అగ్నిజ్వాలలను లేపిన అగ్నిపథ్‌

‌నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ ‌పథకం అగ్ని వర్షాన్ని కురిపిస్తున్నది. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా యువత ఆగ్రహానికి కేంద్ర, రాష్ట్ర ఆస్థులు ధ్వంస•మవుతున్నాయి. ఎట్టి పరిస్థితిలో కేంద్రం ఈ పథకాన్ని వెనక్కు తీసుకోవాలని నిరుద్యోగ యువత డిమాండ్‌ ‌చేస్తుండగా, కేంద్రం మాత్రం యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే విషయంలో తాము ప్రవేశ పెడుతున్న పథకం ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని వాదిస్తున్నది. కొరోనా , తదితర కారణాలతో కేంద్ర ప్రభుత్వం సైన్యంలో రిక్రూట్‌ ‌మెంట్‌లను గత రెండు, మూడు ఏళ్ళుగా వాయిదావేస్తూ వస్తున్నది. ఏ సంవత్సరానికా సంవత్సరం పరీక్షలు జరిపి తమను తీసుకుంటారన్న ఉద్దేశ్యంగా నిరుద్యోగ యువకులు తమ శరీర దారుడ్యాన్ని కాపాడుకుంటూ రిక్రూట్‌మెంట్‌ ‌కోసం ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికీ ఆరు సార్లనుండి ఈ రిక్రూట్‌మెంట్‌ను వాయిదా వేస్తుండడంతో తమ వయస్సుకూడా దాటిపోతున్నదని ఒక పక్క యువత ఆవేదన వ్యక్తంచేస్తోంది. మరి కొందరు హాల్‌ ‌టికట్లు పొందినవారికి కూడా పరీక్షలు నిర్వహించకపోవడంతో తీవ్ర వ్యధ చెందుతున్నారు. వీరిలో మెడికల్‌, ‌రన్నింగ్‌ ‌ఫిట్‌నెస్‌ ‌లాంటి టెస్ట్‌లు పాసైనవారున్నారు. అయినా కేంద్రం వాయిదాల పర్వం కొనసాగిస్తూనే ఉంది. పైగా తాజాగా రిక్రూట్‌మెంట్‌ ‌విధానాన్ని మార్చింది. ఈ విషయంలో అగ్నిపథ్‌ ‌పేర కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రకారం త్రివిధ• దళాల్లో రిక్రూట్‌మెంట్‌ అయిన యువకులు కేవలం నాలుగంటే నాలుగు ఏళ్ళపాటే సైన్యంలో పనిచేస్తారు. అ తర్వాత వారి బతుకు వారే చూసుకోవాలన్నది ప్రభుత్వం పాలసి. ఇది దేశవ్యాప్తంగా ఉపాధి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయింది. సైన్యంలో చేరిన వారి పెర్ఫార్మెస్‌ను బట్టి వారిలో ఇరవై అయిదు శాతం మందిని మాత్రమే సైన్యంలో కొనసాగించే అవకాశాలుంటాయి.

మిగతావారికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, స్వయం ఉపాధికోసం బ్యాంకుద్వారా అప్పు ఇప్పిస్తామన్నది అందులోని మరో అంశం. ఇది నిరుద్యోగ యువకులకు కొరకుడు పడకుండా పోయింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగావకాశాలన్నది అందని ద్రాక్షే అంటున్నారు యువత. ఇక బ్యాంకులద్వారా అప్పులు తీసుకుని స్వయం ఉపాధి చేపట్టడం ఎంతమందికి సాధ్యపడుతుందన్నది మరో ప్రశ్న. అందుకే నాలుగేళ్ళ తర్వాత తమను గాలికి వదిలే ఈ పథకాన్ని వెంటనే విరమించుకుని, పూర్వం లాగానే రిక్రూట్‌ ‌చేయాలంటూ దేశ వ్యాప్తంగా యువత గత రెండు రోజులుగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఫలితంగా ఆందోళనకారుల చేతిలో పలు రైళ్ళు అగ్నినికి ఆహుతి అయినాయి. మరి కొన్ని రైళ్ళు విధ్వంసమయినాయి. బస్సులు, ప్రైవేటు వాహనాలు ధ్వంసమయినాయి.. బీహార్‌లో అయిదు రైళ్ళకు నిప్పు పెట్టారు. వివిధ రాష్ట్రాల్లోని రైల్వేస్టేషన్‌లలో రైళ్ళు, రైల్వే ఆస్తులు ధ్వంసమయినాయి.. దీంతో రైల్వేశాఖ పదుల సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. సికిందరాబాద్‌లో ఎంఎంటి రైళ్ళతో సహా పలు రైళ్ళను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు. దిల్లీ , ముంబాయి తదతర ప్రాంతాలకు వెళ్ళేవారు అయిదారు గంటలుగా స్టేషన్‌లో పడిగాపులు పడుతున్నారు. ఈ సందర్భంగా ఆందోళన కారులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో యువకులు రాళ్ళు రువ్వడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.

ఉదయం ఎనిమిది గంటలనుండే యువకులు పెద్ద సంఖ్యలో సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌కు చేరుకుని పట్టాలపై బైటాయించారు. రైల్వే ఆస్తులను ధ్వంస•ం చేశారు. దీనితో పోలీసులు దాదాపు పదిహేను రౌండ్ల కాల్పులు జరుపడంతో ఒకరు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. చనిపోయిన వ్యక్తి వరంగల్‌ ‌జిల్లాకు చెందిన రాకేశ్‌గా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తున్నది.సికింద్రాబాద్‌ ‌రైల్వే పట్టాలపైన ఉదయం ఎనిమిది గంటలనుండి బైటాయించిన యువకులు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ పథకాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. కాగా వారి ఆందోళనను విరమింపజేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యులు కొందరితో చర్చించేందుకు పోలీసు ఉన్నతాధికారులు సిద్దమైనప్పటికీ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ అధికారులే రావాలని పట్టుపట్టడంతో సాయంత్రం వరకు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా సుమారు 20 కోట్ల రూపాయల విలువైన ఆస్తినష్టం జరిగిఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వొచ్చినప్పుడు ప్రతీఏట రెండు లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఆ హామీని గత ఎనిమిదేళ్ళుగా నిలుపుకోలేకపోయింది. ప్రపంచ వ్యాప్తంగా దావానలంగా వ్యాపించిన కొరోనా కారణంగా చాలా మంది ఉన్న ఉపాధి అవకాశాలను కూడా కోల్పోయారు. ఇప్పటికీ లక్షలాది కుటుంబాలు ఇంకా కోలుకోలేకపోతున్నాయి. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెద్దనోట్ల రద్దు సందర్భంగా ప్రతీ ఇంటికి పదిహేను వేల రూపాయలను బ్యాంకు అకౌంట్‌లో వేస్తామన్న మాటనుకూడా కేంద్ర ప్రభుత్వం నిలుపుకోలేకపోయిందన్న అపవాదు• ఉంది. నిన్నగాక మొన్న వ్యవసాయ రంగంలో ఏర్పాటు చేసిన మూడు చట్టాలపై దేశ రైతాంగమంతా తిరుగుబాటు చేయడంతో కేంద్రం తోకముడిచింది. ఇప్పుడు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ‌విషయంలోకూడా దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగుతున్నది. నిరుపేద వర్గాలు, ఎక్కువగా చదువుకోలేకపోయినవారు సహజంగా సైన్యంలో కానిపక్షంలో రాష్ట్రాల్లో జరిగే పోలీసు నియామకాలకోసం ఎదురు చూస్తుంటారు. ఇందులో దేశంమీద ప్రేమ, అభిమానం ఉన్నవారు సైన్యంలో చేరడంద్వారా తమ మాతృ దేశానికి సేవచేసిన వారమవుతామన్న సంకల్పంతో సైన్యంలో చేరడానికి ఉత్సాహం చూపించేవారూ ఉన్నారు. కేంద్రంలో సైనిక రిక్రూట్‌మెంట్‌ ‌చాలాకాలంగా నిలిచిపోవడంతో వేల సంఖ్యలో ఉన్న ఉద్యోగ ఖాలీలను నింపే అవకాశం ఉందన్న ఆశకూడా యువకుల్లో ఉండింది. కాని తీరా కేంద్రం చేసిన తాజా ప్రకటన వారిలో తీవ్ర నిరుత్సాహాంతోపాటు అసహానాన్ని కలిగించింది. దేశంలోని యువశక్తి సామర్థ్యాలను సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిందిపోయి నాలుగేళ్ళకే వారి సర్వీసును పరిమితం చేస్తామనడం ఎంతవరకు న్యాయమన్నది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలుకూడా విమర్శిస్తున్నాయి.

యువకులు ఒక ఉద్యోగంలో చేరారంటే వారి బతుకుకు స్థిరత్వం లభించిందన్నమాటే. కాని ఇక్కడ సైన్యంలోచేరి స్థిరత్వంలేని జీవనం సాగించాల్సి వొస్తుంది. నాలుగేళ్ళ తర్వాత మరోసారి ఉపాధి కోసం ఎదురు చూడాల్సి వొస్తుంది. దీన్ని చూస్తుంటే సైన్యం అంటే కేంద్ర ప్రభుత్వానికి గౌరవం లేదన్నది స్పష్టమవు తున్నదంటున్నారు రాహుల్‌ ‌గాంధీ. సైన్యంలో చేరిన వారు వివిధ అంశాలలో శిక్షణ పొందేందుకు ఎంతలేదన్న సంవత్సరం పైగానే పడుతుంది. అలాంటప్పుడు వాస్తవంగా అతను చేసే సర్వీసు కేవలం మూడు లేదా రెండు సంవత్సరాలకే పరిమితం అవుతుంది. అంత తక్కువ సమయంలో బార్డర్‌లో బాధ్యతలను వారు ఎలా నిర్వహిస్తాన్న ప్రశ్నకూడా తలెత్తుతోంది. సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలిలో తమ సీనియర్‌లతో పాటు వీరు బాధ్యతలు నిర్వహించడం అంత సులభంగా సాధ్యమయ్యేదికాదు. అన్నిటికీ మించి రిటైర్‌మెంట్‌ ‌బెనిఫిట్స్ ఏవీ వీరికి వర్తించవన్నది మరో పెద్ద అంశం. పెన్షన్‌లను ఇవ్వకుండా ప్రభుత్వం డబ్బును ఆదా చేసుకుంటానికే ఈ విధానాన్ని రూపొందించిందన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తుండగా, సీనియర్‌ ‌మిలటరీ అధికారులతో చర్చించిన తర్వాతే తామీ పథకాన్ని రూపొందించినట్లు కేంద్రం చెబుతున్నది. అయితే రిటైరైన సీనియర్‌ అధికారులమాత్రం అనాలోచిత చర్యగా చెబుతున్నారు. మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం.. ప్రజల ఆమోదంతోనే పథకాల రచన చేయాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఈ పథకంపైన వ్యతిరేకత వొస్తున్నదంటే కేంద్ర ప్రభుత్వం దీనిపైన పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది. కాదని మొండిగా వ్యవహరిస్తే పంజాబ్‌ ‌రైతుల్లా ఉద్యమం తీవ్రతరంగా మారే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.

– మండువ రవీందర్‌రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *