ఈ-‌కామర్స్‌పై జాతీయ విధానం రావాలి

  • సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగాలి
  • ఆన్‌లైన్‌, ‌సైబర్‌ ‌సెక్యూరిటీపై శ్రద్ధ తీసుకోవాలి
  • తెలంగాణ అభివృద్దిపై కేంద్రం నిర్లక్ష్యం
  • అనేక పథకాలకు మోకాలడ్డు
  • పార్లమెంట్‌ ‌స్టాండింగ్‌ ‌కమిటీ భేటీలో మంత్రి కెటిఆర్‌

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 18 : ఈ-‌కామర్స్‌పై కేంద్ర ప్రభుత్వం సత్వరమే జాతీయ విధానాన్ని తీసుకుని రావాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. సోమవారం శాసనసభ కమిటీ హాలులో పార్లమెంట్‌ ‌స్టాండింగ్‌ ‌కమిటీ అండ్‌ ‌కామర్స్ ‌సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్‌ ‌విజయ సాయిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలువురు సీనియర్‌ ఎం‌పీలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ప్రతినిధులు, బ్యాంకింగ్‌, ఈ-‌కామర్స్ ‌సంస్థలకు చెందిన సీనియర్‌ ‌ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వొస్తున్న సాంకేతిక, సాప్ట్‌వేర్‌ ‌రంగంలోని విప్లవాత్మక మార్పులను భారతదేశం అందిపుచ్చుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన విధానపరమైన నిర్ణయాలతో పాటు మౌలిక వసతుల కల్పనపై వేగంగా చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ అన్నారు. ఈ-కామర్స్‌పై జాతీయపరమైన పాలసీని సత్వరమే తీసుకురావాలన్న కేటీఆర్‌.. ఇం‌దులో ఈ-కామర్స్‌కు అనుబంధంగా ఉన్న ఆన్‌లైన్‌ ‌మోసాలు, సైబర్‌ ‌సెక్యూరిటీ, మొబైల్‌ ‌పేమెంట్స్, అత్యుత్తమ ఇంటర్‌నెట్‌ ‌సౌకర్యం అందుబాటులో ఉండడం వంటి సంబంధిత రంగాలపై విప్లవాత్మకమైన నిర్ణయాలను కేంద్రం ప్రకటించాలన్నారు. సిటిజన్‌ ‌సర్వీస్‌ ‌డెలివరీకి సంబంధించి కేంద్రం మరింత చురుగ్గా కదలాలని సూచించారు. ఈ-కామర్స్, ‌సాంకేతిక రంగాల్లో వొస్తున్న మార్పులను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో వొస్తున్న మార్పులని మనం ఆపడం మానేసి, దాన్ని అందిపుచ్చుకొని ప్రపంచాన్ని లీడ్‌ ‌చేసే విధంగా భారతదేశాన్ని తయారు చేయాలన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా వొచ్చే ఏ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అయినా అందిపుచ్చుకోవడంలో భారత దేశ ప్రజలు ముందు వరుసలో ఉంటారన్నారు. ఇందుకు ఈ కామర్స్ ‌మినహాయింపు కాదని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున ఈ-కామర్స్ ‌కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్‌ ‌లిటరసీపైన దృష్టి సారించాలన్నారు. భారత దేశంలోని వివిధ భాషల్లో డిజిటల్‌ ‌లిటరసీని పెంచే ప్రయత్నం చేయాలని, భారత ప్రభుత్వం చేపట్టిన భారత్‌ ‌నెట్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ ఇంటర్నెట్‌ ‌వంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి వాటికి అవసరమైన ఆర్థికపరమైన సహకారాన్ని అందించాలని కోరారు. ఇంటర్నెట్‌ ‌ద్వారా లాస్ట్ ‌మైల్‌ ‌కనెక్టివిటీని అందించినప్పుడు అత్యంత మారుమూల ప్రాంతాల్లోని పౌరులకు కూడా ప్రపంచ స్థాయి పరిజ్ఞానం, సేవలు అందే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సైబర్‌ ‌నేరాలను అరికట్టే ఉద్దేశంతో నల్సార్‌ ‌యూనివర్సిటీతో ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించే పక్రియను ప్రారంభించిందన్నారు. ఇదే అంశంపై జాతీయ స్థాయిలో ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కామర్స్ ‌రంగంపై ఏర్పాటైన పార్లమెంట్‌ ‌కమిటీ ముందు తెలంగాణ ప్రగతిని కేంద్రం ఎదుట ఉంచడంతో పాటు..రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎదురవుతున్న వివక్షను మంత్రి కేటీఆర్‌ ఈ ‌సందర్భంగా ప్రస్తావించారు. పార్లమెంట్‌ ‌సాక్షిగా వొచ్చిన విభజన హామిలతో పాటు వివిధ పథకాల కింద రావాల్సిన సహాయ సహకారాలను అందించడంలో తెలంగాణపై కేంద్రం శీతకన్ను వేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి దక్కాల్సిన బయ్యారం స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌నుంచి మొదలుకొని రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ, నేషనల్‌ ‌డిజైన్‌ ‌సెంటర్‌, ‌ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల వరకు అనేక హామిలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

తెలంగాణ ప్రభుత్వం అడిగిన ఇండస్ట్రియల్‌ ‌కారిడార్‌లతో పాటు డిఫెన్స్ ‌కారిడార్‌, ‌ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ ‌పార్క్‌లకు అవసరమైన ఆర్థిక సహాయం వంటి అనేక అంశాలపై కేంద్రం స్పందించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరించడంపైన అత్యంత విశ్వాసం కలిగి ఉందని, ఈ దిశగా ఆదిలాబాద్‌లోని సీసీఐని పునరుద్ధరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడున్నర సంవత్సరాలలోనే దేశంలో అత్యంత విజయవంతమైన రాష్ట్రంగా నిలిచిన తెలంగాణకు కేంద్రం ప్రోత్సాహం ఇవ్వడంలో చొరవ చూపడం లేదన్నారు. నిర్ణయాలు రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పుడే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వాసం తమకు ఉన్నదన్నారు. తెలంగాణ అభివృద్ధి అంటే భారతదేశ అభివృద్ధి అనే విషయాన్ని కేంద్రం గుర్తించాలని, ఏడున్నర సంవత్సరాలుగా తలసరి ఆదాయంతో పాటు జీఎస్‌డీపీ వంటి అంశాల్లో రెట్టింపు వృద్ధిని నమోదు చేసిందని గుర్తు చేశారు.

తెలంగాణ నుంచి వొచ్చే సంపద దేశంలోని ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వినియోగం జరుగుతుందన్న అంశం తమకు గర్వకారణంగా ఉందని, అయితే తెలంగాణ అభివృద్ధికి కేంద్రం మరింత సహకారం అందించాలని అన్నారు. మేకిన్‌ ఇం‌డియా నినాదం నిజరూపం దాల్చాలంటే కేంద్ర ప్రభుత్వం మరిన్ని పారిశ్రామిక ప్రోత్సాహకాలతో పాటు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే సాధ్యమవుతుందన్నారు. దేశంలోని సూక్ష్మ, మధ్య తరహా పారిశ్రామిక రంగానికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. విభజన చట్టంలోని హామిలు కూడా అమలు చేయకుండా తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపుతుందని మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కామర్స్ ‌రంగానికి ప్రోత్సాహం, నియంత్రణ తదితర అంశాలపై భేటీలో చర్చ జరిగింది. సమావేశంలో రాష్ట్ర సీఎస్‌ ‌సోమేశ్‌కుమార్‌, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ ‌రంజన్‌తో పాటు ఇతర శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *