Take a fresh look at your lifestyle.

ఆటిజం పిల్లలతో అద్భుతాలు సృష్టించవచ్చు

ఆటిజం ఉన్న పిల్లలు ఇతరులతో సరిగా మాట్లాడలేరు, పదే పదే ఒకే పని చేయడం, లేదా ఒకే మాట పలుమార్లు అంటుం డటం చేస్తా ఉంటారు, వివిధ పరిస్థితులలో వారి స్పందన నెమ్మదిగా ఉంటుంది.  ప్రతి 125 మంది పిల్లలలో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారు.  ప్రపంచం లో 70 కోట్ల మంది పిల్లలకు ఆటిజం ఉందని ఒక అంచనా.  ఈ వ్యాధికి కారణం తెలియదు కానీ జన్యుపరమైన మార్పుల వల్ల ఇది సంభవిస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. చిన్నపిల్లలో వచ్చే ఆటిజం సమస్యను  భూతద్దం లో చూడకుండా దాన్ని పరిష్కరించుకునే దిశలో పనిచేయటం ముఖ్యం.
 తల్లి దండ్రుల బాధ వర్ణనాతీతం
ఆటిజం పైకి కనిపించే సమస్య కాకపోవడంతో అందరూ తల్లిదండ్రులు దీనిని గుర్తిచడంలో ఆలస్యం చేస్తూనే ఉన్నారు. దానితో సమస్య పెరిగిపోతుంది. ఈ సమస్యపై చదువుకున్న వారిలో కూడా అంత పరిజ్ఞానం లేకపోవడం కూడా దానిని గుర్తించడం కష్టతరం అవుతుంది. బుడి బుడి అడుగులతో ముద్దు ముద్దు మాటలతో బోసి నవ్వులతో ఈ ప్రపంచంలోని ఆనందమంతా రాశులుగా పోసినట్టుండాల్సిన చిన్నారులు అందుకు భిన్నంగా ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోవడం, ఏదో తెలియని పరధ్యానం, కొన్నిసార్లు కారణం లేకుండానే బిగ్గరగా ఏడవడం, పదేపదే మారాం చేయడం, తమను తామే గాయపర్చుకోవడం చేస్తుంటే తల్లిదండ్రులు తల్లడిల్లుతారు. పిల్లలకు ఉన్న ఈ రుగ్మతను ఆటిజం అంటారు. ఈ సమస్య ఉన్న పిల్లల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఏడాది వయస్సు వచ్చేసరికే తప్పటడుగులు వేయాల్సిన చిన్నారులు ఒకరి సాయం లేనిదే ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతున్నారు. అంతులేని సమస్యతో అల్లాడే తమ చిన్నారులను చూసుకుని నిత్యం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పుట్టుకతోనే సంక్రమించే అనేక వ్యాధులతో తల్లడిల్లుతున్న చిన్నారులను చూస్తూ ఉన్న ఆ తల్లిదండ్రులు బాధలు వర్ణనాతీతం.
ఆటిజం చాలా సాధారణమైన కమ్యూనికేషన్‌ ‌డిజార్డర్‌
ఆటిజానికి అంతే లేదు ప్రాంతం, భాష, కులం, మతం, ఉన్నవారు లేనివారు అనే తేడా లేనట్లుగా ఆటిజం అనే వ్యాధి చిన్నారుల జీవితాలను మొగ్గలోనే దారిమళ్లిస్తున్న పరిస్థితి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా పుట్టుకతోనే ఈ వ్యాధి భారిన పడి కొన్ని కోట్ల మంది చిన్నారులు.. అల్లాడుతున్నారు. కన్నవారిని గుర్తించలేక, వారు ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియక, ఎదుటివారు చెప్పేది అర్ధం కాక, ఓ విధమైన మానసిక సమస్యను ఎదుర్కొంటూ, జీవితాలను భారంగా వెళ్లదీస్తున్నారు. వాస్తవానికి ఆటిజం చాలా సాధారణమైన కమ్యూనికేషన్‌ ‌డిజార్డర్‌. ‌దాన్ని భూతద్దం లో చూడాల్సిన అవసరం లేదు. అలా అని నిర్లక్ష్యం చేసేదీ కూడా కాదు. ఆడి పాడే వయసులో పిల్లలు ముభావంగా ఉంటున్నారంటే, వారిలో కచ్చితంగా ఆటిజం లక్షణాలున్నట్టే. ఆటిజం పిల్లల్లో  చాలామందికి ఎటువంటి డయాగ్నసిస్‌ ‌జరగలేదు. వారిలో ఆ లక్షణాలు ఏ మేరకు ఉన్నాయనే అంచనాలు లేవు.
మనుషుల కంటే బొమ్మలపై ఆసక్తి
ఆటిజం లక్షణాల్లో కొన్ని పసిపిల్లలు అకారణంగా ఏడ్వటం, గంటల తరబడి స్తబ్ధుగా ఉండడం, తల్లిదండ్రులు పిలిచినా ముభావంగా ఉండడం, తెలిసిన వారిని చూసినా నవ్వకపోవడం. బడి వయసు పిల్లలైతే పక్క పిల్లలతో కలవకపోవడం, ఎప్పుడూ ఒంటరిగా ఉండటం, పిలిస్తే పలకకపోవడం కనిపిస్తుంది. మనుషుల కంటే బొమ్మలు, వస్తువుల పట్ల ఆసక్తి చూపడం, అడిగిన వెంటనే జవాబు ఇవ్వలేకపోవడం, సూటిగా చూడలేకపోతుంటారు. స్పష్టమైన భావోద్వేగాలేవీ వ్యక్తం చేయలేరు. మాటలు సరిగా రాకపోవడం, తాము లేదా ఎదుటి వారు గాయపడినా పట్టనట్టు ఉంటారు.నడిచేటప్పుడు మునివేళ్ల మీద నడవడం, ఎదుటివారు అడగనిదే జవాబుగా చెప్పటం, అసందర్భంగా మాట్లాడడం ఎక్కువగా ఉంటుంది.
ఏదైనా ఒక వస్తువు లేదా బొమ్మ పట్ల విపరీతమైన వ్యామోహం పెంచుకుంటారు. దాన్ని తీసేస్తే విపరీతంగా కోపం వస్తుంది. చేతులు, కాళ్లు లేదా వేళ్లు కాస్త అసహజంగా ఒకే తీరులో కదలిస్తుండడం కనిపిస్తుంది. తాము అడిగినవి ఇవ్వకపోతే అరవడం, కొంతమందిలో ప్రతి దానికీ భయ పడడం, గాలికి తీగ లాంటిదే దన్నా కదులుతున్నా చూసి భయపడడం, చీమలాంటిది కనబడినా భయపడడం.. ఇలాంటి పిల్లల్లో ఉంటుంది. చిన్న చిన్న శబ్దాలకూ గట్టిగా చెవులు మూసుకోవడం, శబ్దాలు భరించలేకపోవడం వంటి భావోద్వేగపరమైన అంశాలూ ఉంటాయి.
పిల్లల పై దృష్టి సారించాలి
ఆటిజం పిల్లలు చేసిన పనే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. విపరీతమైన కోపంతో ఉంటారు. చిరాకు పడతారు. వస్తువులను చిందరవందర చేసేస్తుంటారు. కొందరికి వచ్చిన మాటలు కూడా పోతుంటాయి. అలాంటి పిల్లల్లో చురుకుదనం తేవాలి. కావలసిన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. అన్నిటికంటే ముందుగా సమాజంలో ఆటిజం పిల్లల పట్ల వ్యవహరించే ధోరణి మారాలి. ఆటిజంతో బాధపడుతున్న వారు చిన్న వయసు నుండి కూడా తమ పనులు తాము చేసుకోలేని స్థితిలో ఉంటారు. వారికీ సరైన వైద్య సేవలు అందిస్తూ, కాసింత ఎక్కువ శ్రద్ద వారిపై చూపించడం ద్వారా వారికీ సాధారణ జీవితాన్ని అందించవచ్చు.
తల్లిదండ్రులకు శిక్షణ అవసరం
పిల్లలకు చికిత్స కలిగిస్తూనే పిల్లల పట్ల శ్రద్దను కలిగి ఉంటే ఆటిజం పిల్లలతో అద్భుతాలు సృష్టించవచ్చు. పిల్లల్లో భాషాపరమైన ఇబ్బందులు పోగొట్టి స్వేచ్ఛగా మాట్లాడగల స్థాయికి తీసుకెళ్లడం, పిల్లల్లో చురుకుదనం తేవాలి. కావలసిన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఆటిజం పిల్లల్లో దాగిన అద్భుత మేధోశక్తిని వెలికితీయడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ వంతు సహాకారాన్ని పిల్లలకు అందించాలి. ఆటిజం పిల్లలకు తగిన మందులు వాడటం, కౌన్సెలింగ్‌, ‌శిక్షణ ద్వారా మానసిక పరిపక్వతను పెంచటం, పిల్లలకు తగు ఆహారాన్ని మాత్రమే ఇవ్వటం ద్వారా ఆటిజాన్ని అదుపు చేయవచ్చు. పిల్లలతో బాటు తల్లిదండ్రుల కూడా ఆటిజం పిల్లల పెంపకం శిక్షణ తీసుకున్నట్లైతే మంచి ఫలితం ఉంటుంది. ఇతర  పిల్లలతో గొడవలు పడటం వంటివి చేస్తుంటే సైకో థెరపీ ద్వారా అదుపు చేయవచ్చు. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, ఆక్యుపేషనల్‌ ‌థెరపీ, ప్లే అండ్‌ ‌స్టడీ గ్రూప్స్, ఎర్లీ ఇంటర్‌వెన్షన్‌ ‌శిక్షణ, స్పీచ్‌ అం‌డ్‌ ‌లాంగ్వేజ్‌ ‌థెరపీ, సైకలాజికల్‌ ‌కౌన్సెలింగ్‌, ‌ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లతో మంచి ఫలితం ఉంటుంది.
image.png
డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి
రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌, 9703935321

Leave a Reply