తొలి రాజద్రోహ నేరం మోపబడిన వీరుడు

(1879 అక్టోబర్‌ 22‌న బ్రిటీష్‌  ‌ప్రభుత్వంచే మొదటి రాజద్రోహనేరం మోపబడిన వీరుడు వాసుదేవ్‌ ‌బల్వంత్‌ ‌ఫడ్కే.)

‘‘వాసుదేవ్‌ ‌బల్వంత్‌ ‌ఫడ్కే..ఈ పేరు చాలామందికి తెలియదు. కనీసం వీరి గురించి పుస్తకాలలో కూడా వుండదు.కానీ భారతదేశంలో తొలి దేశద్రోహం కేసు నమోదు కాబడింది ఈ వ్యక్తిమీదే. 15 సంవత్సరాల వయస్సుకే ఆంగ్లేయులపై తుపాకీ ఎక్కుబెట్టిన వీరుడు. బలప్రయోగంద్వారానే ఆంగ్లేయులను తరిమివేయాలని తలచిన యోధుడు.1879 అక్టోబర్‌ 22‌న ఆంగ్లేయప్రభుత్వం మొదటి రాజద్రోహనేరం మోపబడింది ఈ వీరుడిపైనే!

1845 నవంబరు 4 న ఒక పేద రైతుకుటుంబంలో జన్మించిన వాసుదేవ్‌ ‌చిన్నప్పటి నుండి చాలా చురుకైన పిల్లాడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రాథమికవిద్య తన గ్రామమైన షిర్డోన్‌ ‌లోనే పూర్తిచేశాడు.హైస్కూల్‌ ‌విద్యకు పూనాకు వెళ్ళగా ఆంగ్లేయులకు వ్యతిరేఖంగా వ్యవహరిస్తున్నాడని 9 వతరగతిలో స్కూల్‌ ‌నుండి డీబార్‌ అయ్యాడు. సొంతఊరిలో వ్యవసాయం చేస్తూ రైతులపై అధికపన్నులు విధిస్తున్న ఆంగ్లేయులకు ఎదురుతిరిగాడు. కోలి,బిల్లు,దంగర్‌ ఆదివాసీ యువకుల సహాయంతో ఒక గ్రూప్‌ ‌ను తయారు చేసుకున్నాడు. వారికి యుద్ధవిద్యలపై శిక్షణనిచ్చాడు. అప్పటికే ఆంగ్లేయులు అడవులపై ఆంక్షలు విధించివుండటంతో గిరిజనులంతా చాలా అసంతృప్తిగా వున్నారు.వారు వాసుదేవ్‌ ‌తో కలిసి ఎదిరించేందుకు సమాయత్త మైనారు. 1876లో మహారాష్ట్రలో భయంకరమైన కరువు తాండవించినపుడు, ఆంగ్లేయులు ఉన్న పంటనంతటినీ ఎత్తుకుపోతే. వారిపై తిరుగుబాటు చేయడానికి ‘రామొషి’ అనే సైన్యాన్ని ఏర్పాటు చేసి, ఆంగ్లేయ వ్యాపారులను దోచి రైతులకు పంచారు స్వరాజ్య సమరయోధుడు వాసుదేవ్‌ ‌బలవంత్‌ ‌ఫడ్కే.

వాసుదేవ్‌ ‌మొదట ప్రభుత్వ ఖజానాలపై దాడి చేయడం మొదలుపెట్టాడు. అలా కొల్లగొట్టిన డబ్బును రైతులకు, ఆదివాసీలకు పంచేవాడు. ఆయుధాలు సమకూర్చుకొనేవాడు..ఒక ఖజనాపై దాడిలో 1.5 లక్షలు కొల్లగొట్టాడు. పూనాలో వాసుదేవ్‌ ‌బలవంతుడైన తిరుగుబాటు నాయకుడైనాడు.దానితో ఆంగ్లేయులు పెద్దసైన్యంతో అడవులలోనికి పంపారు.కొన్ని రోజులు పూనాను వదిలి హైదరాబాద్‌ ‌కు వచ్చాడు.. అప్పడు హైదరాబాద్‌ ‌పై రోహిల్లాల తిరుగుబాటు జరుగుతుంది. వాసుదేవ్‌ ‌వారితో జతకలిసి నిజాంపై తిరుగుబాటు చేసాడు. రోహిల్లాలతో పాటు అరబ్బులు కూడా ఆయనతో చేతులు కలపారు. అయితే ఆంగ్లేయుల గూఢచర్యులు వాసుదేవ్‌ ఆచూకీ పసిగట్టారు. ఆంగ్లేయులు వారి తలకు 5వేల రివార్డు ప్రకటిస్తే, ప్రతిగా ఆంగ్లేయుల తలకు 10వేలను ఫడ్కే ప్రకటించాడు. భారతీయులపై దుశ్చర్యలకు పాల్పడుతున్న తెల్ల దొరలను అత్యంత ధైర్య సాహసాలతో వాసుదేవ్‌ ‌బలవంత్‌ ‌ఫడ్కే ఎదుర్కొన్నారు.ఫడ్కే తన డైరీలో ‘‘ఈ దేశ ప్రజలందరూ నాలాగా భరతమాత ముద్దుబిడ్డలే. వారంతా అలమటిస్తూంటే, ఏమీ పట్టనట్టుగా జీవించడమనే ఊహే నాకు భయంకరమైనది. వారికి స్వతంత్రం ఇవ్వడం కోసం, అవసరం అయితే నా జీవితాన్ని త్యాగం చేస్తాను’’ అని రాసుకున్నారు. 37 సంవత్సరాలకే అమరుడైనా భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో మొదటి విప్లవనాయకుడిగా వాసుదేవ్‌ ‌ప్రసిద్ది పొందాడు.
– పిన్నింటి బాలాజీ రావు, హనుమకొండ, 9866776286.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *