సిఎం రేవంత్‌ రెడ్డితో కెకె భేటీ

కాంగ్రెస్‌లో చేరికపై ఇరు నేతల చర్చలు
తన పుట్టిల్లు కాంగ్రెస్‌ అంటూ కేశవరావు వ్యాఖ్య

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి29: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు  భేటీ అయ్యారు. డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డితో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన కేకే.. ముఖ్య మంత్రితో పార్టీ చేరికకు సంబంధిం చిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తున్నది. తాను బీఆర్‌ఎస్‌ నుంచి సొంతగూటికి చేరుతున్నట్లు కెకె ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. ఆయన కూతురు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. ఇటీవల వారితో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షి కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీలోకి తిరిగిరావాలని ఆహ్వానించారని చెప్పారు. దీంతో 84 ఏండ్ల వయసులో తిరిగి సొంత ఇంటికి వెళ్లాలన్న ఆలోచన తనకు కూడా కలిగిందని కేకే అన్నారు. బీఆర్‌ఎస్‌లో తనకు సముచిత గౌరవం దక్కిందని, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ తనకు గౌరవం ఇచ్చారని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా తనను బాగా చూసుకున్నారని అన్నారు. తాను, తన కుమార్తె, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి కాంగ్రెస్‌లోకి వెళ్లాలన్న ఆలోచనతో ఉన్నామని చెప్పారు. తన కుమారుడు విప్లవ్‌ బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని చెప్పాడని వెల్లడిరచారు. కేకే నిన్న బీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెప్పిన విషయం తెలిసిందే. చనిపోయే వరకూ కాంగ్రెస్‌ లోనే ఉంటానని కేకే తెలిపారు. రేపు ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారు. కేకే కాంగ్రెస్‌ పార్టీలో చేరనుండటంతో ఒక్కసారిగా రాష్ట్రంలో కలకలం ప్రారంభమైంది. ముందుగా ఆయన కుమార్తె విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరతారని.. ఆమె చేరిన తర్వాత కేకే పార్టీ మారే అవకాశం ఉందంటూ తొలుత ప్రచారం జరిగింది. కానీ ఆమె కంటే ముందుగానే రేవంత్‌తో కేకే భేటీ అవడం గమనార్హం. కాంగ్రెస్‌లో చేరడంపై కేశవరావు  తాజాగా ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ తనకు సొంత ఇల్లులాంటిదని చెప్పారు. తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా ఇంటికే చేరుతారని.. తాను కూడా తన సొంత ఇల్లు కాంగ్రెస్‌లో చేరుతానని స్పష్టం చేశారు. 53ఏళ్లు కాంగ్రెస్‌లో పని చేశానని అన్నారు.

బీఆర్‌ఎస్‌లో తాను పని చేసింది కేవలం పదేళ్లు మాత్రమేనని తెలిపారు. తెలంగాణ కోసమే బీఆర్‌ఎస్‌లో చేరానని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీయే తెలంగాణ ఇచ్చిందన్నారు. తాను మొదటిసారి కాంగ్రెస్‌ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికయ్యానని కేశవరావు తేల్చిచెప్పారు. తాను పుట్టింది, పెరిగింది, కాంగ్రెస్‌లోనేనని… ఆ పార్టీలోనే చనిపోవాలని అనుకుంటున్నానని చెప్పారు. తాను బీఆర్‌ఎస్‌కు ఇంకా రిజైన్‌ చేయలేదన్నారు. తన కూతురు కాంగ్రెస్‌లో చేరిన రోజు.. తాను ఆ పార్టీలో చేరట్లేదన్నారు. కాంగ్రెస్‌లో చేరే తేదీ ఖరారు అయిన తర్వాత తానే చెబుతానని అన్నారు. తన కుమారుడు మాత్రం బీఆర్‌ఎస్‌లోనే ఉండాలని అనుకుంటున్నారన్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి  కాంగ్రెస్‌లో చేరుతున్నారని కేశవరావు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *