‌ట్రాక్టర్‌ ‌బోల్తా-ఐదుగురు మృతి

  • ఏడుగురికి గాయాలు
  • మెరుగైన చికిత్స కోసం ఎంజీఎంకు తరలింపు
  • ఖానాపూర్‌ ‌మండలం పర్శ్యతండాలో విషాదం  

నర్సంపేట, మే 18(ప్రజాతంత్ర విలేఖరి) : ట్రాక్టర్‌ ‌బోల్తాపడిన ఘటనలో ఐదుగురు మృతి చెందిన సంఘటన ఖానాపురం మండలం అశోక్‌ ‌నగర్‌ ‌శివారు పర్శ్య తండాలో బుధవారం జరిగింది. దీంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఖానాపూర్‌ ‌మండలం పర్శ తండాకు చెందిన గుగులోతు ధన్‌ ‌సింగ్‌ ‌కుమార్తె వివాహం త్వరలో సరుగనుండగా వివాహానికి కావలిసిన సామాగ్రి కొనుగోలు చేయడానికి కుటుంబ సభ్యులు 12 మంది ట్రాక్టర్‌లో నర్సంపేటకు బయలు దేరారు. మార్గమద్యలోని అశోక్‌ ‌నగర్‌ ‌శివారులోని దూసంద్రం చెరువు కట్టపైకి ట్రాక్టర్‌ ఎక్కే క్రమంలో డ్రైవర్‌ ‌నిర్లక్ష్యంతో ట్రాక్టర్‌ అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టి కట్ట కింద పడిపోయింది. దీంతో ట్రాక్టర్‌ ‌ట్రక్కులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు హాస్పిటల్‌ ‌చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఇందులో భార్యాభర్తలు జాటోతు గోవింద్‌ (55), ‌జాటోతు బుచ్చమ్మ(35), మరోజంట గుగులోతు స్వామి(40), గుగులోతు కాంతమ్మ(38), మరో కుటుంబానికి చెందిన గుగులోతు సీత (30) మృతి చెందారు. దీంతో పర్శ్య తండా శోకసంద్రంలో మునిగింది. దుర్ఘటనపై ఖానాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దుర్ఘటనపై మంత్రి ఎర్రబెల్లి తీవ్ర దిగ్భ్రాంతి.. మృతులకు సంతాపం, కుటుంబాలకు సానుభూతి…ఘటన పూర్వాపరాలపై అధికారులతో మాట్లాడిన మంత్రి
వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ వరంగల్‌ ‌జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్‌ ‌వద్ద ట్రాక్టర్‌ ‌బోల్తాపడిన ఘటనలో ఐదుగురు మృతి చెందడంపై రాష్ట్ర పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్‌ ‌చేసి, జరిగిన ఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. వారి బంధువులకు తన సానుభూతి ప్రకటించారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాగా ఈ ఘటన పట్ల మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రయాణీకులు, ప్రజలు, పోలీసు అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు.

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది  పరామర్శ
మృతుల కుటుంబాలను హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి పరామర్శించి మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా, అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ వేములపల్లి ప్రకాష్‌ ‌రావు, బత్తిని శ్రీనివాస్‌ ‌పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *