తృటిలో ఎన్నో ఎన్ కౌంటర్ల నుంచి బయటపడ్డా..
ఇదంతా నాకు పునర్జన్మే..
నా భర్త నేర్పిన విలువలతోనే ప్రజల కోసం పనిచేస్తున్నా
తన భర్త కుంజ రాము 21వ వర్ధంతి సభలో మంత్రి సీతక్క
నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనైన మంత్రి
చివరి శ్వాస వరకు ఆదివాసీలు పేదలు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన భర్త కుంజ రాము పరితపించారని మంత్రి సీతక్క వెల్లడించారు. విప్లవోద్యమంలో ఆయన నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందానని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం మోకాలపల్లి గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన కుంజ రాము 21 వర్ధంతి సభలో మంత్రి సీతక్క తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కుంజ రాము వర్ధంతి సభ నిర్వహిస్తున్న ఆదివాసి సంఘాలకు ఆయన ఉద్యమ సహచరులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విప్లవోద్యమంలో విభేదాలు వొచ్చి ఎర్రజెండా వదిలి ఆకుపచ్చ జెండా పట్టిన రాము… ఎర్రజెండా వెలుగులోనే పోరాటాలు చేశారని అన్నారు. 17 సంవత్సరాల వయసులోనే కుంజా రాము ఉద్యమ బాట పట్టారు.
చివరి వరకు ప్రజల కోసమే పరితపించారు. రాము నేర్పిన విలువలతో నైతికతతో ప్రజల కోసం పనిచేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ప్రజల కష్టాలు తెలుసని, శ్రమను గౌరవించడం తెలుసని చెప్పారు. అందుకే ప్రజల కోసమే పనిచేయాలన్న సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నానని చెప్పారు. ఎవరికి అన్యాయం చేయొద్దు అన్న రాము మాటలే మాకు స్ఫూర్తి. అందరికీ న్యాయం జరగాలన్న ఆయన పోరాటాల స్ఫూర్తిగా ఉద్యమించాం.. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం పాటుపడదాం. మంత్రిగా ఉన్నా ఇదే సిద్ధాంతంతో ముందుకు వెళుతున్నా.. అని మంత్రి సీతక్క అన్నారు. 30 సంవత్సరాలు పరిష్కారం కానీ ఎస్సీ వర్గీకరణను, 100 సంవత్సరాల్లో జరగని బీసీ కులగనను విజయవంతం చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్టీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అందరూ బాగుండాలి అన్న కుంజా రాము ఆశయాల సాధన కోసం పనిచేస్తాం. ఆస్తులు అంతస్తులు పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల కోసమే పని చేస్తాం. ప్రజల కోసం పని చేసిన బంధుత్వం ఎప్పటికీ పోదు. అందుకే రాము మరణించి 20 సంవత్సరాలు అవుతున్నా.. ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకునేందుకు మీరంతా ఇక్కడికి వచ్చారని కొనియాడారు. తాను కూడా ఉద్యమంలో ఎప్పుడో చనిపోయేదాన్నని, తృటిలో ఎన్నో ఎన్కౌంటర్ల నుంచి బయటపడ్డానని చెప్పారు. ఇది నాకు బోనస్ లైఫ్.. ఇదంతా నాకు పునర్జన్మే.. మిగిలిన జీవితాన్ని ప్రజల కోసం సేవ చేయాలనీ ప్రజా జీవితంలో ఉన్నాను.. ఈ జీవితమంతా ప్రజలకు అంకితం. మీ సహాయ సహకారాలు నన్ను బలవంతురాలని చేస్తుంది. మీరు అందించే బలంతో పేదరిక నిర్మూలన, ఆదివాసీలు అట్టడుగు వర్గాల హక్కుల రక్షణ కోసం కడదాకా నిలబడతానని మంత్రి సీతక్క వెల్లడించారు.





