ఎక్కడ కాలుపెడితే అక్కడ పతనమే
రాహుల్ గాంధీపై మంత్రి హరీష్ రావు విమర్శలు
నిజామాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీది ఐరన్ లెగ్ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాహుల్ ఎక్కడ కాలు పెట్టిన అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని తెలిపారు. అలాంటి రాహుల్ తెలంగాణను ఉద్దరిస్తాడా? అని ప్రశ్నించారు. 94 శాతం ఓటమిలో ఉన్న పార్టీ కాంగ్రెస్ అని హరీష్ రావు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలోని జకోర ఎత్తిపోతల పథకానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పెరిగిన దిగుబడితో కాంగ్రెస్, బీజేపీలకు కళ్ల మంటగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ట్రాన్స్‌ఫార్మర్స్ కాలిపోవడం, ఎరువులు, విత్తనాల కోసం క్యూ కట్టడం లాంటి ఘటనలు చూశామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేంద్రానికి, దిల్లీ పెద్దలకు గులాంగిరి చేస్తాయి, టీఆర్‌ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పని చేస్తుందని హరీష్ రావు తేల్చిచెప్పారు. 96 శాతం ఓటమిలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, స్థానికంగా సఖ్యత లేని కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీ వొచ్చి ఏంచేస్తాడని ఆయన ప్రశ్నించారు.