కర్నాటక ఎన్నికల నగారా మోగింది. దక్షిణాదిలో పాగా వేయలనుకుంటున్న బిజెపికి కర్నాటక ఎన్నికలు అంత సులభం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్నాటకతో పాటు రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్టాల్ల్రోనూ జెండా పాతాలని అనుకుంటున్నారు. జగన్, కెసిఆర్‌లపై వ్యతిరేకతే బలంగా బిజెపి పావులు కదుపుతోంది. ఇకపోతే కర్నాటకలో పరిస్థితి మాత్రం అంత సులువుగా లేదని బిజెపి నేతలు కూడా ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైతే అధికారంలో ఉన్నా మరో నెలరోజుల్లో జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుని పోతుందన్న ప్రచారం సాగుతోంది. కర్నాటకలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నా పెద్దగా లాభం లేదని ప్రజలు కూడా పెదవి విరుస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే విరూపాక్ష వ్యవహారమే తీసుకుంటే బిజెపి నేతల అవినీతి ఎంతగా వేళ్లూనుకుందో చెప్పవొచ్చని అంటున్నారు. తాజాగా ఉన్న సకరణాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్‌కు మంచి అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికల నాటికి కాంగ్రెస్, జెడిఎస్ కలసి నడిచినా ఆశ్చర్యం లేదని కూడా అంటున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తలపిస్తోన్న కేసీఆర్..
టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చాక కర్నాటక విషయంలో ఇప్పటికీ ఓ నిర్ణయం తీసుకోలేదు. అక్కడ పోటీ చేయడమా లేక…జెడిఎస్‌కు మద్దతు పలకడమా అన్నది కూడా తేల్చలేదు. లేదా కాంగ్రెస్, జెడిఎస్‌లు కలసి పనిచేసేలా పెద్దన్న పాత్ర పోషించడంలోనూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అలాగే కాంగ్రెస్,జెడిఎస్‌లు విడివిడిగా పోటీ చేస్తే బిజెపి లబ్ది పొందగలదని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడిగా పోటీ చేస్తే విజయం ఖాయమని అంటున్నారు. గత ఎన్నికల్లో ఈ పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇకపోతే బిఆర్‌ఎస్ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించడంపై దృష్టి పెట్టిన కెసిఆర్ కర్నాటకలో ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నారో చెప్పడం లేదు. అలాగే కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో చేయాల్సినంత కృషి చేయడం లేదని కర్నాటక తెలుగు ప్రజలు కూడా అంటున్నారు. పక్క రాష్టాల్ల్రో ఇతర పార్టీల నాయకులను కారెక్కించడం ద పెట్టిన దృష్టి కన్నా..పార్టీలను సకరించి కలపడంతోనే లాభం ఉంటుందని భావిస్తున్నారు. మహారాష్ట్రలో మాత్రం పార్టీలో చేరికలపై కేసీఆర్ హడావిడి చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ రెండు చేరికల సభలు నిర్వహించారు. ఫిబ్రవరి 5న నాందేడ్‌లో, మార్చి26న కాందార్ లోహలో సభలు పెట్టారు.
అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. బిజెపిని ఓడించేందుకు కలసికట్టుగా పనిచేసే యత్నాలను ఎవరు కూడా తెరపైకి తీసుకుని రావడం లేదు. గతంలో ఇందిర హయాం లో కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు ఎన్టీఆర్ అన్ని పార్టీలను సకరించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కూడా అలాంటి వాతావరణమే ఉంది. దీనిని గుర్తించి కెసిఆర్ ప్రయత్నిస్తే ఫలితం సాధించే అవకాశం లేకపోలేదు. అలాకాదని ఎవరికి వారు పోటీ చేస్తే మళ్లీ అధికారాన్ని బిజెపి ఎగురేసుకు పోగలదని విశ్లేషకుల వాదనగా ఉంది.
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆరు నెలల ముందుగానే కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల వేడి ప్రారంభ మైంది. రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీవ్రమైంది. అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రత్యర్థులను విమర్శలతో తిప్పి కొట్టేందుకు చేసే ప్రయత్నాలలో బిజీగా గడిపారు. అధికార బీజేపీతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్,జేడీఎస్ పార్టీలకు ఒకే బెంగ పట్టుకుంది.
ఎన్నికలు ఒకే విడతలలో సాగితే ఎవరికి లాభం అన్న దానిపై మూడు పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. ఈ క్రమంలో బిజెపి తనకు అనుకూలంగా ఉంటుందనే ఒకేదఫా ఎన్నికలను తీసుకుని వొచ్చిందన్న ప్రచారం కూడా ఉంది. రాష్ట్రంలో గడిచిన కొన్ని దశాబ్దాల కాలంగా జరిగిన శాసనసభ ఎన్నికలు అన్నీ ఒకే విడతలో జరిగాయి. కానీ ఇటీవల వివిధ రాష్టాల్ల్రో జరిగిన ఎన్నికలు నాలుగైదు విడతలకు మించి సాగడంతో రాష్ట్రంలోను మార్పు తప్పదనుకున్నారు. రాష్ట్రంలో 224 నియోజకవర్గాలు ఉన్నందున కనీసం రెండు లేదా మూడు విడతలు సాగుతాయని భావించారు. అదే జరిగితే ఏదైనా ఒక పార్టీకి అనుకూలంగా పరిస్థితి మారిపోతుందనే చర్చలు సాగాయి. ఒకానొక దశలో అధికార పార్టీకి ఎదురే ఉండదనే చర్చలు సాగాయి. మరో వైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా తమకు కలసివస్తుందని అంచనా వేసింది. అయితే అందుకు భిన్నంగా కర్నాటకలో ఒకే దఫాలో ఎన్నికల నిర్వహణ అన్నది బిజెపి తనకు అనుకూలంగా ఉండేలా చేసుకుందన్న విమర్శలు ఉన్నాయి.
ఒక ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియ ముగిస్తే నాయకులందరినీ ఇతర ప్రాంతాలకు తరలించి అనుకూలం చేసుకోవొచ్చునని ఆలోచించారు. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలనుకున్నారు. జేడీఎస్ పార్టీ మాత్రం పాత మైసూరు, బెంగళూరు ప్రాంతాల్లో రెండు సార్లు జరిగితే బాగుంటుందని ఆశించింది. కనీసం వారం రోజుల వ్యత్యాసం ఉంటే మరింత మంది ప్రజలను కలుసుకోవచ్చని నేతలు అనుకున్నారు. కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం విడుదల చేసిన షెడ్యూల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రాజకీయ పార్టీలు కొంత ఊపిరి పీల్చుకున్నాయి. విడతలవారీ పోలింగ్ జరిగితే అగ్రనేతల సభలు పెరిగేవి, ప్రస్తుతం ఆ అవకాశం లేకుండాపోయింది. గతంలో కర్ణాటకలో కాంగ్రెస్‌తో కలిసి జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ మద్దతుతో 2018 మే నుంచి 2019 జూలై వరకు కుమారస్వామి కర్ణాటక సీఎంగా పనిచేశారు. తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం పదవిని కోల్పోయారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయి పరిణామాలతో పాటు..రాహుల్‌పై సస్పెన్షన్ వేటు తరవాత కాంగ్రెస్‌కు ఆదరణ పెరిగిందన్న భావన ఉంది. ఈ క్రమంలో ఒంటిరి పోరాటం చేయాలన్న ఆలోచపై కుమారస్వామి మనసు మార్చుకున్నట్లు ప్రచారం సాగుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్‌తో కలసి వెళితే ఉమ్మడిగా అధికారం చేజిక్కించుకోవచ్చన్న ఆలోచనలో కుమారస్వామి ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కూడా ప్రస్తుత పరిస్థితులను తనకు అనుకూలంగ ఆమార్చుకుని పాగా వేయాలని చూస్తుంది. మొత్తంగా కర్నాటకలో పోటీ త్రిముఖమా ..బహుముఖమా అన్నది త్వరలోనే తేలనుంది.
– ప్రజాతంత్ర డెస్క్