సభా గౌరవాన్ని కాపాడండి..!

తెలంగాణ మూడవ శాసనసభ సమావేశాల సందర్భంగా 16డిశంబర్‌ రోజు జరిగిన సభలో అనవసర రాద్థాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అధికార, విపక్షాల విమర్శలు చూస్తే తెలంగాణ సమాజానికి అర్థం అయ్యింది. శాసనసభ ఓ పవిత్ర దేవాలయమనేది మర్చిపోయి, హుందాతనాన్ని పక్కనపెట్టి వ్యక్తిగత ధూషణలతో సభ మర్యాదలకు భంగం కల్పించినట్టుగా మిషన్‌ భగీరథ నీళ్లు రాకముందు నల్లకాడి పంచాయతీ కళ్ళముందు సాక్షాత్కరించింది. లక్షల మందికి ప్రతినిధులుగా ఉన్న శాసనసభ్యులు ఎంతో హుందాగా, మర్యాదగా ప్రవర్తించాలి. అలాంటిది రాజకీయాల్లో, అశాంతి, అసహనం పెచ్చరిల్లి పోతున్నది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కు బాటలు వేస్తూ,రాష్ట్రాన్ని అభివృద్ధి వైపునకు నడిపించాల్సిన శాసనసభ్యులే మొదటి సమావేశాల్లోనే మానసిక ఆందోళనకు గురై, ప్రజలకు ఇచ్చిన హామీలపై చర్చ చేయకుండా ఆత్మస్థైర్యం కోల్పోయిన ఒక అసాధారణ మనిషిగా ప్రవర్తించడం దుర్దినమే.ఈ కురుక్షేత్రంతో వారు ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారో మేధావులు ఆలోచించాలి. రేవంత్‌ విపక్ష నేతగా ఎన్నైనా మాట్లాడి ఉండొచ్చు, మాట్లాడే దానిలో అర్థం దాగిందని నమ్మారు.సీఎం రేవంత్‌ అధికారంలో ఉండి విపక్షనేతగా మాట్లాడడం కుదరదు కదా?  నిన్న అసెంబ్లీ సాక్షిగా అధికార,విపక్ష శాసనసభ్యుల మధ్య జరిగిన వాదనలు ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారనే విషయాన్ని సభ్యులు గుర్తుపెట్టుకుంటే మంచిది.సభలో స్పీకర్‌ ఆటలో అంపైర్‌ లాంటి వాడే అయినా మున్ముందు పాలక వర్గం ,ప్రతిపక్షాల మధ్య సమన్వయం చేస్తారా?  కనుసైగల్లో పనిచేస్తారా? అనే ప్రశ్న అందరిలో నెలకొంది.
ఈ వాదోపవాదాలకు, వ్యక్తిగత దూషణలకు  ప్రధాన కారణం 15డిశంబర్‌ గవర్నర్‌ ప్రసంగమే.అయితే  గవర్నర్‌ ప్రసంగంలో, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం పథకాలను, ఆలోచనలను స్పష్టంచేస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేర్చుతారో తన మాటల్లో వినిపిస్తూ, రాబోయే రోజుల్లో ఆ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నదో సూచనప్రాయంగా తెలియజేయడం సంప్రదాయం. ఇది ఒక తెలంగాణకే పరిమితం కాదు, ప్రతి రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ  గవర్నర్‌ ఆయా క్యాబినెట్‌ ఆమోదించిన ప్రసంగ పత్రాన్నే చదవడం ఆనవాయితీ.పార్లమెంట్‌ లో కూడా రాష్ట్రపతి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్‌ ఆమోదించిన ప్రసంగ పత్రాన్ని చదువుతారు అందులో కొత్తగా కలిపేదికాని,తీసేసేదికానీ,ఏం ఉండదు. ఎక్కడైనా గవర్నర్‌ ప్రసంగంలో ఏమి ఉండకూడదు, ఏమి ఉండాలి అనేది సుదీర్ఘ అనుభవం గల కాంగ్రెస్‌ నాయకులకు తెలియంది కాదు.అధికారంలో ఎవరు ఉంటే,వారు ఇచ్చిన స్క్రిఫ్ట్‌ చదవడం ఇప్పుడు కొత్త ఏమీకాదు.కేసీఆర్‌ ప్రభుత్వంలో ఇదే సంవత్సరం గవర్నర్‌ తమిళసై ‘‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ‘‘ ఇదే దాశరథి పాట పాడిరది.అయితే మారాల్సింది మన ఆలోచన మాత్రమే. ఎన్నికైన శాసన సభ్యుడు ,రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంత:కరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం కానీ,రాగద్వేషాలు కానీ లేకుండా భారత రాజ్యాంగానికి విధేయత చూపుతూ ప్రమాణం చేసారు.శనివారం మాత్రం  శాసనసభ సాక్షిగా అధికార పక్షం,ప్రతిపక్షం బిన్నంగా దుడుకుగా వ్యవహరించారని ప్రజలు భావిస్తున్నారు.
ప్రభుత్వం చేస్తున్న పనులన్నింటిని ప్రతిపక్షాలు మెచ్చుకోకపోవచ్చు,లేదా ఆ పథకాలను ఎలా గొప్పగా తీర్చిదిద్దవచ్చో తెలియజెప్పే అవకాశం శాసనసభ చర్చ ద్వారానే సాధ్యం అవుతుంది.గత అనుభవాలతో రాష్ట్రాన్ని మరింత గొప్పగా అభివృద్ధి చేయాలనుకోవడంలో తప్పులేదు. అది వారి భాద్యత కూడా, కానీ చెప్పాలనుకునే పద్దతే హుందాగా లేదనేది ప్రజాస్వామ్యవాదుల బాధ. అధికార పక్షం అంటే ఉన్నవి లేనివి ఊహించుకొని ఎదుటివారిని,విపక్ష పార్టీని నినందించడమే కాదు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పే రేవంత్‌ నాడు ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ కూడా వివేచనతో ,విచక్షణతో  గౌరవంగా దేశ ప్రతినిధిగా ప్రతిపక్ష పార్టీ నాయకుడు అటల్‌ బిహారీ వాజపేయిని ఐక్య రాజ్య సమితి కి పంపిన ఘనత  ఉంది. అలాంటిది ఆమె వారసత్వంలో నడుస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడుగా సీఎం రేవంత్‌ కనీస సభా మర్యాదలు పాటించాల్సిన ఆవశ్యకత ఉంది.ప్రజాక్షేత్రంలోకి వెళ్లి, ఆరు గ్యారెంటీల అమలుకు 100రోజుల సమయం అడిగి అధికారంలోకి వచ్చాక అమలు చేయక పొతే రేవంత్‌ ప్రభుత్వం ఐదు ఏండ్లు ఉండాలా ? ఆరునెలలు ఉండాలా ? అనేది తేల్చేది అంతిమంగా ప్రజలే.కట్‌ చేస్తే  ప్రజలు మార్పుకోసం అధికారం ఇచ్చారు మంచి మనుస్సుతో ఇచ్చిన హామీలను పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా విశాల దృక్ఫథంతో,క్రీడా స్ఫూర్తితో, ప్రతిపక్షంతో ముందుకు కల్సి నడిస్తే ప్రజలు స్వీకరిస్తారు.అయితే సభకు గౌరవం ఇవ్వకుండా ఒకరిపై ఒకరు  వ్యక్తిగత దూషణలతో సభ గౌరవానికి భంగం కల్గిస్తే, వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయం..
ప్రజలు గంపెడు ఆశలతో ఎదిరిచూస్తున్నశాసనసభ ఒక పవిత్ర దేవాలయం, గొప్ప చర్చావేదిక, ప్రజల ఆశలకు చిగురులు తొడిగే విధంగా  నిర్ణయాలు జరుగుతుంటాయి. దశాబ్దంగా తెలంగాణ ప్రజలు చూడనిది 76 ఏండ్ల లో ఏ ప్రభుత్వం నడిపించని రీతిలో సీఎం రేవంత్‌ నడిపిస్తారని ఆశపడ్డారు.సభలో మెజార్టీగా మూడు నుంచి ఐదు సార్లు శాసనసభకు ఎన్నికైన సభ్యులు ఉన్నప్పుడు సభ హుందాగా నడుస్తుందనే నమ్మకం ఉండడంలో తప్పులేదు. పట్టుమని పదిరోజులు కాలేదు అధికారంలోకి వచ్చి సభను మర్యాదపూర్వకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించేందుకు ప్రయత్నం చేయాల్సిన తరుణంలో ఇక సభలు ఉండవు సీఎం దొరకడేమో అన్నరీతిలో ప్రతిపక్షం, విపక్షనేతలు మళ్ళి సభకు రాలేరనే భావంతో ‘డే’ వన్‌ నుంచి ఒకరిపై  ఒకరు మాట్లాడిన తీరు వారిలో ఎంత కల్మశం  దాగి ఉందో ప్రజలు అర్థం చేసుకోగలరు.ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రజల పక్షాన ఉన్నదెవరో,ఎవరు తమ స్వార్థంకోసం దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారో, ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్నారో ప్రజలు డేగ కళ్ళతో చూస్తున్నారు. గతంలో మంత్రులకు మర్యాద నేర్పండని ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డ రోజులు ఇంకా మర్చిపోలేదు.ఇప్పుడు అదే రేవంత్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యం పేరుతో ఏకంగా బుల్డోజ్‌ చేస్తుందనే విమర్శ ఉంది.

డా. సంగనిమల్లేశ్వర్‌
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం,
వరంగల్‌,
సెల్‌ : 9866255355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *