సీమాంద్ర పాలనలో ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం, లాంటి ఆసుపత్రులు తీవ్ర నిర్లక్ష్యానికి గురైనాయి. తెలంగాణ సమాజానికి దావాఖానాలు దూరం జరిగినాయి. మొత్తం వైద్యమంతా ప్రైవేటు రంగంలో భాగం కావడంతో నిరుపేదలైన తెలంగాణ ప్రజలకి వాటిని భరించగలిగే స్థోమత లేకపోయింది. వైద్యం ఖరీదు కావడంతో కార్పొరేట్ దవాఖానాల గేటు తడితే స్వల్పంగా 15 నుంచి 20 లక్షలు దాటే పరిస్థితి వచ్చింది. మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలకు కూడా సామాన్య ప్రజలు వైద్య ఖర్చు భరించలేని స్థాయికి దాటిపోయింది. ఇలాంటి దుస్థితిలో వైద్యం ప్రభుత్వ రంగంలో అందాలనే డిమాండ్ మొదలైంది. 1990 తర్వాత వచ్చిన వైద్య వ్యవస్థ అంతా కూడా దోపిడీ వ్యవస్థగా తయారై ప్రజలను పీడించడం మొదలు పెట్టినాయి. వీటికి పరిష్కారంగా తెలంగాణ ఉద్యమం ఆకాంక్షలను వెదజల్లింది. ఉద్యమ వెలుగులోనే ఉచిత వైద్యాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వమే అందుకు బాధ్యత తీసుకోవాలనే డిమాండ్ బలంగా పెరిగింది. నిమ్స్ తరహా దవాఖానాలు ప్రతి జిల్లా కేంద్రంలో రావాలసిన అవసరం ఉందనే డిమాండ్‌ను అన్ని పార్టీల ముందు తెలంగాణ ప్రజలు పెట్టారు.
ఆచరణలో ఎన్నికల హామీలు అంతంత మాత్రమే
తెరాస అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణ ప్రజారోగ్యాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని వైద్యం విషయంలో అనేక హామీలను ఇచ్చింది. ఆ క్రమంలోనే ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం ప్రతి ప్రభుత్వం కనీస బాధ్యత అని, వైద్యాన్ని ప్రైవేటు రంగంలో పెట్టి చేతులు దులుపుకోమని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర దవాఖానాలను పునరుద్ధరిస్తామని చెప్పి ఉన్నా ఉస్మానియా దవాఖానాను పెకిలించి వేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సూపర్ స్పెషాలిటీ దావఖానాను ఏర్పాటు చేస్తామని 60 కిలోమీటర్ల పరిధిలో ఒకటి ఉంటుందని తెరాస పార్టీ నమ్మబలికింది. కానీ పాత జిల్లా కేంద్ర ప్రభుత్వ వైద్యశాలలకు అరకొర మెరుగులు దిద్ది నడుపుతున్నారే కానీ ఏ ఒక్క దవాఖానాకు సూపర్ స్పెషాలిటీ అర్హతలు లేవు. ప్రతి మండల కేంద్రంలో నలుగురు ఎంబిబిఎస్ డాక్టర్లతో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్న హామీ ఆచరణలో అమలుకు నోచుకోలేదు. ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో ఉండని పరిస్థితి. 30 పడుకలు పక్కకు పెడితే ఒక్క మండలంలో రెండు పడకలు కూడా లేనటువంటి పరిస్థితి. 24 గంటలు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కాని పేషెంట్ అర్ధరాత్రి మండల దవాఖానాను సందర్శిస్తే, ఎవరు ఉండని పరిస్థితి. పాము, తేలు, కుక్కకాటుకు మందులు అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. కొంతమేరకు గతం కంటే పర్వాలేదు. కానీ అన్ని చోట్ల అందుబాటులో ఉండడం లేదు. ప్రతి నియోజకవర్గంలో 100 పడుకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ అన్ని నియోజకవర్గాలలో ఆ పరిస్థితి లేదు. పీఎంపీ, ఆర్‌ఎంపీలకు సర్టిఫికెట్స్ ఇచ్చి ఉపయోగించుకుంటానని అన్నప్పటికి ఆ గ్రామీణ వైద్యుల సేవలను వారి అర్హతలను నిర్ధారించి లేకపోయింది. వారి సేవలను కూడా వినియోగించుకోలేకపోయింది.108,
ఎన్నికల కోసం ప్రభుత్వం ఏం చెబుతున్నది.?
గతంలో తమ పాలన కాలంలోనే ప్రజారోగ్యం పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసినారు. కానీ తెలంగాణలో ఎన్నికలు ముంచుకు రావడంతో ఒక్కసారిగా గ్లోబల్ ప్రచారాన్నికి తెరలేపారు. బడ్జెట్‌ను ఆకస్మికంగా పెంచి ప్రజారోగ్య సమస్యలు సంపూర్ణంగా పరిష్కరిస్తున్నట్లు 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖకు 12,161 కోట్లు కేటాయించినారు. కాని గత బడ్జెట్ అనుభవాన్ని పరిశీలిస్తే కేటాయింపులు మాత్రమే జరిగినవి గాని ఆచరణలో నిధులు విడుదల చేయలేని దుస్థితి ఏర్పడ్డది. ఈ బడ్జెట్ కూడా మాటలకే పరిమితం అయితదనే దాంట్లో సందేహం ఏమీ లేదు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఒక కోటి 54 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి నలభై లక్షల మందికి కళ్లద్దాలను పంపిణీ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు.
హైదరాబాద్ నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టినట్లు, టి డయాగ్నొస్టిక్, డయాలసిస్ యూనిట్లు, టీఫా స్కానింగ్, ఐదు పెద్ద ఆస్పత్రిలలో క్యాధలాబ్స్ ఏర్పాటు చేసినట్లు, శిశుమరణాల రేటును, మాతృ మరణాల రేట్లు గణనీయంగా తగ్గించినట్లు, 27500 బెడ్లు అందుబాటులోకి తెచ్చినట్లు, వైద్య శాఖలో కొన్ని ఖాళీలను కూడా నింపినట్లు ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తంగా మెడికల్ కళాశాల సంఖ్య 17కు చేరుకుంది. వీటికి అనుబంధంగా నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆచరణాత్మకంగా నేటికీ అవి అమలు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 342 బస్తి దావఖానాలు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాయని పాలకులు చెబుతున్నారు. మరో 100 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందట. కేసిఆర్ కిట్ పేరుతో మరింత ప్రచారాన్ని కూడా దక్కించుకుంది. కాని గర్భిణీల పట్ల వారి డెలివరీ సమయంలో డాక్టర్ ల నిర్లక్ష్యం, ఆసుపత్రి సిబ్బంది క్రూరమైన ప్రవర్తన ఫలితంగా అర్ధాంతరంగా తనువు చాలించిన ఆ అభాగ్య జీవులు నిరంతరం కళ్ళెదుట కనిపిస్తూనే ఉంది. ఇందుకు సాక్ష్యం నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నిండు గర్భిణీ అఖిల మృతి. అందుకు డాక్టర్లే కారణం.
మెరుగుపడని వైద్య వ్యవస్థ
ఇటు జిల్లాలలో సూపర్ స్పెషాలిటీ దవాఖానాల నిర్మాణం గాని, సౌకర్యాలు గాని అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్ నగరానికి నలువైపులా సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు 16 నెలల క్రితం శంకుస్థాపన చేసింది. గచ్చిబౌలిలో అప్పటికే నిర్మితమైన బహుళ అంతస్తుల భవనాన్ని టీమ్స్ పేరుతో అందుబాటులోకి తెచ్చినట్లు తెచ్చి నిలిపివేసింది. తొమ్మిది వందల కోట్లతో అల్వాల్‌లో నిర్మించదలచిన మరియు ఎల్‌బి నగర్‌లో మరో నిర్మాణానికి, చెస్ట్ ఆస్పత్రుల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న మరొక ఆసుపత్రిని ఒకే రోజు శంకుస్థాపన చేసినప్పటికీ అడుగు కూడా ముందుకు పడలేదు. కోవిడ్ అనంతరం టీమ్స్ హాస్పిటల్ నిర్వాహణ దాదాపుగా ఆగిపోయింది. ఈ నాలుగు ఆస్పత్రులను నిర్మించి అందుబాటులోకి తెచ్చి ఉంటే తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే రోగులకు ఎంతో ఉపయుక్తంగా ఉండేది. అనేక మంది విలువైన ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉండేది. పాత హైదరాబాద్ రాజ్య ప్రజలందరికి దిక్కు మొక్కు ఐన ఉస్మానియా ఆస్పత్రి ఆరోగ్యంతో పాటు పాలు, రొట్టెను ఇచ్చింది, ఇది సీమాంధ్ర పాలనలోను, స్వరాష్ట్ర పాలనలోను దీని భౌతిక, బౌద్ధిక ఆదర్శ పునాదులను పెకిలించి వేసినారు. ఉస్మానియా దవాఖానా స్థానంలో ట్విన్ టవర్స్ నిర్మించటం కాదు కదా! రేకుల షెడ్డులకే పరిమితం అయిందంటే దీని పట్ల పాలకుల వ్యవహారం ఏవిధంగా ఉందో చెప్పవచ్చు. దీనితో పాటు నిమ్స్ ఆసుపత్రి విస్తరణ కోసం మరో 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎనిమిది అంతస్తుల ఓపి బ్లాక్ ను నిర్మించ పూనుకున్నారు. కాని ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కేవలం నమూనా చిత్రానికే పరిమితం అయింది. 2000 పడకలతో హెల్త్ సిటీ వరంగల్‌లో నిర్మిస్తున్నవి నత్త నడకన కొనసాగుతున్నాయి.
స్పెషల్ హాస్పిటల్స్ ఏవి..?
తెలంగాణతో పాటు ఇంత పెద్ద హైదరాబాద్ నగరానికి ఒకటే ఈఎన్‌టి హాస్పిటల్ ఉంది. పెరుగుతున్న సమాచార విప్లవం, దానికి తోడు మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న వాతావరణ మార్పులకు వేగంగా ప్రభావితం అయ్యే ప్రధాన ఇంద్రియాలు చెవి, ముక్కు, గొంతు వ్యాధులు తీవ్రంగా పెరిగినాయి. ఈ ఈఎన్‌టి హాస్పిటల్‌ను విస్తృత పరచాలనే ఆలోచనలు కేవలం ప్రతిపాదనలకు పరిమితం అయ్యాయి. కరోనా అనంతరం తెలంగాణ గ్రామీణ, నగర ప్రజానీకం పెద్ద ఎత్తున ఛాతి, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులుగా మారిపోతున్నారు. ఉపాధి దొరకని పరిస్థితి. ప్రభుత్వ మద్యం విధానాలు ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య మరింత తీవ్రమవడానికి కారణం అవుతున్నాయి. ప్రమాదకరమైన పొగాకు ఉత్పత్తులపై కూడా నియంత్రణ సాధించలేక పోయింది. ఈ ప్రభుత్వం.2014 నుండి నేటి వరకు కేవలం 90,000 రూపాయల లోపు మాత్రమే గుట్కా మొదలగు అక్రమార్కులపై జరిమానా విధించగలిగింది. ఈ వ్యాధిగ్రస్తుల కొరకు రెండంటే రెండే చెస్ట్ ఆస్పత్రులను నిర్వహిస్తుండటం దౌర్భాగ్యం. కంటి వెలుగు ప్రాజెక్టు కింద దాదాపు 1,54,58,982 మందిని పరీక్షిస్తే దాదాపుగా 40 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేసినప్పటికీ అందులో సగం మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించాల్సి వస్తుంది. కాని తెలంగాణ మొత్తం మీద రెండే రెండు కంటి ఆసుపత్రులను కూడా సమర్థవంతంగా నిర్వహించ లేకపోతుంది.
వర్షాకాలం మొదలు మళ్ళీ వేసవిదాక విపరీతమైన విషజ్వరాలు విజృంబిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా మలేరియా తిరగబెట్టింది. వందలాది మంది ఈ విష జ్వరాల బారిన పడి మరణిస్తున్నారు. ఆదివాసి ప్రాంత ప్రజలకు ప్రధానమైన సమస్య సీజన్లో వచ్చే విష జ్వరాలే. వీరిని కాపాడుకోవడానికి రోడ్డు రవాణా మార్గం లేని ఏజెన్సీ ప్రాంతాల నుంచి హెలికాప్టర్ల ద్వారా రోగులను తరలిస్తారని ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు బూటకమని తేటతెళ్ళం అయిపోయింది. గర్భిణీలైన ఆదివాసి మహిళలకు పురిటి నొప్పులు వస్తే కావడి ద్వారా ఏరులు వంకలు దాటుకుంటూ అనేక వ్యయ ప్రయాసల మధ్య దవాఖానాలకు చేరుకుంటున్న దుస్థితి. వృద్ధులకు రోగాలు సంభవిస్తే అక్కడి పరిస్థితులకే వదిలేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఆయా కుటుంబాలను అల్లకల్లోలం చేస్తుంది. అతిసారా వ్యాధి తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున మరణాలకు కారణం అవుతుంది. కాని ఈ విష జ్వరాల బాధితులందరికి వైద్యం అందె చోటు ఒక్క కోరంటి ఫీవర్ హాస్పిటల్ మాత్రమే ఉంది. అది కూడా నిజాం కాలం నుంచి ఉన్నదే. దీనిని ఆధునీకరించలేదు. జిల్లాల్లో ఈ తరహా ఆస్పత్రుల నిర్మాణం జరగలేదు. 104 డయాలసిస్ సెంటర్‌లో 8400 మందికి మాత్రమే ప్రభుత్వం డయాలసిస్ సౌకర్యాలను అందిస్తుంది. మిగతా వారంతా ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్నారు.
దాదాపుగా 10,000 మందికి పైగా క్యాన్సర్ రోగులు నమోదు చేసుకునే ఏకైక ప్రభుత్వ క్యాన్సర్ దావఖానా ఎంఎన్‌జె క్యాన్సర్ ఆస్పత్రి మాత్రమే.రెగ్యులర్ గా 750 మంది రేడియేషన్ మరియు కీమో థెరపీ అందిస్తుంది. కానీ ఈ తరహా ఆస్పత్రులును ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్మించవలసి ఉంటుంది. నాలుగు ఆయుర్వేద, మూడు యునాని, మరొక మూడు హోమియో, ఒకటి మాత్రమే నేచురోపతి ఉంది. ఈ ప్రాచీన వైద్య పద్దతులను ఆధునీకరించి ప్రజలందరికీ అందుబాటులోకి తేలేకపోయింది. తెలంగాణలో జరిగే మరణాలలో 62% శాతం అకాల మరణాలే. ఈ పరిస్థితులలో ప్రభుత్వ వైద్య రంగంలో వైద్యాన్ని బలోపేతం చేయలేకపోతున్నారు.పెద్ద ఎత్తున ప్రైవేటు కార్పోరేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది. వీరి యాజమాన్యాలతో ప్రభుత్వ పెద్దలు భాగస్వామ్యం కావడంతో వారి దోపిడికి అడ్డు అదుపు లేకుండా పోయింది. గత సంవత్సరం 3,74000 మందికి ఆరోగ్య శ్రీ సహకారం అంది ఉంది. కాని ఇది కూడా ఆయుష్మాన్ భారత్ పధకంతో భాగస్వామ్యం కావాల్సి వచ్చింది. ఐనప్పటికి యశోద, అపోలో లాంటి కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ పథకం కింద రోగులను చేర్చుకోకుండా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆర్థికంగా పూర్తిగా పతనం అవుతున్నారు.
న్యూట్రిషన్ లోను అవినీతి
చిన్న పిల్లల పోషకాహార లభ్యత జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. చిన్న పిల్లలకు అందాల్సిన గుడ్లు, పాలు పోషక పదార్థాలు ఇక్కడ అత్యంత అవినీతి వలన అరకొరగా కూడా అందని పరిస్థితి ఉంది. ఇవి అందకపోవడం వలన రక్త హీనత, ఎత్తుకు తగిన బరువు లేక రోగ పీడితులు అవుతున్నారు. మృత దేహాల తరలింపు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 33 వాహనాలు కూడా అక్రమార్కుల నుంచి విముక్తి చేయలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం అధ్వర్యంలో ఫెర్టిలిటీ సెంటర్‌లను ఏర్పాటు చేయకపోవడంతో వారు పెద్ద ఎత్తున దోపిడీకీ గురవుతున్నారు. ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ప్రచార ఆర్భాటం కోసం వందల కోట్ల రూపాయలను విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంది. కాని వాటిని రాబోయే సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించేందుకు ఖర్చు పెడితే అందరూ హర్షిస్తారు. ప్రభుత్వ వైద్య రంగంలో ఇన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కేసిఆర్ కిట్ సూపర్ హిట్ నినాదాలతో ఓ వైపు హోరెత్తిస్తూ మరొక వైపు కార్పోరేట్ వైద్య రంగానికి ఎర్ర తివాచీ పిలుస్తుంది. ఈ ప్రభుత్వ స్వభావాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోకపోతే కార్పొరేట్ కౌగిలిలో చిక్కుకున్న ప్రజారోగ్యాన్ని విముక్తి చేయలేం. దేవుడి కృప తోనే కరోనాను జయించామని సాక్షాత్తు ఆరోగ్య శాఖ డైరెక్టర్ ప్రభుత్వం తరుపున ప్రకటనలు ఇవ్వడం శోచనీయం. అవి ఈ పాలనలో లోపించిన శాస్త్రీయతలకు సూచికలు.
అడ్డు అదుపులేని కార్పోరేట్ దవాఖానాలు
భారాసా పాలనలో అనైతిక, విచ్చలవిడి విధానాలకు హెటిరో పార్ధసారధి, యశోద, జీయర్ ఈ పాలక ప్రతిమలు కూడా. తెలంగాణ ప్రభుత్వం విచ్చలవిడిగా కార్పొరేట్ దవాఖానాలకు అనుమతులు ఇస్తున్న పరిస్థితి. లక్షల కోట్ల రూపాయలు సామాన్య ప్రజానీకం నుండి వైద్యం పేరుతో కార్పొరేట్ దావాఖానాలు విచ్చలవిడిగా వసూలు చేస్తున్నా వాటిపై నియంత్రణ లేదు. తెలంగాణ ఏర్పడ్డ కాడి నుంచి నేటి వరకు ఏ కార్పొరేట్ దవాఖానపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జిల్లాస్థాయిలో సైతం వైద్య పర్యవేక్షకులు ప్రైవేటు యాజమాన్యాలతో మూలాకత్ టయి వంత పాడుతున్నారు. అర్హతలు లేని సిబ్బంది, అనుమతులు లేని ఆసుపత్రులను యథేచ్ఛగా నిర్వహిస్తున్న వారి పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మెడికల్ టూరిజం హబ్‌గా హైదరాబాద్‌ను రూపొందించే క్రమంలో ప్రభుత్వ బలహీనతలు, ఆశ్రిత పద్దతులను ఆసరాగా చేసుకోవడం వలన కార్పొరేట్ వ్యవస్థకు హద్దూ, అదుపు లేకుండా పోయింది.
సామాజిక ఉద్యమాభివందనాలతో….
– పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల