ఇపుడిక్కడ
పరువు ప్రతిష్టలు ప్రాణప్రదమై
ఉన్మాదం స్వైర విహారం చేస్తుంది
అగ్రవర్ణ భావజాలమే సమస్తమై
దుర్మార్గం చావు దరువు వేస్తుంది
సామాజిక అంతరం మరిచి
మనస్సులు ఒకటి కావడమే
మహా పాపమై వెంటాడుతుంది
కులమత తారతమ్యం విడిచి
ఎడడుగులు కలిసి నడవడమే
యమపాశమై జీవం హరిస్తుంది
సరూర్ నగరం నడి బొడ్డున
జరిగిన హత్యే సజీవ సాక్ష్యం
ప్రేమ పెళ్లితో ఒకటైన జంటపై
చాందస రక్కసి కత్తి దూసింది
ఉడుకు నెత్తురు కళ్ళ చూసింది
స్వంత అన్న దాడికి తెగబడితే
కాపాడుమని ఎంత వేడుకున్నా
జనం చోద్యం చూస్తున్న దృశ్యం
మానవత సిగ్గుతో తలదించింది
ఈ పాశవిక హత్యాకాండలు
నిత్య తంతుగా సాగుతున్నా
ప్రజలు ఉత్సవ విగ్రహ చందం
ప్రభుత నిమ్మకు నీరెత్తిన వైనం
ఈ వికృత జాడ్యం వీగకుంటే
అమృత, అస్రీన్ సుల్తానాల్లా
ఇంకెందరో బలి కాక తప్పదు
దుఃఖనదులు పారక మానవు
అందుకే ఇప్పటికైనా
పౌర సమాజమా కళ్ళు తెరువు
ప్రేమైక పక్షులకు అండగా నిలువు
సమైక్య భారతాన్ని ఆవిష్కరించు
(సరూర్ నగర్లో ‘‘పరువు’’ హత్యకు నిరసనగా…)
– కోడిగూటి తిరుపతి:9573929493