గెలుపే ధ్యేయం..అందుకు ఎంతవరకైనా సరే.. ఇది నేటి పోలిటికల్ పార్టీల తీరు. వోటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఈ కాలంలో రాజకీయ పార్టీలు ఎంతకైనా దిగజారడానికి సిద్దపడుతున్నాయి. ఎన్నికలంటే ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే ఒక పక్రియ. ఎవరు పాలనకు అర్హున్నది వోటర్లే నిర్ణయిస్తారు. అలాంటి వోటు హక్కు నేడు అపహాస్యం పాలవుతున్నది. పవిత్రమైన వోటు హక్కు ప్రలోభాలపాలవుతున్నది. దీంతో సరైన నాయకత్వాన్ని ప్రజలు పొందలేకపోతున్నారు. స్వాతంత్య్రం వొచ్చిన కొత్తలో డబ్బు అవసరమున్న కొందరు మాత్రమే ఈ ప్రలోభాలకు లొంగిపోయేవారు. ఇప్పుడు వొ టర్లలో చాలామంది తమకు అవసరం ఉన్నా లేకున్నా రాజకీయ పార్టీలు ఇస్తున్న తాయిలాలను తీసుకుంటున్నారు. రాజకీయ నాయకులంటేనే అక్రమ సంపాదనపరులన్న పేరుంది. వారు ప్రజలను అక్రమంగా దోచుకున్న దానిలో మనకు మొక్కుబడిగా కొంత సమర్పించుకుంటున్నప్పుడు తీసుకుంటే తప్పేంటటా? అన్నది కొందరి వోటర్ల అభిప్రాయం. ఇటీవల జరిగిన ఎన్నికలను పరిశీలించినప్పుడు చదువుకున్నవారు కూడా ఇలాంటి కక్కుర్తి పడిన విషయాలు వెలుగులోకి వొచ్చాయి. ఇంటిలో ఎంతమంది వోటర్లుంటే అన్ని వెయ్యిలో వందలో లెక్కగట్టి దాదాపు అన్ని పార్టీలు ఇచ్చిపోతున్నాయి. ఎవరికో ఒకరికి మాత్రమే వోటు వేయాల్సిన వోటరు అందరిదగ్గర దర్జాగా డబ్బు తీసుకుంటున్నాడు.
మొదట్లో సారా పొట్లాలు, ఆ తర్వాత చిన్న మొత్తాల్లో డబ్బును ముట్టచెప్పి అభ్యర్థులు తమ పబ్బం గడుపుకునేవారు. అయితే ఇప్పుడు ఆ తాయిలాల స్థాయి మించిపోయింది. ఏకంగా వస్తువుల పంపిణీకి చేరుకుంది. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అయితే లాంతర్లు మొదలుకుని రేడియోలు, టివిలు, ఫ్రిజిల వరకు వెళ్ళాయి. మన తెలుగు రాష్ట్రాల్లో యువకులకు క్రికెట్ కిట్స్ , తీసుకునే వారికి బ్రాండీ సీసాలను అందజేసేవారు. వాటితోపాటు బిర్యాని పొట్లాలు అందజేస్తున్నారు. తాజాగా పొట్టేలు మాసం, చికెన్ ఇస్తున్నట్లుగా ఇటీవల వార్తలు వొస్తున్నాయి. మన ప్రజాస్వామ్యం ముసలిదై పోతున్నకొద్దీ వోటు ధరకూడా అదేరీతిలో పెరిగి పోతున్నది. ఇప్పుడు ఒక వోటు వెయ్యి దాటి వేల సంఖ్యలోకి మారింది. వోటుకు పదివేల రూపాయలవరకు ఇవ్వడానికి అభ్యర్థులు సిద్దపడుతున్నారు. ఇది నీతిగా, నిజాయితీగా తమ వోటు హక్కును వినియోగించుకోవాల్సిన వోటరు తన హక్కును బేరం పెట్టే స్థితికి దిగజార్చింది. ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన రాజకీయ నాయకులే ఇందుకు కారణమవుతున్నారు. వారి తాత్కాలిక ప్రలోభాలకు లొంగిన వోటరు తాను వోటు వేసి గెలిపించిన వ్యక్తి తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలవల్ల మోసపోకతప్పడంలేదు. విచిత్రమేమంటే వోటర్లను ప్రలోభపెట్టే రాజకీయ పార్టీలు తాము మాత్రం బుద్ది మంతులమన్నట్లు ఎదుటివారి తప్పులను బయటపెట్టే ప్రయత్నం చేయటం పరిపాటి. ఇలా ఒకరిపై ఒకరు చేసుకునే ఆరోపణలతో ఇరుపార్టీల గుట్టు రట్టవుతూనే ఉంది. మరి వీటన్నిటిపై డేగ కన్ను వేయాల్సిన ఎన్నికల కమిషన్ ఎంక్వయిరీ అంటూ చేసే తాత్సర్యం ఎన్నికలు ముగిసి, ఫలితాలు ప్రకటించేవరకు సాగుతూనే ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నికలో రాజకీయ పార్టీలు ఎన్ని వేల కోట్లను ఖర్చు చేయడానికి సిద్ద పడ్డాయన్న విషయాన్ని ఆయా పార్టీల పరస్పర ఆరోపణలే బహిర్ఘతం చేస్తున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని భారతీయ జనతాపార్టీ ఎలాంటి అవినీతికి పాల్పడుతున్నదన్న విషయాన్ని తెలంగాణరాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు తాజాగా ఒక మీడియా సమావేశంలోనే చెప్పుకొచ్చారు. అభ్యర్థి గెలుపుకోసం బిజెపి తమ పార్టీతోపాటు, ఇతర పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి కోట్లాది రూపాలను వెచ్చించేందుకు సిద్దపడ్డదని ఆయన ఆరోపించిన విషయం తెలియందికాదు. వారికోసం 200 బ్రిజా కార్లు, రెండు వందల మోటార్ సైకిళ్ళను బిజెపి బుక్ చేసిందన్న సంచలనాత్మక విషయాన్ని వివరించారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బిజేపిలో చేరడానికి 22వేల కోట్ల కాంట్రాక్టును కేంద్రంనుండి పొందాడని మరో మంత్రి కెటిఆర్ ఆరోపిస్తున్నారు. వాటిల్లోనుండి అయిదే వేల కోట్లు ఈ ఎన్నికల్లో ఖర్చు చేయడానికి ఆయన సిద్దంగా ఉన్నట్లు కెటిఆర్ ఆరోపణ. అంటే ఎన్నికోట్ల రూపాయలు చేతులు మారనున్నాయన్నది అర్థమవుతున్నది. అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణరాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి కూడా అదేతరహా ఆరోపణ చేశాడు.
ఈ ఎన్నికల్లో ముప్పై వేల కోట్లు ఖర్చు చేయడానికి తమ పార్టీ మినహా అన్నట్లు రాజకీయ పార్టీలు సిద్దపడ్డాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే అధికార పార్టీ ఇప్పటికే సంక్షేమ పథకాలను అందజేసే పనిలో భాగంగానే ఆ నియోజకవర్గంలో చేయాల్సినంత చేసిందన్న ఆరోపణలున్నాయి. కాగా తాజాగా పథకాల పేరున మరికొంత డబ్బును లబ్ధిదారులకు అందజేసే పనిలో ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం గొర్రెల పంపిణీలో నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో సుమారు ఏడువే ఆరు వందల మంది లబ్దిదారులకు తొంభై కోట్లు వారివారి ఖాతాల్లో నగదును బదిలీ చేసిందని వారు ఆరోపిస్తున్నారు. ముదిగొండలో జరిగేది కేవలం ఉప ఎన్నికలు మాత్రమే. అభ్యర్థి కాలపరిమితి15 నెలలు మాత్రమే. అయినా రాజకీయ పార్టీలు ఈ స్థానాన్ని దక్కించుకోవడమన్నది ప్రతిష్టగా తీసుకుంటూ కోట్లాది రూపాయలను మంచి నీళ్ళ ప్రాయంగా వెచ్చించడానికి సిద్దపడ్డాయి.




