ఎనుమాముల మార్కెట్‌లో రికార్డులు బద్ధలు కొడుతూ మరింత పైపైకి
ప్రజాతంత్ర, వరంగల్, ఏప్రిల్ 4 : ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చి ధర వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో అన్ని రికార్డులనూ బద్ధలుకొడుతూ రోజురోజుకూ పెరుగుతున్నది. రాష్ట్రంలోని ఇతర వ్యవసాయ వ్యవసాయ మార్కెట్లలోనూ మిర్చి ధర రికార్డు స్థాయిలో పలుకుతుంది. అయితే రైతుల వద్ద పంట అయిపోయే దశలో ధరలు ఇంతగా పెరగడం రైతన్నలను నిరాశకు గురిచేస్తున్నది. ఒకరిద్దరు రైతుల వద్ద ఆసల్యంగా పంట రావడంతో అధిక ధరలకు అమ్ముకున్నారని, కొద్ది రోజుల క్రితం వరకూ రూ.25 నుంచి రూ.28 వేలకు పరిమితమైన మిర్చి ధర ఒక్కసారిగా జెట్ స్పీడ్‌లో దూసుకెళ్లి క్వింటాల్ దేశీయ మిర్చి ధర తులం బంగారం ధరను దాటేసింది. సోమవారం వరంగల్ ఏనుమముల వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్ మిర్చి ధర రికార్డు స్థాయికి చేరుకుని 55,551 రూపాయలు పలికింది. ఇప్పుడు అమ్ముకుంటున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లకు పెద్ద ఎత్తున తేజా రకం మిర్చి అమ్మకానికి వొస్త్తుంది. తేజా రకం మిర్చికి ప్రధానంగా చైనా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాలలో డిమాండ్ ఉంది. ఆయా దేశాలకు ఎగుమతులు ఉంటే ధరలు మరింతగా పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
ఏడాది అధిక వర్షాలతో పాటు వైరస్ కారణంగా మిర్చి పంట బాగా దెబ్బతిన్నది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వైరస్.. మిరప పంటను దెబ్బ తీసిన కారణంగా దిగుబడి తగ్గి ధరలు ఆకాశాన్నంటాయి. మిర్చి ధరలు బహిరంగ మార్కెట్?లో రికార్డులు నమోదు చేసినప్పటికీ ఎక్కువ దిగుబడి లేకపోవడంతో కొంతమేర రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.