- భదాద్రి కొత్తగూడెం ఎస్‌పి సునీల్ దత్
- ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు – ఒకరు అరెస్ట్
కొత్తగూడెం, ఏప్రిల్ 26(ప్రజాతంత్ర ప్రతినిధి) : మావోయిస్టులు సిద్ధాంతాల పేరుతో అమాయక గిరిజనుల హక్కులను హరిస్తున్నారని ఎస్పీ సునీల్ దత్ అన్నారు. ఇద్దరు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మహిళా సభ్యులు 141 సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఎదుట లొంగిపోగా మరో మావోయిస్టును అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఎస్‌పి వివరాలు వెల్లడించారు. చర్ల మండల లోకల్ గొరిల్లా స్క్వాడ్ సభ్యురాలు(ఎల్‌జిఎస్) ముస్కి సుక్కి అలియాస్ విమల, లోకల్ ఆర్గనిగింగ్ స్క్వాడ్ సభ్యురాలు (ఎల్‌ఓఎస్) మడకం ప్రమీల అలియాస్ పాలెలను చిన్నతనంలో మావోయిస్టు పార్టీలో బలవంతంగా రిక్రూట్ చేసుకున్నారని తెలిపారు. మావోయిస్టు పార్టీ నాయకులు మైనర్ గిరిజన బాలికలను చివరకు మావోయిస్టు పార్టీ నాయకత్వ దోపిడీకి బలయ్యామని తెలుసుకుని పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు చెప్పారు. మావోయిస్టులు తన భావజాలాన్ని విస్తరించేందుకు గిరిజనుల, బాలల హక్కులను ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ నాయకులు ఆజాద్, దామోదర్, రాజి రెడ్డి, మధు, గిరిజన మైనర్ బాలికలను అపహరించి బలవంతంగా వంట చేయడం, బట్టలు ఉతకడం, సామాన్లు మొయ్యాలంటూ నీచమైన పనులు చేయమని బలవంతం చేస్తూ చిత్ర హింసలకు గురిచేస్తున్నట్లు చెప్పారు.
మహిళా క్యాడర్, పిల్లలతో మావోయిస్ట్ నాయకులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, గిరిజన యువతులను సీనియర్ నాయకులను పెళ్లి చేసుకోమని బలవంతం చేయడం, లైంగికంగా వేధించడం చేస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టు సీనియర్ నాయకుడు దామోదర్ గిరిజన యువతి రజితను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని, మావోయిస్ట్ నాయకులు దిగువ క్యాడర్‌లకు మౌలిక అవసరాలను తీర్చడంలో నిర్లక్ష్యం వహిస్తూ, డబ్బు వసూలు చేయాలని కింది క్యాడర్‌ను ఆజాద్, రవి వేధింపులకు గురిచేసినట్లు పేర్కొన్నారు. చివరకు మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలకు గిరిజనులు, గ్రామస్తులు, మహిళా కార్యకర్తలు విసుగు చెందారని, ఈ కారణం చేత లొంగిపోదానికి సిద్దపడ్డారని ఎస్పీ అన్నారు. మావోయిస్టు నాయకులు, దళం సభ్యులు, మిలీషియా సభ్యులందరూ శాంతియుత సమాజ అభివృద్ధి, అభివృద్ధిలో భాగం కావాలని విజ్ఞప్తి చేశారు.
దుమ్ముగూడెం మండలంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు వాహనాలు తనిఖీ చేస్తుండగా సుకుమా జిల్లా బాలంతోగు గ్రామానికి చెందిన మడకం రామ అలియాస్ రామ్లా, రమేష్, రాజు ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మావోయిస్ట్ 4, 8వ ప్లాటూన్ ఇన్‌చార్జి ముచ్చకి యర్రా ఆదేశాల మేరకు పోలీసు సిబ్బందిని హతమార్చాలనే ఉద్దేశంతో మారాయిగూడెం, కొత్తపల్లి రహదారి మధ్యలో ల్యాండ్ మైన్ అమర్చేందుకు వొస్తుండగా దుమ్ముగూడెం పోలీసులకు పేలుడు పదార్థాలతో పట్టుబడ్డాడని అన్నారు. అతని వద్ద నుండి పేలుడు పదార్థాలు, వైర్, బ్యాటరీ, ల్యాండ్ మైన్. మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్, రూ 47 వేలు స్వాధీనం చేసుకుని, కేసు నమోదుచేసి కోర్టులో హాజరు పరుస్తారని తెలిపారు. మావోయిస్టు ఘటనలతో పాల్గొన్నాడని, రామ్ల కుంట ఏరియా కమిటీ సభ్యునిగా, సౌత్ బస్తర్ డివిజన్‌కు చెందిన సప్లై టీమ్‌కు ఇన్‌చార్జ్‌గా కూడా పనిచేస్తున్నాడని చెప్పారు.