విద్యార్థులకు పురుగులన్నం పెడతారా
ట్విట్టర్ వేదికగా మండిపడ్డ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : కేసీఆర్కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవని మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇటీవల జరిగిన ఫుడ్ పాయిజన్పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషితమైన ఆహారం తిని మొత్తం 36 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన అధికార పార్టీ టీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. పురుగలన్నం పెట్టి పేదపిల్లల ప్రాణాలతో చెలగాటమాడే సర్కారును ఏ పదాలతో విమర్శించాలి? అంటూ ఆగ్రహం చెందారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవని విమర్శించారు.
అసలు ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా అని ప్రశ్నించారు. పేద బిడ్డలకు నాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికి అని దుయ్యబట్టారు. భోజనం తినేముందు ఆత్మపరిశీలన చేసుకో కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు లోనవుతూనే ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు.




