సిఎంగా రేవంత్‌రెడ్డి రెండు రోజుల ప్రయాణం- రెండు పథకాలు

 గెస్ట్‌ ఎడిట్‌, మండువ రవీందర్‌రావు

ఇరవై నాలుగేళ్ళపాటు తెలంగాణ ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునే కాకుండా, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను ఒక దశాబ్ధకాలం ఏకచ్ఛాత్రాధిపత్యంగా ఏలిన కెసిఆర్‌ను మరుగునపడేసి అత్యధిక ప్రజల మద్దతును కూడగట్టుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎనుముల రేవంత్‌రెడ్డి  రెండు రోజుల్లోనే ప్రజలకిచ్చిన మాటను నిలుపుకోవడం ద్వారా మరోసారి ప్రజల హృదయాలను చూరగొన్నారు. గెలిచిన సంబరాలను పక్కకుపెట్టి ఇచ్చిన హామీల్లో  రెండిరటిని రెండు రోజుల వ్యవధిలో ఒకే రోజున అదికూడా తమ ప్రియతమ నాయకురాలు సోనియాగాంధీ జన్మదినం రోజున అమలులోకి తేవడం ద్వారా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్న నమ్మకాన్ని కలిగించడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఎన్నికల మానిఫెస్టోకన్నా ముందే కాంగ్రెస్‌ పార్టీ తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు పరుస్తామని ప్రకటించిన విషయం తెలియందికాదు.

కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా  ఇంటింటికీ తిరిగి గ్యారెంటీ కార్డులను అందజేసింది. ఈ గ్యారెంటీలన్నిటినీ వందరోజుల్లో అమలుచేస్తామని చెప్పినప్పటికీ వాటిల్లో రెండిరటిని అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే ప్రజలకు అందించడం ఒక విశేషం కాగా, ముఖ్యమంత్రిగా పదివీ బాధ్యతలను చేపట్టిన రోజున్నే ఆరు గ్యారంటీల ఫైల్‌పై సంతకం చేయడం పనిచేసే ప్రభుత్వంగా ప్రజల్లో విశ్వాసం కల్పించినట్లైంది. ప్రమాణస్వీకారం రోజున్నే దివ్యాంగురాలికి ఉద్యోగం కల్పిస్తూ    ఉత్తర్వులు జారీచేయటం. మరుసటిరోజున వందలాది మంది తమ బాధలను చెప్పుకునే విధంగా ప్రజాదర్భార్‌ నిర్వహించి వారినుండి స్వయంగా వినతి పత్రాలను స్వీకరించి ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చడం ఒక అద్భుతం. వొచ్చిన విజ్ఞాపన పత్రాలకోసం 15 డెస్క్‌లు ఏర్పాటు చేయడం, వాటిని కంప్యూటరీకరించడం ఒక ఎత్తు అయితే,  ఆ మరసటిరోజు అంటే శనివారం ఆరు గ్యారెంటీల్లోని  రెండు పథకాలకు శ్రీకారం చుట్టడం అన్నీ యుద్దప్రాతిపధిక ఒకదానివెనుకటిగా సాగిపోతున్నాయి.

రేవంత్‌రెడ్డి మొదటినుండీ కాస్తా దూకుడుగానే వ్యవహరించడం చూస్తున్నాం. తన దూకుడుకు ఒక నిర్ధిష్ట ప్రణాళికను ఆయన ముందుగానే ఏర్పరుచుకుంటాడు. ఆయన సహధర్మచారిణి చెప్పినట్లు ప్రజాసమస్యలపై పోరాటం చేసినప్పుడు దాని లోతుపాతులను ముందుగా అధ్యయనం చేయడంద్వారా తాను ఏ విషయాన్ని తీసుకున్నా దానిపై అనర్గళంగా మాట్లాడే నేర్పరితనం అవలంభించుకున్నాడు కనకనే రాజకీయాల్లోకి వొచ్చిన అనతికాలంలోనే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. విచిత్ర విషయమేమంటే ఆయన ఇంతవరకూ కనీసం మంత్రిగా పనిచేసిన దాఖలాలులేవు.  గడచిన ఇరవై ఏండ్లుగా ఆయన ప్రతిపక్ష పార్టీలో కొనసాగుతూ వొచ్చాడు. ఇప్పుడు ఏకంగా సిఎం పదవినే అధిష్టించాడు. అదికూడా అలవోకగా లభించిందేమీకాదు. కెసిఆర్‌ లాంటి కొండను ఢీ కొని, తన సమర్థతను నిరూపించుకున్నాడు. టిడిపిలో ఉండగా వోటుకు నోటు కేసుతో ఆయన రాజకీయ జీవితానికి తీరని మచ్చ ఏర్పడినా, పార్టీ మారి కాంగ్రెస్‌లోకి రావడంతోనే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని చేపట్టగలిగాడు.

పార్టీలో అంతర్ఘతంగా ఎదురైన అనేక సమస్యలను ఎదుర్కోవడంతోపాటు, దిగ్గజాల్లాంటి కాంగ్రెస్‌ నాయకులందరినీ తన చాతుర్యంతో మెప్పించి, ఒప్పించడమేకాకుండా  తాజా ఎన్నికల్లో  అఖండ మెజార్టీతో కాంగ్రెస్‌ను గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రేవంత్‌రెడ్డి ముందు ఇప్పుడు అనేక  సమస్యలున్నాయి. కేవలం ఆరు గ్యారంటీలను అమలు పర్చడమేకాదు. ఎన్నికల మానిఫెస్టోలో పొందుపర్చిన హామీలన్నిటినీ పూర్తి చేయాల్సి ఉంది. అంతేకాదు ఎన్నికల సమయంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల కొనసాగింపు కూడా పెద్ద సమస్యనే. ఈ పథకాల అమలుకు గత ప్రభుత్వం వేలాదికోట్ల అప్పులు చేసింది. వాటితోపాటు కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు తగిన నిధులను ఎలా సేకరిస్తారన్న ప్రశ్న సామాన్య ప్రజల నుండి కూడా వొస్తున్నది. ఇప్పటికే ప్రజలు అధిక పన్నుల భారాన్ని మోస్తున్నారు. మరింత భారాన్ని మోసే శక్తి వారిలోలేదు.

ఆర్టీసి ఇప్పటికే నష్టాల ఊబిలో చిక్కుకు పోయింది. కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కలిగించే ‘మహాలక్ష్మీ’ పథకాన్ని ప్రవేశపెట్టడం హర్షించదగిన విషయమే అయినప్పటికీ ఈ నష్టాన్ని  ప్రభుత్వం ఎలా భరిస్తుందన్న ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది. అలాగే ఆరోగ్యశ్రీని అయిదు లక్షల నుండి పదిలక్షలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పెంచింది. ఇదికూడా హర్షించదగిందే.  నిరుపేదవర్గాలకు నిజంగా ఇది వరమనే చెప్పాలి. దీనితోపాటు ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకువొచ్చినట్లైతే ఆరోగ్యశ్రీపైన ప్రభుత్వం మోస్తున్న ఆర్థిక భారాన్ని కొంతవరకైనా తగ్గించుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే రైతు బంధు విషయంలోకూడా.. పెద్ద భూస్వాములు, పంటలేయని పొలాలకు కాకుండా వాస్తవంగా అవసరమున్న రైతులకే అందజేసినట్లు అయితే ప్రభుత్వంపైన ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ప్రభుత్వం వీటిపైన ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందని సామాన్యప్రజలు ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *