- ఈదురుగాలులతో కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక
- చెట్లకిందకు పోరాదని జిహెచ్ఎంసి వార్నింగ్
- నిండుకుండలా జంట జలాశయాలు, హుస్సేన్ సాగర్
- వనస్థలిపురం సహారా ఎస్టేట్‌లో చెట్టుకూలి మహిళ మృతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 12 : అల్పపీడనం ప్రభావంతో నగరాన్ని ముసురు వాన కమ్ముకున్నది. వరుసగా ఐదో రోజు హైదరాబాద్ వ్యాప్తంగా పలుచోట్ల చిరుజల్లులు కురుస్తుండగా.. పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నగరంలో రానున్న 12 గంటల పాటు బలమైన ఈదురుగాలులతో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. రాత్రి 10 గంటల వరకు గాలులు కొనసాగుతాయని వెల్లడించింది. భారీ తీవ్రతతో వీచే గాలులకు చెట్లు విరిగిపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలతో పాటు అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు అత్యవసర సమయాల్లో అవసరమైతేనే బయటకు రావాలని, లేదంటే ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేసింది. గాలులకు చెట్లు విరిగిపడే అవకాశం ఉన్నందున వర్షం కురిస్తే ఎవరూ చెట్ల కింద ఉండొద్దని చెప్పింది.
అత్యవసర సమయాల్లో డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని ఈవీడీఎం తెలిపింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కునేందుకు బృందాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. గత ఐదు రోజులుగా నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్‌కు పెద్ద ఎత్తున వరద నీరు వొచ్చి చేరుతుంది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. కూకట్పల్లి నాలా నుంచి వొస్తున్న నీరు సైతం హుస్సేన్‌సాగర్ లోకి చేరుతుంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుతం పూర్తి స్థాయికి చేరుకుంది. వొస్తున్న నీటి ఇన్ప్లోకు… సమానంగా తూముల ద్వారా నీరు బయటకు వెళుతోంది. వర్షాలకు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నిండుకుండలా మారాయి. అలాగే హుస్సేన్‌సాగర్ సైతం నీటితో నిండిపోయింది.
వనస్థలిపురం సహారా ఎస్టేట్‌లో చెట్టుకూలి మహిళ మృతి
వనస్థలిపురం సహారా ఎస్టేట్‌లో చెట్టు కూలీ మంజుల(46) అనే మహిళ మృతి చెందింది. గత రెండు రోజుల క్రితం తన పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో చెట్టు కూలీ ఆమె వి•ద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం ఈ ఘటన జరగగా వనస్థలిపురంలోనీ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. మంజులకు బర్త మల్లేష్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంజుల స్వస్థలం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండ గూడెం కాగా ఇండ్లల్లో పని చేస్తూ జీవనం సాగిస్తుంది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.




