు. తెలంగాణలో అనేక జిల్లాల్లో రైల్వే స్టేషన్ల అభివృద్ధి నూతన రైల్వే లైన్ల ఏర్పాటు చేసింది బిజెపినే అన్నారు. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుందని ఈ ఘనత ప్రధాని మోదీ, బిజెపి ప్రభుత్వానిదేనన్నారు. మరో 5 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశం నిలవనుందని తెలిపారు.

బిజెపి మూడవసారి అధికారంలోకి రావాలంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న రెండు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ఈ జిల్లా ప్రజలపై ఉందన్నారు. అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి చరిత్ర తిరగ రాసిన నాయకుడిని ప్రజలు కల్లారా చూశారని అన్నారు. ఒక శక్తి మంతమైన ప్రభుత్వం రావాలంటే కాంగ్రెస్‌ పార్టీ లాంటి కుటుంబ వారసత్వ  పార్టీలను కాకుండ బలమైన బిజెపి లాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అన్నారు. ముఖ్యంగా గిరిజనుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం బిజెపి ప్రభుత్వమని అన్నారు. ఆర్థికంగా భారత దేశం బలపడుతుందని భారత దేశాన్ని 11వ స్థానం నుండి 5వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత మోద్నీకే చెందుతుందని అన్నారు. దేశం లోనే పేదరిక నిర్మూలన కోసం గత 10సంవత్సరాల నుండి పాటు పడుతుంది కేవలం బిజెపి పార్టీ మాత్రమే అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో భారత దేశం ముందుకెళుతుందని అన్నారు. ఆటో మొబైల్‌ రంగాల్లో జపాన్‌ ముందు వరుసలో వుండేది కానీ  అందులో కూడా మేక్‌ ఇన్‌ ఇండియా పేరు మీద ముందు వరుసలో ఉన్నామన్నారు. దేశంలో అనేక మార్పులు వొస్తున్నాయని, గత పది సంవత్సరాల్లో మహిళలు, రైతులు, విద్యార్థులు, గ్రామాల గురించి అనేక పథకాలను అందించిన ప్రభుత్వం తమది మాత్రమే అన్నారు.

రాబోయే 5 సంవత్సరాల్లో 7 కోట్ల కుటుంబాలకు గ్యాస్‌ అందించే పథకాన్ని బిజెపి ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం నుండి 3వంతుల ఆర్థిక సహాయం అందిందని   స్టేషన్ల సుందరీకరణతో పాటు కొత్త రైల్వే లైన్ల కోసం  కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని అన్నారు. అంతేగాక గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిన ఘనత బిజెపి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో బిపిఎల్‌ నుండి ఏపీఎల్‌ కి 25 కోట్ల మంది చేరుకున్నారని దానికి కారణం నిస్వార్థపు ప్రభుత్వాన్ని నడుపుతున్న నరేంద్ర మోదీ అని అన్నారు. బిజెపి పార్టీ తరఫున పోటీ చేస్తున్న తమ అభ్యర్థులకు వొటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కొత్తగూడెం బహిరంగ సభలో రాజ్యసభ సభ్యులు ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కె లక్ష్మణ్‌, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, ధర్మారావు, భారీ సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page