“ఎటువంటి సమర్ధత లేకపోయినా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయి, జడ్జి అయి, సుప్రీం కోర్టు జడ్జి అయి… ఇదంతా ఒక వరుసలో జరిగిపోతుంది. ఇవన్నీ నిబద్ధతగల వ్యక్తులకు ఇస్తున్నవి కాదు. అవన్నీ కూడా అప్పటికే అగ్రవర్ణాలకు చెందిన ఒక వ్యక్తి పదవిలో పైకి పోవడానికి ఏమేమి చేస్తాడో అవన్నీ చేయడం నేర్చుకుని, అవే పనులు చేసిన సంపాదించుకున్న పదోన్నతులు.”
అటువంటి తప్పుడు విశ్లేషణలు ఈ చట్టంలోకి గూడా జొరబడినాయి. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధ చట్టంలో ప్రత్యేకంగా స్పెషల్ కోర్టుగా, నేరుగా సెషన్స్ కోర్టు విచారణ జరిపే వీలు కల్పించినారు. ఎందుకంటే, ఇటువంటి అత్యాచారాల మీద విచారణ ఆలస్యం జరగకూడదు, తొందరగా అయిపోవాలి అని. కాని మళ్లీ ఇక్కడ కూడా మొదట మెజిస్ట్రేట్ కోర్టుకు పోయి , అక్కడ కమిట్ చేయించి ఆ తర్వాతనే సెషన్స్‌కు పోవాలి అని విశ్లేషణ చేశారు.
మానవహక్కుల పరిరక్షణ చట్టంలో కూడా అంతే. ఆ చట్టం ప్రకారం సెషన్స్ కోర్టు మావన హక్కుల కోర్టుగా వ్యవహరించాలి అని నిబంధన పెట్టారు. దానికి కూడా ఒక మెలిక పెట్టారు. స్పెషల్ కోర్టు అన్నారు గాని కమిటల్ స్టేజి లేదనలేదు. కాబట్టి కింది కోర్టులో కమిటల్ కావలసిందే అన్నారు. ఈ వివాదాలన్నిటి ఉద్దేశ్యం ఏమిటంటే, విచారణ సంవత్సరాల తరబడి ఆలస్యం చేయడమే. ఒక వేళ కమిటల్ స్టేజిని ఎంత తగ్గించి నిబంధనలు విధించినప్పటికి, మొత్తం న్యాయ వ్యవస్థలోని అన్ని విభాగాలూ ఆ దశను ఒక వాదవివాద క్రీడగా మార్చి వీలైనంత ఎక్కువ ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.. మరీ ముఖ్యంగా అది మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించినదయినప్పుడు తప్పకుండా అది ఒక క్రీడ అయిపోతుంది. అది కేవలం బాధితులకు మాత్రమే క్రీడ కాదు, వాళ్లకది ఒక నిత్య నిర్భందం, హింసాభరితమైన కాలయాపన. మిగిలిన వాళ్లందరికి అది క్రీడే. పోలీసులకు న్యాయవాదులకు, ప్రాసిక్యూటర్లకు, న్యాయమూర్తులకు అందరికీ అది క్రీడే.అంటే ఏ ఒక్కరికీ ఉండవలసినంత నిబద్ధత లేదు. రాజ్యాంగస్ఫూర్తిపట్ల, రాజ్యాంగ నియమాలపట్ల నిబద్ధత ఉండాలి. ఆ రాజ్యాంగ నియమాల వెలుగులో అధికారిక సూత్రాలను వ్యాఖ్యానించాలనే నిబద్ధతుండాలి. కాని ఇప్పుడు జరుగుతున్నదేమంటే అధికారులు తమకు వీలున్న సూత్రాలు తయారు చేస్తారు. వాటిని సమర్థించేలా రాజ్యాంగ నియమాలను వ్యాఖ్యానిస్తారు.
కింది వర్గాల నుంచి పైకి వచ్చి అధికారిక స్థానాలలో కూచున్న వారికి కూడా ఆ బద్ధత ఉండడంలేదు. ఒక కారణం అట్లా వచ్చిన వారు తమ తోటి వారు అనుభవించినంత పీడనను అనుభవించకనైనా పోయి ఉండాలి. లేదా, అట్లా అధికారి స్థానాలకు వచ్చిన వాళ్లు అక్కడికి రావడానికి పెద్ద కులాల వాళ్లు ఎంత అవినీతికి పాల్పడతారో వీళ్లూ అంతగా అవినీతికి పాల్పడి వచ్చి ఉండాలి. అలా కాకపోతే వాళ్లు ఆ స్థానానికే రారు. కింది వర్గాల నుంచి పైకి ఎదిగి వచ్చి అత్యున్నత అధికార పీఠాలు చేపట్టిన వాళ్లు ఎవరయినా ఉంటే, చాలా సందర్భాలలో వాళ్లు నిజంగా పీడనను, వేదనను అనుభవించి వచ్చినవాళ్లు కాదు. అగ్రవర్ణాల వాళ్లు ఎంత పైరవీ చేసి ఆ పదవులకు వస్తారో వీళ్లు కూడా అంత పైరవీ చేయడం నేను చూశాను. ఒకవేళ వాళ్లు అంత పైరవీ కార్లు కానట్టయితే ఆ స్థానానికి రావడమే కష్టం.
సమస్య ఏమంటే, ఒక ప్రత్యేక వ్యక్తిని, ఉదాహరణకు ఒక షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని, ఒక ఉన్నత పదవికి సిఫారసు చేయాలనుకోండి, ఆ ఉన్నత పదవిలో నియమించాలనుకోండి. సాధారణంగా ఈ పైరవి అంశమే పనిచేస్తుంది. నిజంగా ఉన్నత పదవికి అవసరమైన నిబద్ధత, సామర్థ్యం గల వ్యక్తిని ఎంచుకునే బదులు ఆ వృత్తిని తీసుకుంటారు. ఎటువంటి సమర్ధత లేకపోయినా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయి, జడ్జి అయి, సుప్రీం కోర్టు జడ్జి అయి… ఇదంతా ఒక వరుసలో జరిగిపోతుంది. ఇవన్నీ నిబద్ధతగల వ్యక్తులకు ఇస్తున్నవి కాదు. అవన్నీ కూడా అప్పటికే అగ్రవర్ణాలకు చెందిన ఒక వ్యక్తి పదవిలో పైకి పోవడానికి ఏమేమి చేస్తాడో అవన్నీ చేయడం నేర్చుకుని, అవే పనులు చేసిన సంపాదించుకున్న పదోన్నతులు.నేను ఒక వాస్తవ ఉదాహరణ చెపుతాను. ఒక షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని జడ్జి పదవికి ఎంపిక చేయాలనుకోండి. ఆ నిర్ణయం చేసే అవకాశం నాకు ఉంటే, నేను బొజ్జా తారకం గారిని ఆ పదవికి సూచిస్తాను. నిజానికి ఆయన జడ్జిని చేయడం చాలా అనివార్యమైన ఎంపిక, ఆ పదవికి ఆయనకంటే సమర్ధులు దొరకరు. కాని ఇప్పుడున్న పద్ధతిలో ఎవరినో ఒకరిని వెతికి పట్టుకుని నియమిస్తారు.అసలు ఇట్లా వెతికి పట్టుకుని పదవిలో నియమించడమనేదే ఒక తప్పుడు పద్ధతి. విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ పదవికి చూడండి. ఒక విసిని నియమించాలంటే, సర్చ్ కమిటీ అని ఒకటి వేసి వెతకడం
అట్లాగే ఒక హైకోర్టు జడ్జి పదవికి ఎవరినైనా ఎంపిక చేయాలంటే, కళ్ల ఎదురుగా ఉన్న వ్యక్తులందరినీ వదిలేస్తారు. ఓపెన్ కోర్టులో తెలుస్తుందిగదా, ఏ న్యాయవాది ఎంత బాగా వాదించగలడు, ఎంత నీతిమంతుడు, ఎంత మంచి ప్రాక్టీసు ఉంది, ఎంత శక్తి ఉంది, అందరికీ తెలుసు. జడ్జీలకు తెలుస్తుంది. కేవలం వాళ్ల వాదనలు వినడం ద్వారానే జడ్జీలకు ఏ న్యాయవాది సమర్థుడో ఎవరు కాదో స్పష్టంగా తెలిసిపోతుంది. కాని వాళ్లనే వదిలివేస్తారు.
ఇప్పటి వరకూ నేను వివరించినటువంటి కేసులలో న్యాయం చెప్పాలంటే హైకోర్టు జడ్జీగా ఒక ఛాందసుడు, మూఢ విశ్వాసాలు గలవాడు జడ్జిగా ఉంటే ఏం ప్రయోజనం? ఒక వేళ అటువంటి వాడు అక్కడి జడ్జీగా ఉన్నాడనుకోండి. కులం పట్ల తప్పుడు అభిప్రాయాలు ఉన్నవాడు, దళితులు అణగి ఉండవలసిందే అనుకునేవాడు, అగ్రవర్ణాలకు కింది కులాల వారి మీదెంత దౌర్జన్యం అయినా జరిపేందుకు హక్కు ఉన్నదనుకునే వాడు జడ్జీగా ఉంటే ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? ఎటువంటి న్యాయం జరిగే అవకాశం ఉంది? మొత్తం మీద నేను చెప్పేదేమంటే, 1984 సిక్కుల ఊచకోత కానీయండి, బాబ్రీమసీదు అనంతరం ముస్లింల మీద జరుగుతున్న దౌర్జన్యాలు కానీయండి, గుజరాత్ మారణకాండ కానీండి, దళితుల మీద ఎడతెగకుండా జరుగుతున్న హింస కానీయండి, ఇటువంటి దారుణ దమనకాండల విషయంలో ఈ దేశంలో న్యాయవ్యవస్థ న్యాయం అందించడంలో విఫలమైంది. ఈ ఘటనలలో బాధితులకు న్యాయసహాయం అందించడంలో మన న్యాయ వ్యవస్థ సంపూర్ణంగా పనికి రాకుండా పోయింది.
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం