గ్యాంగ్ స్టర్ లకైనా దొరుకుతుంది కానీ.. హక్కుల కార్యకర్తలకు బెయిల్ దొరకదు

  • కోర్టులో ఒక బెంచి ఒక విదంగా, మరో బెంచి మరో విదంగా తీర్పు
  • ‘మీట్ ది ప్రెస్’లో మానవ హక్కుల కార్యకర్త జీఎన్.సాయిబాబా 
  • ఉపా ఎంత దుర్మార్గమైనదో సాయిబాబా జైలు జీవితమే సాక్ష్యం
  • ప్రొఫెసర్ జి.హరగోపాల్
  • భావ ప్రకటన స్వేచ్చకు కేంద్రంగా ‘బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్’
  • సాయిబాబా ‘మీట్ ది ప్రెస్’ను వ్యతిరేకించడం సరైంది కాదు
  • టియుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యకుడు కె.విరహత్ అలీ
హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : దేశంలో గ్యాంగ్ స్టర్లకు సైతం బెయిల్ దొరుకుతుందని హక్కుల కార్యకర్తలకు మాత్రం బేయిల్, పెరోల్ దొరకదని దిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్, మానవ హక్కుల కార్యకర్త ఇటీవల నాగాహర్ జైలునుంచి విడుదలైన ప్రొఫెసర్ జీఎన్.సాయిబాబా అన్నారు. కోర్టులో ఒక బెంచి ఒక విదంగా, మరో బెంచి మరో విదంగా తీర్పులు ఇస్తాయని, కన్నతల్లి చనిపోతే శవాన్ని చూడటానికి కూడా పెరోల్ ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మహారాష్ట్ర జైళ్లు కులానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని, జైలుకు వొచ్చే ఖైదీలకు కులాన్ని బట్టి సౌకర్యాల కల్పన ఉంటుందని సంచలన వాఖ్యలు చేశారు. కొత్తగా జైలుకు వొచ్చిన వారిని గుట్టు చప్పుడు కాకుండా సిసి కెమరాలు లేని ప్రాంతాల్లో ఉంచి చిత్ర హింసలకు గురి చేస్తారని దీంతో ఆ నేరస్తుడికి జైలు అంటే భయం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా ముద్ర వేసిన వారికి మహారాష్ట్ర జైళ్లలో చిత్రహింసలు తప్పవని జైలు మాన్యువల్ లోనే  ఈ విషయాలు ఉన్నాయని ఆరోపించారు.
మావోయిస్టుగా ముద్ర వేసి పదేళ్లపాటు నాగాపూర్ జైల్లో ఉండి ఇటీవల విడుదలైన ప్రొఫెసర్ సాయిబాబాతో శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో టియుడబ్ల్యుజె మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జీఎన్.సాయిబాబా గచ్చిరోలి పోలీసులు వ్యవహరించిన తీరు జైళ్లలో పరిస్థితులపై సంచలన ఆరోపణలు చేశారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టడం వల్లనే తనను అక్రమంగా అరెస్టుచేసి జైళ్లో పెట్టారని ఆరోపించారు. తనను అరెస్టు చేసి జడ్డిముందు హాజరు పరచినప్పుడు పోలీసు కస్టడికి ఇవ్వాలని అడిగితే పోలీసు అధికారులు వద్దని నేరుగా జైలుకు పంపించాలని జడ్జికి విన్నవించారని, తాను ఏ నేరం చేయలేదన్న విషయం మహారాష్ట్ర పోలీసులు అంగీకరించారని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్ర జైళ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో ఆ రాష్ట్ర మాజీ హోంమంత్రి జైలుకు వెళ్లి వొచ్చిన తరువాత చేసిన ఆరోపణలు ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. మహారాష్ట్ర పోలీసులు తన వీల్ చైర్ ను ధ్వంసం చేసి చిత్ర హింసలకు గురిచేసి తరువాత జైలుకు తరలించారని ఆరోపించారు. నాగపూర్ జైలు లో  కనీసం వీల్ చైర్ తిరగలేని సెల్ లో బంధించారని  తొమ్మిది నెలలు కనీసం హాస్పిటల్ కు కూడా తీసుకెళ్లలేదని కేవలం పెయిన్ కల్లర్ టాబ్లెట్స్ ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పదేళ్ల జైలు జీవితం చీకటి రోజులని 21 రకాల అనారోగ్య సమస్యలు తాను ఎదుర్కొన్నానని ఆయన చెప్పారు. ఎన్ని నిర్బందాలు విధించినా తెలంగాణ సాధన ఉద్యమ అడుగు తన ఊపిరిలో సజీవంగానే ఉందని ఉపా చట్టానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విలువల కోసం ఆదివాసీ హక్కుల కోసం అధ్యాపకుడిగా, మానవ హక్కుల కార్యకర్తగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.  ఈ మీట్ ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ జి.హరగోపాల్ మాట్లాడుతూ ఉపా చట్టం ఎంత దుర్మార్గమైనదో ప్రొ.సాయిబాబా జైలు జీవితం సజీవ సాక్ష్యమని అన్నారు. ఉపా చటాన్ని రద్దు చేయాలని, బలమైన ఉద్యమం రావాలని, ఈ చట్టంపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని కోరారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ మాట్లాడుతూ, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ భావ  ప్రకటన స్వేచ్చకు కేంద్రంగా నిలిచిందని కొంతమంది ప్రొఫెసర్ సాయిబాబా మీట్ ది ప్రెస్ ను వ్యతిరేకించడం సరైంది కాదన్నారు. ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో  టీయుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి వరకాల యాదగిరి, హెచ్.యూ.జే అధ్యక్షులు శిగ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఉక్కు కౌగిలి నుంచి బయటపడ్డ తెలంగాణ 
1997 వరంగల్ డిక్లరేషన్ లో తాను ప్రతిపాదించిన ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం అన్న నినాదం ఇప్పటికీ సజీవంగా ఉందన్నారు. పాలకులు ఎవరైనా …పార్టీలు ఏవైనా తాము ప్రదిపాదించిన ప్రజాస్వామిక తెలంగాణ డిక్లరేషన్ వారి టేబుల్ పై ఎప్పటికీ ఉంటుందని సాయి బాబా అన్నారు .  తెలంగాణ ప్రజా ఉద్యమాలు తనకు నిజమైన చదువును నేర్పాయని ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ హరగోపాల్ తనుకు స్పూర్తిగా నిలిచిచారని ప్రొఫెసర్ సాయిబాబా పేర్కొన్నారు. కొత్త రాష్ట్ర  ఏర్పాటు ఉక్కు కౌగిలినుంచి తెలంగాణ ప్రజలు బయట పడటమేనని ఆయన పేర్కొన్నారు. కాళోజి అన్నట్లు తెలంగాణ సమాజం సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం లోని రెండు జిల్లాలు ..రెండు కులాల కు మాత్రమే పరిమితమయిన పాలనకు వ్యతిరేకంగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమం ప్రపంచానికి  మార్గదర్శిగా నిలిచిందన్నారు . కొత్త రాష్ట్రంలో ప్రజల జీవన విధానంలో మార్పు కనిపిస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page