– ‘అనిమేష’ (కొరోనా) 2020 కవితా సంపుటికి..
– ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : తెలంగాణ సాహిత్య అకాడమి తొలి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు-2025ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 24 భాషలలో అందించే ఈ పురస్కారానికి తెలుగు కవిత్వంలో ప్రముఖ విమర్శకుడు, కవి, రచయిత డాక్టర్ సిధారెడ్డికి ఎంపికయ్యారు. కోవిడ్ కాల పరిస్థితుల మీద, కొరోనా నేపథ్యంలో రచించిన ‘అనిమేష’ (కొరోనా) 2020 కవితా సంపుటికి ఈ పురస్కారం లభించడం విశేషం. 1974లో కవిత సృజన ప్రారంభించిన సిధారెడ్డి 52 ఏళ్లుగా తెలుగు సమాజంలోని కాల పరిస్థితులను, సందర్భాలను కేంద్ర బిందువుగా చేసుకొని కవిత్వం, కథలు, పాటలు రచిస్తున్నారు. సిధారెడ్డి సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బండారం గ్రామంలో నందిని రత్నవ్వ, బాల సిద్ధారెడ్డి దంపతులకు 1954 మే 2న జన్మించారు. ప్రాథమిక విద్యను బందారంలో, సిద్దిపేటలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. 1978లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎం.ఏ తెలుగు పూర్తి చేశారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి పర్యవేక్షణలో ‘కవిత్వంలో సూర్యుడు’ అంశంపై ఎం.ఫిల్ పూర్తి చేశారు. అదేవిధంగా ఆధునిక తెలుగు కవిత్వంలో వాస్తవికత అధివాస్తవికత అనే అంశంపై పీహెచ్‌డి పట్టా పొందారు. 1974లో తొలిసారిగా కందుకూరి శ్రీరాములు, కర్నాల బాలరాజుతో కలిసి ‘దివిటి’ కవితా సంకలనం ప్రచురించారు. భూమి స్వప్నం(1987), సంభాషణ(1991), ప్రాణహిత (1996), ఒక బాధకాదు (2001), నదిపుట్టువడి (2007), ఇక్కడ చెట్ల గాలి (2014), నీటి మనసు(2019), అనిమేష – ఉపద్రవగాథ-2020 (కొరోనా) తొమ్మిది కవిత్వ సంపుటాలు ముద్రించారు. నాగేటి చాలల్ల- (2012) ద్వారా పాటల రచయితగా గొప్ప పేరును సంపాదించారు. మలి దశ ఉద్యమ కాలంలో ఆ పాట ఉద్యమకారులను ఉత్తేజితులను చేసింది. అదేవిధంగా సాహిత్య విమర్శలో ఇగురం, ఆవర్తనం, కులవృత్తులు గ్రంథాలను ప్రచురించారు. 1980లో ఉస్మానియా రైటర్స్ సర్కిల్‌తో ప్రారంభమై మరసం, తెలంగాణ సాంస్కృతిక వేదిక, తెరవే, తెరసం సంస్థల నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వహించారు. వివిధ స్వచ్ఛంద సాహిత్య సేవా సంస్థల నుంచి 18 సాహిత్య పురస్కారాలను అందుకున్నారు. జాతీయస్థాయిలో తెలుగు కవిగా భోపాల్, కేరళ, సిమ్లా, మిజోరాంలలో తెలుగు కవిగా ప్రాతినిధ్యం వహించి తన ప్రతిభను చాటుకున్నారు. చిత్రకన్ను(2016), బందారం కథలు (2024) ఉత్తమ కథ రచయితగా గుర్తింపును తెచ్చిపెట్టాయి. 1984లో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి 2012లో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారు. కాగా, డాక్టర్ సిధారెడ్డిలో ఒక ధిక్కార స్వభావం కూడా ఉందని తెలుగు విమర్శకులు భావిస్తారు. సామాజిక రాజకీయ పరిస్థితులపై స్పందించే స్వభావం కూడా ఉంది. ఆయన సాహిత్యంలో తిరస్కరించిన అవార్డులను కూడా మనం గమనించవచ్చు. 2001లో ప్రాణహిత కవితా సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ కవితా పురస్కారం ప్రకటించగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా సిధారెడ్డి ఆ పురస్కారాన్ని తిరస్కరించారు. 2024లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య పురస్కారాన్ని కూడా తిరస్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు, సాంస్కృతిక చిహ్నం బతుకమ్మను తొలగించడం పట్ల ఆయన రూ.కోటి అవార్డును తిరస్కరించారు. కాగా, డాక్టర్ సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా ప్రముఖ కవులు డాక్టర్ యాకూబ్, నాళేశ్వరం శంకరం, కోడం కుమార్, బిల్లా మహేందర్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, నక్క సురేష్, పానుగంటి రామ్మూర్తి, శ్రీలేఖ రంగస్వామి, జోగు అంజయ్య, పోరెడ్డి రంగయ్య, బర్లా మహేందర్ తదితరులు అభినందనలు తెలిపారు. పురస్కారం కింద అవార్డు గ్రహీతలకు రూ.లక్ష నగదు, తామ్ర పత్రం, శాలువాతో దిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈనెల 31న స్వీకరించనున్నారు.
తెలంగాణ సాహిత్యానికి దక్కిన గౌరవం : నామోజు 
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మొదటిసారిగా మంజీర రచయితల సంఘం తరపున తీర్మానం చేసిన నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం లభించడం తెలంగాణ సాహిత్యానికి దక్కిన గౌరవంగా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి అన్నారు. ‘నాగేటి చాలల్ల నా తెలంగాణ’ పాట ద్వారా తెలంగాణ గడపగడపను చైతన్యపరిచిన సిధారెడ్డి రాష్ట్ర అవతరణ అనంతరం తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడిగా తెలంగాణ సాహిత్య వికాసానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారని గుర్తు చేశారు. ప్రపంచం మొత్తం కరోనా కోరల్లో విలవిలలాడుతూ చావుబతుకుల మధ్య తండ్లాడుతుంటే ఒక కవిగా వేదనతో రాసిన ‘అనిమేష’ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించడం తెలంగాణ సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని బాలాచారి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో సిధారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
కేసీఆర్ హర్షం
కేంద్ర ప్రభుత్వ అత్యున్నత సాహిత్య పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2025 నందిని సిధారెడ్డికి దక్కడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, బీఆరఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయనను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సందర్భంగా ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాన్ని, ముఖ్యంగా మానవ సంబంధాల విచ్చిన్నతలను కవిత్వం ద్వారా హృద్యంగా చిత్రీకరించిన దీర్ఘ కవితా సంపుటి ‘అనిమేష’కు ఈ అవార్డు రావడం గొప్ప విషయం అని అన్నారు. తెలంగాణ మట్టివాసన తెలిసిన కవిగా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన, తెలంగాణ గర్వించదగ్గ కవి, నందిని సిద్ధారెడ్డి అని కొనియాడారు. మెదక్ జిల్లా కేంద్రంగా మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజా సమస్యలు, సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తూ తమ కలాన్ని గళాన్ని విప్పారని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన పాట, సాహిత్యం ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తూ ఉద్యమ కవిగా రాష్ట్ర ప్రజల అభిమానాన్ని సిద్ధారెడ్డి చూరగొన్నారన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





