వోటర్లారా ! మేల్కొనండి!!

ప్రజాస్వామ్య పాలనలో
పార్టీల దండు యాత్రలో
కై దండల కండువాల
తల గుండుల జాతరలో
సాగుతుంది సానుభూతి
పర్యాటన యాత్ర.
అటు ఇటు కానీ
సూత్ర పాత్రులు
వినయ విధేయతొత్తుల
కాకుల కేకలు
బాకాలు, భజంత్రీలు
పూజలు, పురస్కారాలు
ఇదీ ! వోటర్లను ఆకట్టుకునే కనికట్టు
తమ తమ పార్టీల
విజయానికి పనిముట్లు
జనం ఛీ కొడుతున్నా -తమ
గణం జై కొడుతుంది.
తలపై చెప్పులు పడుతున్న
తరాల గొప్పలు చెపుతారు
మా పార్టీ పాలన చేయాలని
కిరాయి గుండాల సపోర్ట్
‌కుల సంఘాల కూలి జనంతో
కరతాల ధ్వని చప్పట్లు..
ప్రజాసామ్యానికి తూట్లు
ప్రజల గుండెల్లో ఆటుపోట్లు
అంతమే లేని అగచాట్లు.
ఎవరో వస్తారని !
ఏదో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా                             నిజం మరచి నిద్రపోకుమా !
అన్నాడు మహాకవి శ్రీశ్రీ ఆనాడు
ఆనాడే కాదు ఈనాడు కూడా                            ఇది అక్షరాల నిజం.
ప్రజల సమస్యలు తీర్చేది లేదు
ప్రజలను ఓదార్చేది లేదు
నాయకులంతా గోముఖ వ్యాఘ్రాలే !
రంగులు మార్చే ఊసరవెల్లులే
ఏ ఎండకు ఆ గొడుగు పట్టే
సమయానుకూలురే !
ప్రజల సమస్యలు పక్కన నెట్టి
ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడన్ని
ఆ పార్టీ వాడు ఏ పార్టీ వాడన్ని
ఎదురుపడక తిట్టుకోవడమే
వార్తా పత్రికల్లో, టీవీ ఛానల్లో
ఓటర్ల చెవులకు చిల్లులే                             ప్రజాసేవ అంతా అబ్రకదబ్రే.
ఈ ప్రజాస్వామ్య యుగములో
నాయకులంతా దోపిడీ దొంగలే
ఎవరికి వారే ! యమునా తీరే!!
అబ్బో!  పాదయాత్రలో
ఎంత ఆర్భాటం
అధికార కైవసానికై ఆరాటం
ఇది ప్రత్యక్ష పాదయాత్ర పర్యటన
ఇదే పరోక్ష ఓటర్ల భిక్షాటన.
వోటర్లారా మేల్కోండి  !
– కావ్యసుధ, విశ్రాంత సీనియర్‌ ‌జర్నలిస్ట్, ‌హయత్‌ ‌నగర్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *