ప్రభుత్వ తీరును తప్పు పట్టిన బిజెపి ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక
కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : తెల్ల రేషన్ కార్డు ఉంటేనే పథకాలు ఇస్తామని ఎన్నికల్లో ఎందుకు చెప్పలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పడ్డ తరవాత ఇప్పుడు మెలికలు పెడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన కరీంనగర్లో విూడియాతో మాట్లాడుతూ…ఎన్నికల షెడ్యూలు రాకముందే ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే..పథకాలు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పథకాల అమలులో కొర్రీలు పెట్టకూడదన్నారు. గత ప్రభుత్వం దుర్మార్గాలు చేసిందని..ప్రజలను మోసం చేసిందని..కాంగ్రెస్ గత ప్రభుత్వంలా చేయొద్దని బండి సంజయ్ సూచించారు. ఇదే సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై బండి సంజయ్ మండిపాడ్డారు.
భాష పట్ల నేతలు హద్దుల్లో ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు హద్దు విూరుతున్నారని, సీఎంను చెప్పుతో కొడతా అనడం తప్పని, ఇంతకంటే సిగ్గు చేటు ఉంటుందా…అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ అహంకారం బయటకు వొస్తుందని, సీఎం కుర్చీకి గౌరవం ఇవ్వాలని, ముఖ్యమంత్రినే చెప్పుతో కొడతా అనడం కరెక్ట్ కాదని బండి సంజయ్ అన్నారు.
ఇక ఈ నెలలోనే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వొస్తుందని, అందుకే ఈలోపే కాంగ్రెస్ ఇచ్చిన హావిూలు అమలు చేయాలన్నారు బండి సంజయ్. షెడ్యూల్ వొచ్చే దాకా జాప్యం చేసి తప్పించుకునే యోచనలో కాంగ్రెస్ ఉందంటూ ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు బండి. హావిూల అమలుపై దృష్టి మళ్లించాలని కాంగ్రెస్ చూస్తుంటే.. గత ప్రభుత్వ తప్పిదాలు బయటకు రాకుండా ప్రజల దృష్టి మళ్లించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు.





