అలసినశరీరం ఆదమరిచి
రాత్రిని హత్తుకుని నిద్ర ముసుగులో
అర్ద చైతన్య స్థితితో మగత కలల్ని
కంటూ ఉదయాన్నే మెలకువ పలకరింపులకు కళ్ళు తెరుచుకున్నాయి!
రాత్రి కలల దారెంటా తడిమిన
బాల్యపు స్మృతులు ఆనందాలు
అమాయకతలు ఆగడాలు ఆటలు అల్లరులు నేస్తాల తీపి గుర్తులు
అమ్మ ఒడి లోని వెచ్చదనం
అలిగినవేళల్లో ఆత్మీయంగా అమ్మ హత్తుకున్న దృశ్యాలు వాటి సందిట
కాలం గడిపేస్తూ జీవితం
అక్కడే ఆగిపోయి ఉంటే
ఎంత బాగుండునో కదా !
యువరక్తపు ఊపులో మరో ప్రపంచంకోసం నినదిస్తూ
నడచిన బాటలు గడిపిన కాలం
కలిసి అడుగులు వేసిన
సహవాసుల ఊసులు
ఆ దారుల్లో ఆగిపోని పయనంతో
అజ్ఞాతులైన ధీరుల వెచ్చటి రూపాలు కాగడాలై వెలుగుతూ కనిపించాయి!
బ్రతుకు తెరువు బాటలో
అక్షరాల తోటలో అపురూపంగా
పెంచిన విద్యాపూల కమ్మని
గంధాలను ఆఘ్రాణిస్తూ
పరవశిస్తూ ఉన్నపుడు
ఎక్కడినుండో పరుగున దాడిచేయ వస్తున్న వికృతాలు
మతం ముసుగులో
నుదుట కులాల విభూతులతో
విద్వేషాల మారణ హోమం రగిలిస్తూ మనిషిని దహించ
బోతున్నందుకు ఎదురు నిలిచి
అడ్డుపడిన వేల పిడికిళ్ల ప్రకంపనాలు
నా మూసిన కనురెప్పలకు సోకి
తూరుపు వాకిట వెలిగిన
కాంతిరేఖలు తాకినందున
నిద్రమేల్కొని వర్తమానంలోకి
చూపును నిలిపా !
అజాలపై నిఘా
ఇజాలపై ఉక్కుపాదం
నిజాలపై నలుపు ముసుగులు
మాటను పాటను రాతను
సంకెళ్లతో బంధించిన దుర్మార్గం
కలల్ని కనటాన్ని ఆపలేవని…
కలలను నిజంచేసే ఓటమి ఎరుగని కొత్తశక్తులకు ఆహ్వానం
పలకటం అనివార్యం !
– డా. కె.దివాకరా చారి
: 9391018972