కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
ప్రజాతంత్ర , హైదరాబాద్ : ఎప్‌సిఐ గోదాములలో బియ్యం గోల్‌మాల్‌పై సిబిఐతో విచారణ జరిపించాలని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్, ధాన్యాన్ని ఎప్‌సిఐకి సరఫరా చేసే పక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఈమేరకు రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కొందరు ముఖ్య నేతలు మిల్లర్లతో కుమ్మక్కై ఏటా రూ.వందల కోట్ల ధాన్యం కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఏడాది మార్చి 22 నుంచి 24 తేదీల మధ్య ఎప్‌సిఐ అధికారులు చేపట్టిన భౌతిక తనిఖీలలో గుట్టరట్టు అయిందనీ, 2020 నుంచి 2022 వరకు ధాన్యం నిల్వలపై ఈ తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఎప్‌సిఐకి చేరాల్సిన బియ్యం బహిరంగ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారనీ, రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి బహిరంగ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎప్‌సిఐ అధికారులు చేసిన తనిఖీలలో రూ.400 కోట్ల బియ్యం కుంభకోణం వెలుగు చూసిందనీ, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణానికి సూత్రధారులుగా ఉన్న టీఆర్‌ఎస్ ముఖ్య నేతలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనీ, తక్షణమే బియ్యం కుంభకోణంపై సిబిఐతో విచారణ జరిపించి కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.