ఆరూరి కిడ్నాప్‌కు బీఆర్‌ఎస్‌ యత్నం

అడ్డుకున్న అనుచరులు…హన్మకొండలో హైడ్రామా
బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట…చిరిగిన అరూరి చొక్కా..
పలు చోట్ల దయాకర్‌ రావు కారును అడ్డుకున్న బీజేపీ శ్రేణులు
మాజీ సీఎం కేసీఆర్‌తో రమేష్‌ సహా వరంగల్‌ పార్లమెంట్‌ పరిధి నేతల భేటీ

హనుమకొండ, ప్రజాతంత్ర, మార్చి 13 : హనుమకొండలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఇంటి వద్ద బుధవారం మధ్యాహ్నం హైడ్రామా చోటుచేసుకుంది. వరంగల్‌ ఎంపీ టికెట్‌ ఆశిస్తూ బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఆరూరి..ఆ పార్టీతో సంప్రదింపులు జరిపారు.  మంగళవారం హైదరాబాద్‌లో కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షాను కలిశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు అరూరి ప్రకటన చేసేందుకు సిద్ధం అయ్యారు. హనుమకొండలోని తన నివాసంలో బుధవారం ఉదయం ప్రెస్‌మీట్‌ నిర్వహించేందుకు రెడీ అవుతతుండగా..సరిగ్గా అదే సమయంలో బీఆర్‌ఎస్‌ నేతలు రంగంలోకి దిగి పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. ప్రెస్‌ మీట్‌ పెట్టేందుకు ప్రయత్నించిన ఆరూరిని బీఆర్‌ఎస్‌ నేతలు అక్కడి నుంచి తరలించటం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
మాజీ మంత్రి హరీష్‌ రావు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌, నాగూర్ల వెంకటేశ్వర్లు, కూడా మాజీ చైర్మన్‌ సుందర్‌ రాజు యాదవ్‌, ఇతర నేతలు బుధవారం ఉదయం హన్మకొండ ప్రశాంత్‌నగర్‌లోని ఆరూరి ఇంటికి వెళ్లారు. ప్రెస్‌మీట్‌ నిర్వహించకుండా  అరూరిని అడ్డుకున్నారు. హరీష్‌రావు ఆదేశాల మేరకు తాము వొచ్చామని చెబుతూ..ఆయనతో ఫోన్‌లో కూడా మాట్లాడిరచారు. కోరింది ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా పార్టీ  ఉందని ఆరూరికి బుజ్జగించే  యత్నం చేశారు. తమ వెంట రావాలని ఆరూరిని కోరారు. అనంతరం ఆరూరి రమేష్‌ను ఎర్రబెల్లి దయాకర్‌, బస్వరాజు సారయ్య తమతో తీసుకెళ్తున్న సమయంలో వారిని అరూరి అనుచరులు అడ్డుకునేందుకు యత్నించారు. జై అరూరి అంటూ  కార్యకర్తలు అభిమానులు నినాదాలు చేశారు. మరోవైపు ఏం చేయాలో పాలుపోక అరూరి రమేష్‌ అయోమయ పరిస్థితిలో పడ్డారు.
ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ పెద్దలు ఆరూర్‌ రమేష్‌ కిడ్నాప్‌ చేశారంటూ వార్తలు వొచ్చాయి. అయితే అరూరి రమేష్‌ సతీమణి ఫోన్‌ సమాచారంతో ఆరూరి రమేష్‌ ఇంటికి వొచ్చామని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు రావు పద్మ తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వీడుతున్నట్లు బిజెపి నేతలకు ఆయన క్లియర్‌గా చెప్పారని, బుధవారం పార్టీకి రాజీనామా చేసి మధ్యాహ్నం హైదరాబాద్‌లో కిషన్‌ రెడ్డిని కలిసిన తర్వాత దిల్లీకి వెళ్లి బిజెపిలో చేరుతానంటూ చెప్పారని అమె వెల్లడిరచారు. వెనక్కి తగ్గొద్దని, బీఆర్‌ఎస్‌ నేతల మాటలు వినొద్దని ఆరూరి అనుచరులు ఆయన కాళ్ల మీద పడ్డారు. అరూరిని తీసుకెళ్తుండగా..ఆయన్ని తీసుకెళ్లవద్దని కొంత మంది అనుచరులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు కాళ్ల మీద కూడా పడి వేడుకున్నారు. ఈ గందరగోళం మధ్య మొత్తానికి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తన కారులో అరూరిని ఎక్కించుకొని హైదరాబాద్‌ తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఎర్రబెల్లి కారును ఆరూరి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ చాలాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది..మొత్తానికి కొంత మంది బీఆర్‌ఎస్‌ నేతల సహకారంతో కారును ముందుకు పోనిచ్చారు.
పెంబర్తి వద్ద మరోసారి ఉద్రిక్తత
జనగామ జిల్లా పెంబర్తి వద్దకు చేరుకోగానే..బీజేపీ శ్రేణులు అరూరి ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నారు. కారులో నుంచి ఆయన్ను బయటకు లాగే యత్నం చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌-బీజేపీ శ్రేణుల తోపులాటలో నడిరోడ్డుపైనే ఆరూరి రమేష్‌ చొక్కా చిరిగిపోయింది. వెనక్కి తగ్గని ఎర్రబెల్లి అరూరిని బలవంతంగా మరోసారి కారులో ఎక్కించుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు. సాయంత్రం బీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌తో అరూరి సమావేశమయ్యారు. నేతలందూ అరూరిని బుజ్జగించారు. మొత్తానికి హనుకొండలో పొలిటికల్‌ హైడ్రామా నడిచింది.

అమిత్‌ షాను కలవలేదు..బీఆర్‌ ఎస్‌లోనే కొనసాగుతా..
మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ కీలక ప్రకటన
హనుమకొండ, ప్రజాతంత్ర, మార్చి 13 : బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ పార్టీ మార్పు వార్తలపై ఉత్కంఠ వీడిరది. కేసీఆర్‌తో సమావేశం అనంతరం తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని ఆరూరి రమేష్‌ ప్రకటించారు. ముఖ్యంగా తాను బీజేపీ అగ్రనేత అమిత్‌ షాను కలవలేదని చెప్పారు. బుధవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించి బీజేపీలో చేరాలని ఆరూరి రమేష్‌ భావించారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇంతలోనే అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు ఆరూరికి నచ్చజెప్పారు. అంతే కాకుండా ఆరూరి రమేష్‌ను వెంటబెట్టుకుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఇంటికి చేరుకున్నారు.

కేసీఆర్‌తో సమావేశం అనంతరం ఆరూరి రమేష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నిన్న(మంగళవారం) బీజేపీ అగ్రనేత అమిత్‌ షాను కలవలేదని తెలిపారు. అలాగే తాను బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. తనను ఎవరూ అడ్డుకోలేదని చెప్పారు. కేసీఆర్‌తో  భేటీలో మాజీ మంత్రులు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ స్పీకర్‌ మధుసూదనచారి, బస్వరాజు సారయ్య, పసునూరి దయాకర్‌, ఆరూరి రమేశ్‌, గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి, నన్నపునేని నరేందర్‌, నాగుర్ల వెంకటేశ్వర్లు, బొల్లం సంపత్‌ కుమార్‌తో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *