దిగుళ్ల దేహంలోకి దిగబడుతోన్న
ఆకలి పలుగులతో
పూటపూటకీ పురిటినొప్పులు పడుతోన్న
పస్తుల ఉదరాల వేదన చూడలేక
నుసిగామారుతున్నాయిజి
రేపంటే మరో భయమే తప్ప
ఆశలంటూ లేని బడుగుజీవి
పేగుల పోగులు.
ఉదయం జరిగిన సంఘటనే
మదిని తొలిచేస్తోంటే
కళ్ళుమూసుకున్నా…
దూరంగా,దీనంగా
గుండెల్ని పిండేసే ఒక హీన స్వరం.
అది…
ఒంగిన నడుమే చుక్కానిగా
బతుకీడుస్తున్నజి
ఒక అవ్వ ఆకలి కేకల పాట.
తిండి గింజల్ని వాటేసుకోవాలన్న
తపనతో ఉన్న
ఆమె బక్కచిక్కిన చేతిలోని బొచ్చెలో
చిల్లరకాసుల గలగలలు
ఆ పాటకు తాళం.
పస్తుల పర్వాలను నిత్యం
ఆహ్వానించే ఆత్మీయ గృహానికి
చిరునామాలా ఉంది
ఆమె ఎండిన డొక్క.
ఆకలి కేకల సొమ్మును
భద్రంగా దాచుకునే గల్లా పెట్టేమో అది.
మనిషితనాన్ని మోసుకుంటూ
నడిచే అడుగులేవీ అక్కడ లేవు కాబోలు.
ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఆమెను.
మౌనదీక్షే నయమనుకుందేమో
మరలి రాని ఆకలిపాట తరలిపోయింది
తాళం ఆగిపోయింది
మానవత్వాన్ని ప్రశ్నిస్తూ….
ఇప్పుడక్కడంతా స్మశాన నిశ్శబ్దం.
ఓ ఆకలీ! నీకెంతటి నిర్దయ?
ఆమె పాటను దోచుకెళ్ళావు.
పాటల పొలంనుండి శబ్దాల పైరునీ
పెరుక్కుపోయావు.
ఇప్పుడు నీకు సంతోషమేగా!
భువిపై నరకాన్ని సృష్టించిన
ఆ మహనీయుడెవరో
ఆకలిదప్పుల్నీ నశింపచేయడానికి
ఔషధాన్ని సృష్టించి ఉంటే బాగుణ్ణని
ఆలోచిస్తూ…
ఆ మౌనతీరానే
శిలయై నిలిచింది నా మనసు..
– వేమూరి శ్రీనివాస్
9912128967
తాడేపల్లిగూడెం




