ఇక అది ప్రగతి భవన్ కాదు…ప్రజా భవన్
తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ
బిఆర్ అంబేద్కర్ ప్రజా భవన్‌గా ప్రగతిభవన్ పేరు మార్పు
ప్రజలకు అందుబాటులో సచివాలయం, ప్రజాభవన్
ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
కెసిఆర్, టిజెఎస్ చీఫ్ కోదండరామ్, ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకుంటాం
కాంగ్రెస్ విజయం తరువాత పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
గాంధీభవన్ వద్ద విజయోత్సాహం..బాణాసంచా కాల్చి సంబురాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3 : అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ విజయాన్ని ప్రజలకు అంకితమిస్తున్నట్లు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంతవరకూ ఉన్న ముఖ్య మంత్రి అధికారిక నివాసంగా ఉన్న ప్రగతి భవన్ ఇక నుంచి ప్రజా భవన్‌గా మారుస్తామని, ప్రజలందరికీ ప్రవేశం కల్పిస్తామని, పేరును బిఆర్ అంబేద్కర్ ప్రజాభవన్‌గా మారుస్తామని కాంగ్రెస్ పార్టీ గెలుపును అందుకున్న తర్వాత మొదటి సారిగా మీడియాతో మాట్లాడుతూ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ థాక్రే, కాంగ్రెస్ నేత మహేష్ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తామని, ప్రజాస్వామిక తెలంగాణకు శ్రీకారం చుడతామని తెలిపారు. కాంగరెస్ విజయాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా తొలి అమరుడు శ్రీకాంతాచారికి నివాళి అర్పించారు. ప్రగతి భవన్ ఇక బీఆర్ అంబేద్కర్ ప్రజా భవన్‌గా ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ప్రగతి భవన్ ఇక సామాన్యులకు తలుపులు తెరుస్తుందన్నారు. సచివాలయం ఇక సామాన్యుడికి తెరుచుకుంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలు పెంపొందించడానికి జర్నలిస్టులు సహకరించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయానికి మద్దతు పలికిన తెలంగాణ జన సమితి నేత కోదండరామ్, మిత్ర పక్షం సీపీఐకి, సీపీఐ మాజీ రాజ్యసభ్యుడు అజీజ్ పాషాలకు ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ ప్రజా భవన్‌గా ప్రగతి భవన్ మారుతుందన్నారు. ఇక నుంచి ప్రగతి భవన్ కాదు.. ప్రజా భవన్.. అది ప్రజల ఆస్తి.. ప్రజల కోసం వినియోగిస్తాం అని రేవంత్ రెడ్డి చెప్పారు. రేపటి భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని ప్రభుత్వం పని చేస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. 2004-14 మధ్య కాలంలో అందించిన ప్రజా పాలన అందిస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్మాణాత్మక సూచనలు చేయాలని బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని కోరారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, సోనియాగాంధీకి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు, సోదరుడిగా అండగా నిలిచిన, స్ఫూర్తి నిచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి, తనతో సమానంగా ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఏడున్నరేండ్లుగా మహరాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా, రాష్ట్ర హోమ్ మంత్రిగా పనిచేసి, తెలంగాణ పీసీసీ కార్యవర్గానికి ఇన్‌చార్జిగా పార్టీలో సమస్యలు పరిస్కరించినా మాణిక్ రావు థాక్రేకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇంతకుముందు పీసీసీ అధ్యక్షుడిగా తన ఎంపిక కోసం అభిప్రాయాలు సేకరించిన, ఎంపీ మాణిక్ రావ్ టాగూర్‌లకు, పార్టీ విజయం కోసం నెలల తరబడి తెలంగాణలో పని చేసిన ఏఐసీసీ కార్యదర్శులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకంగా వ్యవహరించిన 30 లక్షల మంది నిరుద్యోగులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయశాంతికి ధన్యవాదాలు తెలిపారు. ఇదిలావుంటే గాంధీభవన్ వద్ద ఉదయం నుంచే కోలాహలం నెలకొంది. నేతలు , కార్యాకర్తలు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు మిఠాయిలు తినిపించుకున్నారు. కాంగ్రెస్ నినాదాలతో గాంధీభవన్ పరిసరాలు దద్దరిల్లాయి.
కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఘన విజయం
కొండగల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3 : ఓడిన చోటే రేవంత్ రెడ్డి మరోమారు ఘన విజయం సాధించారు. సిఎం అభ్యర్థిగా దూసుకుని వొచ్చారు. కర్నాటక సరిహద్దుల్లో ఉండే కొడంగల్ నియోజకవర్గం చాలా ప్రత్యేకమైంది. ఇక్కడ రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండటంతో రాజకీయం హాట్‌హాట్‌గా సాగింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఈసారి మాత్రం పట్టుకోల్పోలేదు. సప ప్రత్యర్థి బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిపై భారీ విజయం నమోదు చేశారు. ఏకంగా 32 వేలకు పైగా వోట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ నియోజకవర్గం రెండు జిల్లాల్లో ఉంటుంది. కొన్ని మండలాలు నారాయణపేట జిల్లాలో ఉంటే మరికొన్ని మండలాలు వికారాబాద్ జిల్లాలో ఉంటాయి. రేవంత్ రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేశారు. తర్వా
త ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు కొడంగల్‌లో విజయం సాధించగా, కామారెడ్డిలో మాత్రం ఓటమి చెందారు.