- మహిళల హక్కులను కాలరాస్తున్న పాలకులు
- మహిళా ఉద్యమాలు మరింత ఉధృతం కావాలి
- మహిళా సంఘాలు ఐక్యంగా ముందుకు సాగాలి
- పీవోడబ్ల్యూ అర్థ శతాబ్ది వార్షికోత్సవ సభలో పాల్గొన్న పలువురు ప్రముఖులు
- పెద్ద సంఖ్యలో హాజరైన పివోడబ్ల్యూ కార్యకర్తలు, మహిళలు
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, జూన్ 22 : హింసను వ్యతిరేకించడానికి అనేక ఉద్యమాలు రావాలని, మహిళలు దీనిలో భాగస్వామల కావాలని ఢల్లీికి చెందిన ఇండిపెండెంట్ జర్నలిస్ట్, రచయిత్రి బాషాసింగ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో పీవోడబ్ల్యూ అర్థ శతాబ్ది వార్షికోత్సవ సభ కామ్రేడ్ అంబిక అధ్యక్షతన నిర్వహించారు. పీవోడబ్ల్యూ అర్థ శతాబ్ది వార్షికోత్సవ సమన్వయ కమిటీ సభ్యులు వి.సంధ్య జి.రaాన్సీ, చంద్ర అరుణ, అరునోదయ విమలక్క, సామాజిక కార్యకర్త, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కె.సజయ, రమ, శ్రీదేవి, సిస్టర్ లెస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిధిగా హాజరైన బాషాసింగ్ మాట్లాడుతూ.. మహిళల హక్కులను పాలకులు కాలరాస్తున్నారని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగాన్ని మార్చి మనువాదాన్ని తీసుకురావడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగంలో స్త్రీల హక్కులు బలంగా ఉన్నాయన్నారు.
వీటిని మార్చే కుట్ర జరుగుతుందని, దీనిని ప్రతి ఒక్కరు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఫాసిజం, మనువాదానికి వ్యతిరేకంగా బలమైన పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మరో వక్త ప్రొఫెసర్ రమామెల్కోటే మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులపై పూర్తి అవగాహన పెంపొందించుకుని పాలకులను ప్రశ్నించాలన్నారు. కొత్త విషయాలను తెలుసుకునే అవగాహన కూడా మహిళలకు ఎంతో అవసరం అన్నారు. మానవ హక్కులను కాపాడుకుంటూ నైతిక విలువలు పెంపొందించుకోవాలని సూచించారు. హింస పెరిగి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా ఉద్యమాలు మరింత ఉదృతం కావాలన్నారు. పెట్టుబడిదారి విధానం వల్ల హక్కులు సర్వనాశనం అయిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ సామాజికంగా అవగాహనతో పాటు కొత్తగా వస్తున్న సమస్యలను కూడా తెలుసుకోవాలని, అందు కోసం పోరాటాలు మరింత ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. మరో వక్త ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే మాట్లాడుతూ 1980 లో పీవోడబ్ల్యూ తనకు పరిచయమైందని ఆ తర్వాత అతి పెద్ద మహిళా సంఘంగా గుర్తింపు పొందిందన్నారు. పీడితులకు అండగా నిలవడంతో పాటు రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఫాసిజానికి వ్యతిరేకంగా బలమైన పోరాటాలు నిర్వహించిందన్నారు. మహిళా సంఘాలు ఐక్యంగా ముందుకు సాగితేనే వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ఈ సందర్భంగా అరుణోదయ విమలక్క పాడిన పాటలు మహిళలను ఉత్తేజ పరిచాయి. సభ ముగిసిన తర్వాత బషీర్ బాగ్ లోని బాబు జగ్జీవన్ రాం విగ్రహం వద్ద నిరసన తెలిపారు.





