ఆగస్ట్‌ 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే

  • పంట రుణమాఫీకి విధివిధానాలు రూపొందించండి
  • పూర్తి డేటా సేకరించి, ప్రణాళిక సిద్ధం చేయండి
  • అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 10:  రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు. పంట రుణమాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.2లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని తెలిపారు. కటాఫ్‌ డేట్‌ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.

కేవలం బ్యాంకుల నుంచే కాకుండా, పీఏసీఎస్‌ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు  పూర్తి స్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు. రుణమాఫీకి సంబంధించి విధివిధానాలను రూపొందించి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15లోగా పంట రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి అధికారులకు తేల్చి చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు, ముఖ్యమంత్రి  సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *