తెలంగాణా ఆవిర్భావం …సాంస్కృతిక పోరాట ఫలితం

 

మూడు దశాబ్దాలకు పైగా పత్రికా రంగానికి సేవలందిస్తున్న అల్లం నారాయణ 1974 నుంచి 1982 వరకు నక్సల్బరీ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అటు తర్వాత తెలంగాణ ఉద్యమంలోనూ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషి ఈ తరం కు తెలిసిందే … జర్నలిస్టుగా, రచయితగా, కవిగా..తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి ఎంతో దోహదపడ్డారు… అదే స్ఫూర్తి, బాధ్యతతో ప్రస్తుతం మీడియా  అకాడమీ చైర్మన్‌ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అల్లం నారాయణతో ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక ఇంటర్వ్యూ…

మీ బాల్యం, విద్య, సామాజిక ఉద్యమాల్లో ముఖ్యంగా నక్సలైట్‌ ఉద్యమంలో… పాల్గొనడానికి ప్రేరణ, సందర్భాలు..వివరిస్తారా..?
మాది ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మంథని తాలూకా గాజులపల్లి గ్రామం. మంథనికి మా పల్లె ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా గ్రామం నుంచి చదువుల కోసం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. అల్లం రాజయ్య మా పెద్దన్నయ్య… అల్లం వీరయ్య రెండో అన్నయ్య… ఒక చెల్లెలు. మా తల్లిదండ్రులు అల్లం నరసయ్య-బుచ్చమ్మ. ఇద్దరూ కూడా నిరక్షరాస్యులే! మాది మరీ భూసామ్య ఆధిపత్యం ఉన్న ప్రాంతం ఏం కాదుగానీ.. మా అమ్మ వాళ్ల ఊరు పెద్దపల్లి తాలూకాలోని వెన్నంపల్లి. అక్కడే మా ముగ్గురి అన్నదమ్ముల చదువు కొనసాగింది. ఒక విధంగా చెప్పాలంటే మాకు భూస్వామ్యం గురించిన పరిచయం అక్కడే జరిగింది. అప్పుడు పట్వారీ, పోలీస్‌ పటేల్‌ వ్యవస్థలు ఉండేవి కానీ.. ప్రత్యక్షంగా మేము భూస్వామ్యం అంటే చూసింది వెన్నంపల్లిలోనే. అక్కడ దొరలను చూశాం. గడీలను తిలకించాం. ఆ గ్రామంలో ప్రజలు చెప్పులు విడిచి నడిచి తిరిగే పరిస్థితి ఉండేది. నిజానికి మాకు కొంత ఈ ఆధిపత్య భావజాలం మీద అభిప్రాయాలేర్పడడానికి అదొక కారణమయింది. ఇక రెండో కారణం ఏంటంటే.. మా మంథని మాత్రకూటపురం. అంటే బ్రాహ్మణుల ఆధిపత్యం గల గ్రామం. మొత్తం దాదాపు తెలంగాణాలో ధర్మపురి, వేములవాడ, మంథని అగ్రహారాల్లాంటివి. అక్కడ బ్రాహ్మణుల ఆధిపత్యాలుండేవి. బ్రాహ్మణ ఆధిపత్యాల్లో ప్రధానంగా సుద్దరాళ్లు అనే వాళ్లు శూద్రులు. బీసీలందరినీ సుద్దరాళ్లుగా భావించేవారు. మా ఊళ్ళో కూడా వారి మక్తాలుండేవి. అంటే భూములు. వాళ్లు ధనవంతులేం కాదుగానీ.. పూజారులైనా ఇంకెవరైనా మా మీద అదో రకమైన ఆధిపత్య ధోరణి కనబరిచేవారు. వాళ్ల ఇళ్లల్లో అంటే మా నాయన చిన్నపాటి రైతు కాబట్టి మంథనిలో ఆయనకు అందరితో పరిచయాలుండేవి. ఆయన వెంట వెళ్ళినప్పుడు భోజనాలు చేసే సమయాల్లో వాళ్లల్లో ఈ వివక్ష..ఆధిపత్య ధోరణి కనిపించేది. అలాగే ఊరు నుంచి వెళ్లి చదువుకోవడంలో ఒక వెసులుబాటు ఉండేది. అదేంటంటే.. అటు వ్యవసాయం.. ఇటు చదువు రెండూ అబ్బేవి. అప్పుడు చదువుల్లోనూ ఎంతో చురుకుగా ఉండేవాళ్ళం. మా నాయనకు అక్షరజ్ఞానం లేదు. కాబట్టి మమ్మల్ని బాగా చదువుకోవాలని ప్రోత్సహించేవాడు. అక్షరాల విలువను నొక్కి చెప్పేవాడు. ఆయన పట్టుదలే మాకు అక్షరజ్ఞానం నేర్పింది.
అలా సాగిపోతున్న మా జీవనయానంలో ఆ తరువాత కాలంలో మాకు ప్రధానంగా రాజకీయాలు పరిచయం కావడం గానీ.. ప్రధానంగా సమస్యలు రావడానికి కారణం ఏమిటంటే ఒక రకంగా మా అన్నయ్యే! ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు 1969లో మా అన్నయ్య హై స్కూల్‌ సెక్రటరీగా ఉండే. ఆ సమయంలో గుంటూరు గుడిసెలుంటే వాటిని తగలబెట్టడం జరిగింది. అప్పుడు నేను ఏడవ తరగతిలో ఉన్నా. ఇది మూమెంట్‌ కు సంబంధించి మొట్ట మొదటి జ్ఞాపకం. తరువాత మేము గ్రామాల్లోంచి వచ్చిన విద్యార్థులం కాబట్టి మమ్మల్ని బ్రాహ్మణుల పిల్లలు బాగా వేధించే వారు. చదువుల్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ తగిన ప్రోత్సాహం లభించేది కాదు. మా అన్నయ్య ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తరువాత వరంగల్‌ వెళ్ళాడు. అన్నయ్యకు మాకు ఒక కామన్‌ పాయింట్‌ ఏంటంటే మంథనిలో ఒక మంచి లైబ్రరీ ఉండేది. స్కూల్‌ అయిపోయాక మేము లైబ్రరీకి వెళ్లి చదువుకునే వాళ్ళం. అక్కడ మేము చందమామ, బాలమిత్రుల కథలు చదువుకునే వాళ్ళం. ఒక రకంగా మాకు చదువు బాగా అబ్బడానికి మంథని లైబ్రరీ ప్రధాన కారణం అని చెప్పొచ్చు.
అటు తర్వాత మా అన్నయ్య రచనా వ్యాసంగంలోకి మళ్లాడు. ఆయన వరంగల్‌ వెళ్ళాక అక్కడ మిత్రమండలి, వరవరరావు లాంటి వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడ నుంచి ఆయన మేం చదివినవాటికి భిన్నంగా కొంత విప్లవ సాహిత్యం తెచ్చాడు. అప్పటికి మేము పదవతరగతి పూర్తయి ఇంటర్‌ కు వచ్చే దశలో మా అన్నయ్యకి డిగ్రీలో ఇవన్నీ పరిచయమయ్యాయి. అలా వచ్చిన సాహిత్యాన్ని మేము చదవడం ప్రారంభించాం. అట్లా మాకు వాటితో పరిచయం ఏర్పడిరది. దానికి తోడు కరీంనగర్‌ లో అన్నయ్య క్లాస్‌ మేట్‌ ఇంటర్మీడియట్‌ లో మా రూములో ఉండేవాడు. ఆయన మొట్ట మొదలు కరీంనగర్‌ లో విప్లవ రాజకీయాలకు తెరలేపారు. జనవరి 26న స్వాతంత్య్రం బూటకమని కరపత్రాలు పంచిపెట్టి చందుపట్లలో మొదటిసారిగా అరెస్ట్‌ అయ్యాడు. ఆ తరువాత 1974లో ఓ సంఘటన జరిగింది. అదే సమయంలో ఆర్‌.ఎస్‌.యూ మహాసభలు జరిగాయి. పి.డి.ఎస్‌.యూ నుంచి విడిపోయి ఆర్‌.ఎస్‌.యూ ఏర్పడినప్పుడు మేము ఉన్నాం. కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పనిచేశాం. అది మొదలు 1975లో ఫైనల్‌ పరీక్షలకు ముందు కనకయ్య అనే ఒక చౌకీదారు కట్టెలు ఏరుకోవడానికి వెళ్లిన రైతును కొట్టి చంపాడు. తరువాత గద్దర్‌ జననాట్యమండలి ఏర్పడి ఉంది.
1975 జనవరి-ఫిబ్రవరి ఆ ప్రాంతాల్లో మంథనిలో జననాట్యమండలి మొదటి మీటింగ్‌ జరిగినప్పుడు గద్దర్‌ ని ఆహ్వానించాం. అప్పుడు నా వయస్సు 17 సంవత్సరాలు. ఇంటర్మీడియట్‌ చదువుతున్న. ఆ వేదికమీద నేను విద్యార్ధి నాయకుడిగా ప్రసంగం చేశాను. అది మొదలు.. ఆ తరువాత ఎన్నో ఎన్నెన్నో జరిగాయి. ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాసిన తరువాత ఓ సారి అంపశయ్య నవీన్‌ ని పిలిచాం. అప్పుడు అక్కడ ప్రసంగం మీద రచ్చ అయింది. ఆ సమయంలో కృష్ణారెడ్డి మీద దాడి జరిగింది. ఆ దాడిని తిప్పికొట్టడానికి మేము మంథనిలో అయిదారు ఇళ్లపై దాడి చేశాం. కేసులు పెట్టారు. ఇవన్నింటిలో పాల్గొన్న క్రమంలో మా పెద్దన్నయ్యకు ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడు. మా చిన్నన్నయ్యని పార్టీ వాళ్ళు రమ్మని అడిగారు. ఆయన రానన్నారు. ఆ సమయంలో నేను, నా క్లాస్‌ మెట్‌ పోరెడ్డి వెంకట్‌ రెడ్డి ఫుల్‌ టైమర్స్‌ గా ఉండిపోయాం. ఇక ఎమర్జెన్సీ జూన్‌ లో వచ్చింది. అదే సమయంలో కరీంనగర్‌ లో కొండపల్లి సీతారామయ్యతో పొలిటికల్‌ క్లాస్‌ లను ఏర్పాటు చేశాం. కానీ. మేము బస్సులో పోతుంటే ఎమర్జెన్సీ ప్రకటన వచ్చింది. మేము మళ్లీ వెనక్కీ వచ్చేశాము.
కానీ మళ్లీ పార్టీతో కాంటాక్ట్‌ లో ఉండి ప్రజల్లో కలిసి పనిచేయడానికి నేను, నాతో పాటు జగన్‌, కృష్ణారెడ్డి, గజ్జల గంగారాం అనే నలుగురం ముందుకు నడిచాం. అలా మేము నలుగురం ట్రైనింగ్‌ చేసిన క్రమంలో కాంటాక్ట్‌ మిస్‌ అయిన జగన్‌, కృష్ణారెడ్డి బయటికి వెళ్లిపోయారు. మా నాయకుడు కొల్లూరు చిరంజీవి, నేను ఇద్దరం అక్కడ ఉన్నాం. ఆ ఇద్దరూ సిద్దిపేట లాడ్జీలో పోలీసులకు చిక్కారు. అరెస్ట్‌ అయ్యారు. వాళ్ల వద్ద సమాచారం తీసుకున్న పోలీసులు గంభీరావుపేటలో ఉన్న మా వద్దకు వచ్చారు. అలా మొట్టమొదటి సారిగా 1975 సెప్టెంబర్‌ లో నేనూ, గజ్జల గంగారాం అరెస్ట్‌ అయ్యాం. ఆ తరువాత మా ఫాదర్‌ బెయిల్‌ తో ఇద్దర్నీ బయటికి తెచ్చారు. 75-76 మళ్ళీ పార్టీలోకి వెళ్ళాం. తర్వాత కేసులు.. దాదాపు ఆరు నెలలు ఆరుగురం పోలీస్‌ లాకప్‌ లోనే ఉన్నాం. అది ఆంధ్రప్రదేశ్‌ లోనే రికార్డుకెక్కింది. భార్గవ కమిషన్‌ దగ్గరికి పోయిన కేసు ఇది. ఎమర్జెన్సీ ఎత్తేసిన తరువాత మమ్మల్ని కోర్టుకిచ్చారు. జనతా పాలన వచ్చింది. అటు తర్వాత మేము మళ్లీ ఫుల్‌ టైమర్లుగా వెళ్లి పోయాం. ఈ క్రమంలోనే జగిత్యాల జైత్రయాత్ర (1978)లో కూడా అక్కడ ఉన్నవాళ్లలో నిర్బంధం ఉన్నప్పుడు మేము దాదాపు వంద ఊళ్లలో సమావేశమయ్యాం. జగిత్యాల జైత్రయాత్ర వేదిక మీద గద్దర్‌ ను పక్కన కూర్చోబెట్టుకొని మల్ల రాజిరెడ్డి దొర, నేను వీధిబాగోతం వేశాం. అది ఒక కీలకమైన మలుపు. దాదాపు 73 నుంచి 82 దాకా పీపుల్స్‌ వార్‌ ఫుల్‌ టైమర్లుగా .. రెండేళ్ల జైలు జీవితం.. రెండుసార్లు చిత్ర హింసలు.. అటు విద్యార్ధి నాయకునిగా అరవై గ్రామాల్లో పనిచేశాం. దాదాపు తొమ్మిదేళ్ల ఈ ప్రయాణంలో ఎన్నో ఒడి దుడుకులు.. మరెన్నో చిత్ర హింసలు చవిచూశాను.
1982లో బయటికి వచ్చాం. తరువాత ఉస్మానియాలో సింగిల్‌ డి.ఏ రాసి తరువాత నాగ్‌పూర్‌ లో కొన్ని రోజులు. అలా బయటికి వచ్చాక కూడా పోలీసులు 12 కేసులు పెట్టారు ఎం.ఏ. సోషియాలజీ చేసిన నాపై కేసులు ఉండడం వల్ల గోల్డ్‌ మెడల్‌ కూడా మిస్‌ అయింది. 1982లో ఉస్మానియాలో అడుగుపెట్టా. 1984లో వివాహం జరిగింది. భార్య అల్లం పద్మ. ఇటీవలే కాలధర్మం చెందారు. 1985 జనవరి నుంచి ‘జీవగడ్డ’తో మరో కెరీర్‌ ప్రారంభం అయింది. ఎందరో జర్నలిస్టులను ‘జీవగడ్డ’ వెలుగులోకి తెచ్చింది. చిన్న పత్రిక అయినప్పటికీ దాని ప్రభావం ఎంతో ఉండేది. ఎందరో జర్నలిస్టులకు ఆ పత్రిక మార్గదర్శిగా నిలిచింది. అటు తర్వాత 1985 నవంబర్‌ లో ఆంధ్రప్రభలో బెంగుళూరులో అడుగుపెట్టి 1987 ఏప్రిల్‌ వరకు పని చేశా. అయితే.. 87 తరువాత ఇక్కడున్న కేసులవల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగేది. 1987 ఏప్రిల్‌ నుంచి ఆగస్ట్‌ వరకు ఆంధ్రజ్యోతి విజయవాడలో పని చేసి.. 1989, ఆగస్టులో హైదరాబాద్‌ కు రావడం జరిగింది. 2000లో ఆంధ్రజ్యోతిని మూసివేశారు. అటు తర్వాత దేవులపల్లి అమర్‌, సలంద్రల ప్రేరణతో ఆంధ్రభూమిలో అవకాశం వచ్చింది. కానీ చేరలేదు. చిన్న పత్రికలు నడిపా. తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచిన ‘ప్రజాతంత్ర’లో ఏడాదిపాటు అసిస్టెంట్‌ ఎడిటర్‌ గా చేశా. 2002లో ఆంధ్రజ్యోతి పునప్రారంభించినప్పుడు న్యూస్‌ ఎడిటర్‌ గా చేశా. 2014లో తెలంగాణ మీడియా పెట్టాలని కేసీఆర్‌ పిలుపునందుకొని ‘నమస్తే తెలంగాణ’ స్థాపించడంలో వ్యవస్థాపక సంపాదకునిగా వ్యవహరించాను. మామూలు పత్రికగా ప్రారంభమైన దానిని 2లక్షల సర్క్యులేషన్‌ స్థాయికి తీసుకెళ్ళాం. .. తర్వాత  ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ గా పదేళ్లుగా రెండు పర్యాయాలు కొనసాగుతున్నా.ఇది పత్రికారంగం…
వీటన్నింటికి మించి నా జీవితంలో రెండు ఉన్నాయి. ఒకటి నక్సల్బరీ ఉద్యమం.. అయిపోయాక కూడా అది నన్ను అంటుకొని ఉంది. విరసంలో కూడా పనిచేశా. ఇక నా రెండోది మొట్ట మొదటిసారి 2001 మే 31. అప్పటికి టి.ఆర్‌.ఎస్‌. ఏర్పడి నాలుగు నెలలు అయింది. మే 31 అని ఓ పుస్తకం వేశా. తర్వాత తెలంగాణ జర్నలిస్ట్‌ ఫోరం పెట్టాము. రెండు వేల మంది జర్నలిస్టులను కదిలించి దిల్లీ కి తీసుకెళ్లగలిగింది. పార్లమెంట్‌ పక్కన మీటింగ్‌ పెట్టి మొత్తం మందిని దాదాపు అన్ని పార్టీలను ఏకం చేసి వాయిస్‌ ఇప్పించడం జరిగింది. ఇది ఇప్పటికీ చరిత్ర. ఇక మూడవది అన్నింటికంటే మించి గద్దర్‌, కేసీఆర్‌ , మిగతా పార్టీలు విడిగాను ఉన్న సమయంలో 2007లో హైదరాబాద్‌ లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో గొప్ప మీటింగ్‌ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్‌ లోనే కేసీఆర్‌, గద్దర్‌ అలయ్‌ బలాయ్‌ తీసుకున్నారు. అదే సమయంలో ఇతర పార్టీల్లో ఉన్న పోచారం శ్రీనివాస్‌ లాంటి వాళ్లకు కనువిప్పు కాగలిగింది.అన్నింటికీ మించి మిలియన్‌ మార్చ్‌ జరిగినప్పుడు మొట్టమొదటి గేట్లు తోసింది మన జర్నలిస్టులే. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్బంధం వచ్చినప్పుడు విద్యార్థుల వెంట నిలబడిరది టీజేఎఫ్‌. ఆఖరిగా టీజేఎఫ్‌ అత్యంత విషయమేమిటంటే బిల్లును అడ్డుకుంటరు అనుకున్నప్పుడు కేసీఆర్‌ గారు నాకు ఫోన్‌ చేసి మీరే చేయగలరు అని చెప్పారు. ఆ సమయంలో మీటింగ్‌ పెడితే 56 మంది పోలిటికల్‌ ప్రతినిధులు వచ్చారు. తెల్లారితే అసెంబ్లీ. బిల్లును రక్షించుకుని పాస్‌ చేయించుకోగలిగాం. తెలంగాణ గురించి అన్ని విషయాలు తెలిసిన పాశం యాదగిరి, నేను జిల్లాలు తిరిగి జర్నలిస్టులను ఐక్యం చేశాం. ఇది టీజేఎఫ్‌ చరిత్ర.


తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష మీకు ఎప్పుడు ..అంటే ఏ వయస్సులో కలిగింది?
నేను ఆరో తరగతిలో ఉండంగా మా ఊరిలో గుంటూరు గుడిసెలు తగులబెట్టారు. అప్పుడు ఉద్యమం అంతా కూడా తోడ్‌పోడ్‌ ఉండే. ఆంధ్రోళ్లను ఎల్లగొట్టడం… బస్సులు కాలబెట్టడం.. అల్లర్లు చేయడం.. మా దగ్గర గుంటూరోళ్ళు ఉండే ఓ కాలనీ ఉండే. మంథని పక్కన ఓ ఫ్యాక్టరీ ఉండేది. అక్కడికి స్కూల్‌ అంతా వెళ్లి గుంటూరు గుడిసెలు తగులబెట్టడడం జరిగింది. ఇది ఫస్ట్‌ ఎక్స్‌ పీరియెన్స్‌. అప్పుడు ప్రత్యక్షంగా మా అన్న అరెస్ట్‌ కూడా అయిండు. తరువాత 1996 నుంచి తెలంగాణ గురించి విపరీతంగా చదవడం.. ఆలోచించడం.. తెలంగాణ కోసమే తపించడం మరీ ఎక్కువయింది. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన ప్రతీ మలుపులో ఐడియాలజీతోటి, తెలంగాణ వాదంతోటి రాసిన ఏకైక కాలం ప్రాణహిత. సర్వ స్వతంత్రంగా ఉండి ముందడుగు వేయడం జరిగింది. మరణించిన తెలంగాణ అమరవీరుల గురించి ఆలోచించే వాళ్లం. కేసీఆర్‌ తో చర్చించే వాళ్లం.
క్రియాశీలకంగా తెలంగాణ ఉద్యమంలో ఎప్పటినుంచి పని చేసారు?
క్రియాశీలకంగా ఒకటేమో ఆరవ తరగతిలో జరిగిన గుంటూరు గుడిసెలు తగులబెట్టినప్పుడు అని చెప్పలేం కానీ.. 1996 నుంచి మాత్రం క్రియాశీలకంగా తెలంగాణ ఉద్యమంలో అహర్నిశలు అందరితో కలిసి పనిచేయడం జరిగింది.
తెలంగాణా కల సాకారమవుతుంది అని మీరు ఆశించారా…?
తెలంగాణా కల సాకారమవడం విషయంలో చాలాసార్లు నిరాశ కలిగేది. ఎందుకంటే నేను వచ్చిన రాజకీయ నేపథ్యం వల్ల నేను కొంచెం మిలిటెన్సీని కోరుకునే మనస్తత్వం కలవాడిని. వామపక్ష రాజకీయాల నుంచి వచ్చిన వారందరు కుడా అదే ధోరణిలో ఉండే వారు. కేసీఆర్‌ తో చర్చ జరిగినప్పుడు కూడా ఈ విషయాల గురించి మాట్లాడేవాళ్ళం. ఏం సార్‌ ఇట్లయితున్నది.. మీరు పట్టించుకోరా వాళ్ళు చచ్చిపోతున్నారు..వీళ్ళు చచ్చిపోతున్నారు అని అడిగే వాళ్ళం. ఇలా చాలాసార్లు నిరాశ కలిగిన సందర్భాలు ఉండేవి. ముఖ్యంగా మీడియా రంగంలో వచ్చిన మార్పులు బాగా కలత పెట్టాయి. ఆ సమయంలో మీడియా అంతా ఏదో సాకులు చెప్పి వ్యతిరేక స్వభావాన్ని చాటుకున్నాయి. డిసెంబర్‌ 9 ప్రకటన మొట్ట మొదటి నమ్మకాన్ని ఇచ్చింది. ఓహో… ఇక తెలంగాణా కల సాకారమవుతుందనిపించింది. దానికితోడు మూమెంట్స్‌ లో వచ్చిన కొన్ని ఫలితాలు నమ్మకాన్ని మరింత పెంచాయి. మనం ఎంత వద్దనుకున్నా కూడా మిలిటెంట్‌ రూపం వచ్చింది. అదొక సాంస్కృతిక పోరాటం. నిజానికి చాలామంది కోరుకోలేదు మిలియన్‌ మార్చ్‌. ఎంత అణచివేత వస్తున్నా కూడా ఇది ప్రజాస్వామ్య ఉద్యమం కాబట్టి ఫలితాన్ని ఇచ్చింది.

నిరాశకు గురి చేసిన ఉద్యమ లేదా రాజకీయ పరిణామాలు.. మలి దశ ఉద్యమంలో మీ రోల్‌…రాష్ట్ర విభజన లాబీయింగ్‌ వల్లనా… ఉద్యమం ద్వారా సాధ్యమయిందా…?
నా పాత్ర మలి దశ ఉద్యమంలో ఎందువల్ల సాధ్యమయిందంటే నా బ్యాక్‌ డ్రాప్‌ వల్ల. ఎందుకంటే నేను పీపుల్స్‌ వార్‌ లో ఒక గుడ్‌ ఆర్గనైజర్‌ ని. 60 ఊర్ల నాయకుడిని. ఈ నాయకత్వం అనేది నా జీవితంలో వృథాగా పోలేదు. ఉద్యమం ద్వారానే సాధ్యమైందని చెప్పొచ్చు …

తెలంగాణ పునర్నిర్మాణం గురించి కాస్త వివరంగా చెప్పండి…?
తెలంగాణ పునర్నిర్మాణం అనేది ఒక విస్తారమైన సబ్జెక్ట్‌. తెలంగాణకు ఏవైతే నీళ్లు..నిధులు..నియామకాలు అనుకుంటామో వాటి కోసం ప్రయత్నాలు చేసుకోవడమే పునర్నిర్మాణం. అందులో భాగంగానే చెరువులను భద్రపరచుకోవడం.. .మిషన్‌ కాకతీయను మరచిపోలేం… మన నిధులను మనమే ఖర్చు పెట్టుకోవడం. ఇక నియామకాలకు సంబంధించి మొదటి పీరియడ్‌ ని గోల్డెన్‌ పీరియడ్‌ గానే చెప్పొచ్చు. ఎందుకంటే అవినీతిరహితంగా గంటా చక్రపాణి చైర్మన్‌ గా ఉన్న కమిషన్‌ 35వేల ఉద్యోగాలని ఆరేళ్లలో నియమించిన ఘనత ఉంది. ఇలా ఐదారేళ్ల కాలంలో 35 వేల ఉద్యోగాలని ఇచ్చిన సందర్భం ఇదివరకెప్పుడూ జరగలేదు.

రాష్ట్రంలో కొందరు నిరుద్యోగ యువత నియామకాల పట్ల ఆందోళన, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..
నిరుద్యోగ యువత నియామకాల పట్ల ఆందోళన, అసంతృప్తి వ్యక్తం చేయడంలో అర్థం ఉంది. వారి ఆవేదనను మనం తోసి పుచ్చలేం. ఎందుకంటే మనం తెలంగాణ గురించి చెప్పినప్పుడల్లా ఈ విషయాలే ఎక్కువగా మాట్లాడినం. రాష్ట్రంలో ఖాలీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం ఇది పరిష్కరించాల్సిన విషయం. పరిష్కరిస్తుందని చిత్తశుద్ధితో నమ్ముతున్న. నిరుద్యోగ యువత ఈ విషయం లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఆంధ్ర పారిశ్రామికవేత్తలకు, సినిమా పరిశ్రమ కు తెలంగాణా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలంగాణవాదుల అభిప్రాయం..?
సినిమారంగం గురించి మనం గొప్పగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సినిమా పరిశ్రమ కు తెలంగాణా ప్రభుత్వం ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నప్పటికీ వారి నుంచి సరైన ప్రతిస్పందన లభించడంలేదు.

రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా పాల్గొన్న జర్నలిస్టులకు … వారికి అండగా నిలిచిన పత్రికలకు.. స్వరాష్ట్రంలో సముచిత స్థానం దక్కింది అని మీరు భావిస్తున్నారా..?
పత్రికలకు సంబంధించి.. నేను మళ్లీ చెబుతున్నా చిన్న పత్రికలను ఎంకరేజ్‌ చేయడంలో మొదట్లో కొన్ని సమస్యలొచ్చినప్పటికీ అన్ని పరిష్కరించడం జరిగింది. ప్రభుత్వపరంగా వారికి అన్ని విధాలా అందాల్సిన సహకారం లభిస్తూనే ఉంది. తప్పని సరిగా చిన్న పత్రికలను ఎంతగానో ఎంకరేజ్‌ చేసినం. ఒక రెండేళ్లు అడ్వర్టైమెంట్స్‌ రాలేదు. ఎంపానెల్‌ పెట్టి ఇప్పుడు ఏడాది నుంచి అడ్వర్టైమెంట్స్‌ ఇస్తున్నారు. ఇలా.. అందరికీ సమ న్యాయం జరిగిందని నేను భావిస్తున్నా.

జర్నలిస్టు గా, రచయితగా, కవిగా.. మీరు తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి ఎంతో దోహదపడ్డారు… అదే స్ఫూర్తి, బాధ్యతతో రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణా సమాజానికి మీరు ఇచ్చే సందేశం…
తెలంగాణ సమాజం నానుంచి బాగా ఆశించిందనేది నిజం. నేనున్న తీరు, స్వభావం. రాసిన రాతల వల్ల కావొచ్చు. అలాగే జర్నలిస్ట్‌ ప్రయోజనం నాకు ఎంతో ముఖ్యం. 2014 జూలై 14న తెలంగాణ ప్రెస్‌ అకాడమీ తొలి చైర్మన్‌ గా నియమితులయినప్పటినుంచి జర్నలిస్టులకు ఇండ్లు, హెల్త్‌కార్డులు, అక్రెడిటేషన్ల మంజూరు విషయమై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో చర్చిస్తూనే ఉన్నా. ముఖ్యమంత్రి నుండి ప్రెస్‌ అకాడమీకి వచ్చిన రూ.20 కోట్ల నిధులతో జర్నలిస్టుల సంక్షేమనిధిని ఏర్పాటుచేసి, అధ్యక్షుడి వ్యవహరిస్తున్నాను. తెలంగాణ మీడియా  అకాడమీ చైర్మన్‌ పదవిని పొడిగించడం మూడోసారి జరిగింది. జర్నలిస్టులకు పెన్షన్‌ ఇస్తున్నాం. 15 కోట్లతో బిల్డింగ్‌ పూర్తయింది. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో, ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎప్పుడూ కేసీఆర్‌ తో చర్చిస్తూనే ఉన్నాం. అన్నీ సజావుగానే జరుగుతాయన్న ఆశ నాకుంది.

-మొహమ్మద్‌ అబ్దుల్‌,
ప్రజాతంత్ర డెస్క్‌ ఇంచార్జ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page