ఎవలిపాలాయె బతుకమ్మ!

‘‘‌బతుకమ్మ మన చెరువు పండుగ,మన నీళ్ళ పండుగ, మన శేనుశెల్కల  పొంటి పెరిగి మనల పల్కరిచ్చేటి తంగెడి పూల,గునుగు,గోరంట పూల పండుగ. గోడ పొంటి పారేటి గుమ్మడి, కాకర, బీర, కట్ల తీగలకు బూషిన తీరొక్క రంగుల పూల పండుగ!  బతుకమ్మ సాచ్చిగ తెలంగాణ యెవలికచ్చిందనేది యెరికైతాంది గద!  దొరలరాజ్జెం మళ్ళ పానం బట్టింది,తెలంగాణ కు అడ్డం బడ్డోళ్ళే మంత్రులెమ్మేలేలయిండ్లు.’’

ఫోటో:భరత్‌ ‌భూషణ్‌
తంగెడు, గునుగు, గుమ్మడి, కాకర, బీర, కట్ల తీరొక్క పూల పండుగ!  ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ దాంక తొమ్మిద్దినాల పూల జాతర ఆడోళ్ళ సంబురాలు చెప్పశం గాదంటరు.అద్దుబందుల తెలంగాణా కు ముందున్న బతుకమ్మ సంబురాలైతె గిప్పుడు కానత్తలేవు.మన తెలంగాణా పల్లె గుండె సప్పుడైన బతుకమ్మ మనది గాకుంట దూరవైతానట్టు గొడుతాంది.! దొరల గడీలకేలి వూళ్ళెకు దెచ్చిన బతుకమ్మ మళ్ళ గడీల పాలయినట్లున్నది! తెలంగాణా ల బతుకమ్మలాడె ఆక్కలకు,అవ్వలకు బతుకు యేవంత సుకమైతెలేదు. గల్లీల బతుకమ్మ  గాలిమోటరెక్కి దేశాలకు పయనమైతాండె!!  పల్లె,పట్నమనక  కష్టసుకాలుజెప్పుకునేటి తెలంగాణ పాటలల్ల కానచ్చే నడుక మనల్ని గమ్మునూ కోనియ్యదాయె అటిటు తలకాయలూపిత్తది. కాలాడిపిత్తది.
మనుసును పాటెనుక గుంజుకపోతది. పాటెనుక పాట మనల్ని కట్టేసుడేనాయె! గిసొంటి పాటల పండుగను ఎవలు గిట్ల బేయిజ్జత్‌ ‌జేయబట్టిండ్లో యెరుకైతాందా! టీ.వీ.చానెల్లు. బతుకమ్మ పాటల దందాజేయబట్టే!  బతుకమ్మపాటలు బయటి కిడ్వబట్టె!  బతుకమ్మలాడే తాన మొత్తం రాజకీయ రంగులు జల్లుడేనాయె,గాళ్ళు మైకులల్ల గీ చానెల్‌ ‌బతుకమ్మ పాటలు పెట్టెటాలకు గా పాటలకే ఎగురి,దుంకి బతుకమ్మ పండుగ ఒడగొడ్తాండ్లు. చేతిల చెయ్యేసి బాడుకుంట  మన ముత్తవ్వలు బతుకమ్మల సుట్టు అడుగు దీషి అడుగేసుకుండేటి ఆడోళ్ళ బతుకమ్మ  సంబురాలేడ బోయినయి! ఆడిపాడే మన యేషం,మన.బాసల కాళ్శేల్లు బెట్టుడంటెనేమనల్ని  పానాలు బోయెదాంక బొందవెట్టే కతలని యెరుకుండాలె!. మేదరోళ్ళ శిబ్బిల పూల మద్దెన కొలువుండేటి గౌరమ్మ ఆకరి దినాన గంగమ్మల కలిశేటి సద్దుల బతుకమ్మ, తెలంగాణల అవ్వల్‌ ‌దర్జాపండుగ!  బస్తీలల్ల కొలువయ్యేటి   మన బతుకమ్మ యెవలి పాలయింది!? బతుకమ్మ యేడికి బోయింది?
తెలంగాణల తొమ్మిద్దినాల పూల పండుగ బతుకమ్మంటె దొరల పెత్తనాన్ని సవాలు జేషిన ఆడోళ్ళ వీరత్వపు ప్రతీక. తెలంగాణల దొరల దొరీర్కం మీద ఆడబడుసులంత మర్లవడ్డ తంగెడుపూల పండుగ బతుకమ్మ. దొరల గడీల మీద,గాళ్ళ పెద్దరికాల మీద సవాల్‌ ‌జేషిన అవ్వలందరు ఏకమయి చేతిల చెయ్యేషిన పోరుపతాక బతుకమ్మ పండుగ. ఉన్నోళ్ళు,లేనోళ్ళనేది లేకుంట గల్మ గల్మకు పూవులద్దేటి సంబురాల పండుగే బతుకమ్మ .ఏ దొరల రాజ్జెం కూలనీకి గునుగుపూలు గుమిగూడినయో! ఏ గడీల ఎట్టి బతుకుల మీద మర్లవడ్డయో అదంత తిర్లమర్లయింది. కొట్లాడి తెచ్చుకున్న అద్దుబందుల తెలంగాణల బతుకమ్మ పండుగ మళ్ళా దొర గడీల పండుగైంది. నమ్మకాలు,ఇశ్వాసాల మీదికేలి పండుగలయినయంటరు. పేరు మోశినోళ్ళు,గా వంశాలు కాపాయం జేషినోళ్ళు గిట్ల యెవలన్న జీవిడిషినప్పుడు గాళ్ళ పేరుమీద పండుగ జేషే ఆచారం మన తెలంగాణలనే కానత్తది. కాలంగాని కాలంల గిసోంటి బోనాలెత్తినట్టు రాజకీయ సబలల్ల బతుకమ్మ ఆటలేంది? గిదేమన్న రాజుల కాలమా !గాళ్ళేమన్న రాజులా!

దొరల బలుపుకు పలుపుతాడు గట్టిన శాందారు చైతన్యమే మన బతుకమ్మ పండుగ.గసొంటియి మరిసి మళ్ళ దొరల కాళ్ళకాడ బాంచననుడేడిది బతుకమ్మ పండుగల ఇజ్జత్‌ ‌లేకుంట జేషే కతలు వడుట యెక్కువైంది. అధికారికంగ బతుకమ్మ జేసుడు పేరుతోని బతుకమ్మాటకు సర్కార్‌ ‌కోట్ల రూపాలిచ్చినంటది. గరీబోళ్ళు చెరువు కట్టపొంటి ఆడిపాడే పండుగను అద్దాల బవంతుల కాడికి గుంజుక పొయిండ్లం. కోట్ల రూపాలు యెవలి పాలయితయో యెవలికెరుక గాదు. మైకులల్ల బతుకమ్మ పాటలేసుఘకోని,దొరసాన్లు సినిమా డాన్సులు జేషేందుకు టాంకు బండు అటిటు బందు వెట్టి పోలీసోళ్ళ కావలిబెట్టి గీ తమాషా జూపెడుతరు. బతుకమ్మ పండుగ పేరు మీద యెండి,బంగారు జరీ చీరలు నేయించినవంటరు. పండుగ పూట రోడ్లపొంటి దొరికే చీరలు పంచుడాసొంటియి రాజకీయాలల్ల పగటేషాలే గని బతుకమ్మ లైతాయా!?

ఊళ్ళె బొడ్రాయి తాన,గుడి ముందట,బడి మైదానంల,సద్దుల దినాన ఉరిశెరువుల తాన మోగేటి సప్పట్ల బతుకమ్మ మనది. మన బతుకమ్మలేడుంటయో యెరికె గదా!  టీవీ లల్ల కాన్రావు గని,మన అవ్వలు,అక్కజెల్లెలు సంబురంగ ఆడిపాడేటి బహుజనుల బతుకమ్మలు చెరువు గట్లకాడ కానత్తానయి. బతుకమ్మ మన చెరువు పండుగ,మన నీళ్ళ పండుగ, మన శేనుశెల్కల  పొంటి పెరిగి మనల పల్కరిచ్చేటి తంగెడి పూల, గునుగు, గోరంట పూల పండుగ. గోడ పొంటి పారేటిగుమ్మడి, కాకర, బీర, కట్ల తీగలకు బూషిన తీరొక్క రంగుల పూల పండుగ!  బతుకమ్మ సాచ్చిగ తెలంగాణ యెవలికచ్చిందనేది యెరికైతాంది గద!  దొరలరాజ్జెం మళ్ళ పానం బట్టింది,తెలంగాణ కు అడ్డం బడ్డోళ్ళేమంత్రులెమ్మేలేలయిండ్లు.గాళ్ళ దొరీర్కం నిలువాల్నంటె బాంచె బతుకులుండాలె!అందుకె సదువులి య్యకుంట గొర్లు,బర్లు యియ్య బట్టె! ఓట్లేశేది మనం,రాజ్జెమేలేది దొరలు,మన బతుకులనే గాదు,మన పండుగలు ఆచారాలు,మన బాస,మన యేశం అన్ని గుంజుకునే కతలు పడుడేగిట్ల బతుకమ్మను అదికారికంగ జేత్తానమనుడు. ముందుగాల బూములను, ఆటిఅటెంక గీ బూములను నమ్ముకున్న మన బతుకులను, మన బతుకమ్మలు దోసుకునెటందుకే గీ కతలు బడుతాండ్లు. బతుకుడే తిప్పలయయ్యేకాడ బతుకమ్మ ఆట పాటలెట్లుంటయి!  యెవలిపాలయింది తెలంగాణ.
            – ఎలమంద.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page