- క్రమంగా పెరుగుతున్న కేసుల సంఖ్య
- మద్రాస్ ఐఐటీలో కొరోనా కలకలం..మొత్తంగా 30 మంది విద్యార్థులకు పాజిటివ్
న్యూ దిల్లీ, ఏప్రిల్ 22 : దేశంలో రోజువారీ కొరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా మరో 2451 మందికి కొరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,30,52,425కు చేరాయి. ఇందులో 4,25,16,068 మంది బాధితులు కొరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,22,116 మంది మృతిచెందగా, 14,241 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 54 మంది వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. కాగా1589 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. ఇక మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇప్పటివరకు 98.75 శాతం మంది కోలుకోగా, 1.21 శాతం మంది మృతిచెందారని తెలిపింది. దేశవ్యాప్తంగా 1,87,26,26,515 టీకా డోసులను పంపిణీ చేశామని, గురువారం ఒక్కరోజే 18,03,558 మందికి వ్యాక్సినేషన్ చేశామని పేర్కొన్నది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,87,26,26,515కు చేరింది. మరో 4,48,939 మందికి కొరోనా టెస్టులు నిర్వహించారు.
మద్రాస్ ఐఐటీలో కొరోనా కలకలం..మరో 18 మంది విద్యార్థులకు పాజిటివ్
మద్రాస్ ఐఐటీలో కొరోనా కలకలం సృష్టిస్తుంది. శుక్రవారం మరో 18 మంది ఐఐటీ విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. గురువారం మద్రాస్ ఐఐటీలో 12మంది విద్యార్థులకు కొరోనా సోకిందని తేలింది. మళ్లీ శుక్రవారం పరీక్షలు చేయగా మరో 18 మందికి కొరోనా పాజిటివ్ అని వెల్లడైంది. ఐఐటీ క్యాంపస్‌లో మొత్తం కొరోనా కేసుల సంఖ్య 30కి పెరిగింది.
ఐఐటీ హాస్టల్‌లోనే కరోనా వ్యాప్తి చెందటంతో ఐఐటీ పరిపాలనాధికారులు, వైద్యాధికారులు పారిశుద్ధ్యం మెరుగుపై దృష్టి సారించారు. ఐఐటీలో కరోనా సోకిన వారిలో 90 శాతం మందికి ఒమైక్రాన్ బీఏ 2 వేరియెంట్ అని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ చెప్పారు.