కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం

  • 24 గంటల డెడ్‌లైన్‌…‌ ధాన్యం సేకరణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి
  • జాతీయ విధానం రావాలి…ఉత్తమ విధానం తీసుకుని వొస్తే మద్దతు
  • కేంద్రానికి ఎదురుతిరిగితే సిబిఐ, ఈడి దాడులు
  • పీయూష్‌ ‌గోయల్‌ ‌కాదు.. గోల్‌మాల్‌ ‌గోయల్‌
  • ‌కేంద్రం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టి రైతులను కూలీలను చేసే ప్రయత్నం
  • రైతులు బిక్షగాళ్లు కాదు…రోడ్లపైకి వొచ్చిఉద్యమిస్తారు
  • చేతులు జోడించి విజ్ఞప్తి.. తెలంగాణ రైతులు పండించిన ధాన్నాన్ని కొనండి
    దిల్లీ దీక్షలో సిఎం కెసిఆర్‌

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 11 : ‌కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజులు, రైతులు సిద్ధంగా ఉన్నారని, తాడోపేడో తేల్చుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తేల్చిచెప్పారు. కేంద్రానికి కెసిఆర్‌ 24 ‌గంటల డెడ్‌లైన్‌ ‌విధించారు. 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. కొత్త ధాన్యం సేకరణ, రైతాంగ విధానం తీసుకుని రావాలని, అందుకు తాముకూడా అండగా నిలుస్తామని అన్నారు. అలా చేయని పక్షంలో తామే కొత్త పాలసీని రూపొందింస్తామని అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లం..ధాన్యం సేకరణ కోసం కూడా ఉద్యమిస్తామని అన్నారు.  దేశంలోని రైతులు భిక్షగాళ్లు కాదు.. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి వొస్తారని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. తాము పంట మార్పిడి చేయమని గ్రామగ్రామాన ప్రతి రైతుకూ చెప్పామని గుర్తు చేశారు. తాము దిల్లీ వొచ్చి దీక్ష చేస్తుంటే బిజెపి హైదరాబాద్‌లో ధర్నా చేయటం సిగుచేటని ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రధాని దగ్గర డబ్బు లేదా..లేదా ప్రధానికి మనసు లేదా అని కెసిఆర్‌ ఈ ‌సందర్భంగా ప్రశించారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ ‌రంగానికి అప్పగించి రైతులను కూలీలుగా మార్చే ప్రయత్నం జరుగుతుందని ఆయన మండిపడ్డారు.

కేంద్రానికి ఎదురుతిరిగితే సిబిఐ, ఈడి దాడులు..
కేంద్రానికి ఎదురు తిరిగితే సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దాడులు చేయిస్తారు. బీజేపీలో అందరూ సత్యహరిశ్చంద్రులే ఉన్నారా? వాళ్ల దగ్గరకు ఈడీ, సీబీఐ వెళ్లదు.. ప్రతి రాష్ట్రంలో ఇతర పార్టీల నాయకులను బెదిరిస్తున్నారు. సీఎంను జైలుకు పంపుతామని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు. దమ్ముంటే రావాలని సవాల్‌ ‌విసిరారు. ఊరికే మొరగడం సరికాదని కేసీఆర్‌ అన్నారు. కేంద్రం పంట మార్పిడి చేయాలని సూచించినట్లు తాము రైతులకు చెప్పామని కేసీఆర్‌ ‌గుర్తు చేశారు. కానీ ఉద్దేశపూర్వకంగా రైతులు ధాన్యం పండించండి.. మేము కొంటామని కిషన్‌ ‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కూడా రైతులను రెచ్చగొట్టాడు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని తాము ఢిల్లీలో ధర్నా చేస్తే.. పోటీగా బీజేపీ నేతలు హైదరాబాద్‌లో ధర్నా చేస్తున్నారు. అసలు వాళ్లకు సిగ్గుండాలని కేసీఆర్‌ ‌విమర్శించారు.

ఏ ఉద్దేశంతో బీజేపీ నేతలు హైదరాబాద్‌లో ధర్నా చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందన్నారు. అంతిమ విజయం సాధించేంత వరకు విశ్రమించేది లేదని కేసీఆర్‌ ‌తేల్చిచెప్పారు. రైతుల పట్ల మోసపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్‌ అ‌గ్రికల్చర్‌ ‌పాలసీ రూపొందించాలని కేంద్రాన్ని కేసీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. లేకుంటే మోదీని తరిమికొడుతామని హెచ్చరించారు. వొచ్చే ప్రభుత్వంతో ఆ పాలసీని రూపొందిస్తామని స్పష్టం చేశారు. మోదీకి ధనం కావాలి లేదా వోట్లు కావాలి. ధాన్యం వద్దు.. ఇదే వి• ప్రభుత్వ కుట్ర అని కేసీఆర్‌ ‌నిప్పులు చెరిగారు. రైతులకు కనీస మద్దతు ధర వొచ్చే వరకు పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. రైతుల సంక్షేమం కోసం జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్‌ ‌తికాయత్‌తో కలిసి పని చేస్తామని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజానీకం తికాయత్‌ ‌వెంట ఉంటుందని చెప్పారు. రాకేశ్‌ ‌తికాయత్‌ను కేంద్రం ఎన్ని విధాలుగా అవమానించిందో మనమంతా చూశామని తెలిపారు. తికాయత్‌ను దేశద్రోహి అన్నారు.. ఉగ్రవాది అన్నారు. రైతుల కోసం అవమానాలు భరిస్తూనే ముందుకు సాగుతున్నారని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు.

చేతులు జోడించి విజ్ఞప్తి.. తెలంగాణ రైతులు పండించిన ధాన్నాన్ని కొనండి
మోదీ, పీయూష్‌ ‌గోయల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను..తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని కోరుతున్నానని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. కేంద్రం ఒకవేళ కొనకపోయినా అందుకు సిద్ధమని, తాము మాత్రం నిరంతరం పోరాటం చేస్తూ ముందుకుసాగుతామని కెసిఆర్‌ అన్నారు. తాము పేదవాళ్లమేమీ కాదని, రెండు మూడు రోజుల్లో ధాన్యం కొనుగోలుపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ధాన్య కొనుగోలుపై తాము ఎందుకు దిల్లీ రావలసి వొచ్చిందో కేంద్రం తెలుసుకోవాలని అన్నారు. దిల్లీలోని తెలంగాణ భవన్‌ ‌వేదికగా టీఆర్‌ఎస్‌ ‌పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్‌ ‌పాల్గొని మాట్లాడుతూ..తెలంగాణ రైతులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు.

ప్రధాని మోదీని గద్దె దించే సత్తా కూడా రాష్ట్ర రైతులకు ఉందని సిఎం కెసిఆర్‌ ‌హెచ్చరించారు. ఇదివరకే ప్రధాని మోదీ రైతులకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వొచ్చిందని సాగు చట్టాల రద్దు సందర్భంగా ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పిన అంశాన్ని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ ‌గుర్తు చేశారు. తెలంగాణ నుంచి సుమారు 2 వేల కి.వి•. దూరం వొచ్చి దీక్ష చేస్తున్నామని, ఇంత దూరం వొచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరని సిఎం అన్నారు. నరేంద్ర మోదీ…ఎవరితోనైనా పెట్టుకో..కానీ రైతుల వద్ద మాత్రం పెట్టుకోవద్దని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని, కేంద్రం ధాన్యం కొనాలని తాము దిల్లీలో దీక్ష చేస్తున్నామని అన్నారు. దీక్షకు మద్దతిచ్చేందుకు వొచ్చిన జాతీయ రైతు సంఘం నేత రాకేశ్‌ ‌తికాయత్‌కు కెసిఆర్‌ ‌ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన తండ్రి మహేంద్ర తికాయత్‌ ‌దేశం మెచ్చిన రైతు నేత అని కొనియాడారు. తండ్రిబాటలో రాకేశ్‌ ‌కూడా ఉద్యమిస్తున్నారని, ఇటీవల ఆయనకు దేశం యావత్తూ మద్దతుగా నిలిచిందన్నారు. తాము కూడా ఆయనకు మద్దుతగా రైతుల కోసం పోరాడుతామని అన్నారు. ఉద్యమాల పోరాట ఫలితంగా 2014లో తెలంగాణ వొచ్చిందని కేసీఆర్‌ ‌గుర్తు చేశారు. రాష్ట్రం వొచ్చాక రైతుల కోసం అనేక సంస్కరణలు తెచ్చామని తెలిపారు. తాము రైతులకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అం‌దిస్తున్నామని, మిషన్‌ ‌కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించామని, ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నామని, సాగుకు సరిపడా నీటిని అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో కోటి ఎకరాల భూమి సాగులోకి వొచ్చిందన్నారు.

ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్‌లో విద్యుత్‌ ‌కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయని కేసీఆర్‌ ‌తెలిపారు. ఇదే సందర్భంలో కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిప్పులు చెరిగారు. దేశంలో భూకంపం సృష్టిస్తామని.. పీయూష్‌ ‌గోయల్‌ ‌పరుగులు తీయాల్సిందేనని కేసీఆర్‌ ‌హెచ్చరించారు. హిట్లర్‌, ‌నెపోలియన్‌ ‌వంటి అహంకారులు కాలగర్భంలో కలిసిపోయారు..పీయూష్‌కు ఎందుకు ఇంత అహంకారమని కేసీఆర్‌ ‌నిలదీశారు. పీయూష్‌ ‌గోయల్‌ ఉల్టాపల్టా మాట్లాడుతున్నారని, ఆయనకు రైతులపై ఏమైనా అవగాహన ఉందా అంటూ ప్రశ్నించారు. పీయూష్‌ ‌గోయల్‌ ‌వి•రు ఇంత సంస్కారహీనంగా ఎలా మాట్లాడారంటూ సూటిగా ప్రశ్నించారు. తమ రైతులను, మంత్రులను అవహేళన చేశారని కేసీఆర్‌ ‌మండిపడ్డారు. కేంద్ర మంత్రి తెలంగాణ రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా బాధకరమైనవని, పీయూష్‌ ‌గోయల్‌ ‌తెలంగాణ అన్నదాతలు నూకలు తినాలని చెప్పారని, మేమేమైనా గోయల్‌ ‌వద్ద అడుక్కోవడానికి వొచ్చామా అని, పీయూష్‌ ‌గోయల్‌ ‌కాదు.. పీయూష్‌ ‌గోల్‌ ‌మాల్‌ అని విమర్శించారు. దేశ వ్యాప్తంగా ఎక్కడా లేనంతగా 30 లక్షల బోర్లు తెలంగాణలో ఉన్నాయని, మోటార్‌, ‌విద్యుత్‌ ‌తీగలు, బోర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో సాగు రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. స్వరాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేశామన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం ఏది బాగుపడలేదని, ధాన్యం సేకరణకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని తాము డిమాండ్‌ ‌చేస్తున్నామని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల అనంతరం తాము  తమ వ్యూహాలు, ప్రణాళికలు రచించుకుని ముందుకు సాగుతామని సిఎం కెసిఆర్‌ ‌తెలిపారు. వేదికపై మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

దేశ్‌కీ నేతా కెసిఆర్‌…‌ దేహంపై రాతలతో వ్యక్తి ఆకర్షణ
ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ‌వేదికగా టీఆర్‌ఎస్‌ ‌చేపట్టిన దీక్ష సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్‌ ‌పరిసరాలు మొత్తం గులాబీ మయం అయ్యాయి. ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌నేతల కటౌట్లు, బ్యానర్లు వెలిసాయి. ప్రజా ప్రతినిథులతోపాటు అభిమానులు దిల్లీ దీక్షకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. నెత్తిన వడ్ల బస్తా..ఒంటి నిండా గులాబీ రంగు పూసుని వచ్చిన ఓ యువకుడు దేశ్‌ ‌కీ నేత కేసీఆర్‌ అని రాసుకుని ప్రత్యేక ఆర్షణగా నిలిచాడు. మరో వ్యక్తి తన ఒంటిపై రైతు గొంతుక కేసీఆర్‌ అని రాసుకుని ముఖ్యమంత్రి పోరాటానికి మద్దతు తెలిపాడు. చేతిలో టీఆర్‌ఎస్‌ ‌జెండా పట్టుని వొచ్చిన ఆయన రాష్ట్ర రైతాంగానికి సీఎం కేసీఆర్‌ ఆశాజ్యోతి అని చెప్పారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. నలుపు రంగు వస్త్రాలు ధరించిన సండ్ర.. వరి కంకులతో సభాస్థలికి చేరుకున్నారు. ఆకుపచ్చ రంగు తలపాగ ధరించి రైతులకు సంఘీభావం ప్రకటించారు. కావడికి ముందు మోదీ ఫొటోను, వెనుకాల వరికంకులను ఉంచి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నలుపు రంగు వస్త్రాలు ధరించి దీక్షకు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page