వొచ్చే ఏడాది భారత్‌లో జి20 శిఖరాగ్ర సమావేశం

అత్యంత ప్రతిష్టాత్మకమైన జీ-20 దేశాల అధ్యక్షత బాధ్యత భారత్‌కు దక్కింది. ఇండోనేషియాలోని బాలిలో మూడు రోజులపాటు జరిగిన జీ-20 దేశాల సదస్సులో ఈ బాధ్యతను భారత ప్రధాని నరేంద్రమోదీ స్వీకరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి బాధ్యతను స్వీకరించిన మోదీ ఈ పదవిలో ఏడాది పాటు ఉంటారు. డిసెంబర్‌ ఒకటి నుంచి 2023 నవంబర్‌ 30 ‌తేదీ వరకు ఈ హోదాలో కొనసాగనున్న ప్రధాని మోదీ జి20 శిఖరాగ్ర సమావేశాన్ని ఇండియాలో వొచ్చే ఏడాది నిర్వహించనున్నారు. దీంతో భారత్‌పై బాధ్యత పెరిగింది. ప్రపంచంలో అత్యంత ప్రధానమైన వివిధ సమస్యలను పరిష్కరించేందుకు వివిధ దేశాలను సమన్వయం చేయగలడన్న నమ్మకాన్ని సభ్యదేశాలు మోదీపై చూపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వృద్ధిని పట్టాలెక్కించడం ప్రధాన అంశంగా ఇప్పుడు మోదీ ముందుంది. తాజా సదస్సులోనూ ఈ విషయాలపై ఇప్పటికే ప్రధాని మోదీ ప్రసంగించడం గమనార్హం.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాలు విధ్వంసానికి గురైనాయి. ఇలాంటి ప్రమాదమేదీ మళ్ళీ చోటుచేసుకోకుండా వివిధ దేశాలనేతలు తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయినా ఎక్కడో ఒక దగ్గర అవాంఛనీయ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య గత ఏడాది కాలంగా కొనసాగుతున్న యుద్ధం, ప్రపంచ దేశాలపై ప్రభావాన్ని చూపిస్తున్నది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ ఎకానమీపైన, ఆహార, ఇంధన, భద్రతపైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నదన్న విషయాన్ని వివరించిన మోదీ మాటలపట్ల ఆయా దేశాలు ఆసక్తిని కనబర్చాయి. ఉక్రేయిన్‌పైన జరుగుతున్న దాడిని ఊటంకిస్తూ ఇది యుద్ధాల కాలంకాదని, వెంటనే ఈ యుద్ధాన్ని నిలిపివేయాలన్న మోదీ మాటలకు జి20 దేశాలుకూడా సమ్మతిని వ్యక్తం చేశాయి. తమ ప్రసంగంలో మోదీ మాటలను ఉద్ఘాటించడమే అందుకు నిదర్శనం. ఇలాంటి పరిస్థితిలో జి20 దేశాల సారధ్యం భారత్‌ ‌చేతికి వొచ్చింది. భారత్‌ ‌సహజంగానే శాంతికామకమైన దేశం. ప్రపంచ శాంతి, సామరస్యం, భద్రతను చూడవలసిన బాధ్యత దానిపై ఉంది. ఇదే విషయాన్ని మోదీ ఆ సదస్సులో వివరించినట్లు తెలుస్తున్నది. ప్రపంచంలో నెలకొని ఉన్న అన్ని ముఖ్య సమస్యలపై ఏకాభిప్రాయసాధన అన్నది ప్రధానం. అందుకు సభ్యదేశాలన్ని సహకరిస్తాయన్న ఆశాభావాన్ని మోదీ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.

సంక్షోభం కొనసాగుతున్న కొలది ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వైరాలు, వైషమ్యాలు పక్కకు పెట్టి, దౌత్య విధానాలతోనే వివాదాన్ని పరిష్కరించుకోవాలన్న మోదీ సూచనలనే ఆ సదస్సు ‘బాలి డిక్లరేషన్‌’‌పేర విడుదల చేశాయి. అందులో ప్రధానంగా ఉక్రేయిన్‌పై దాడినే ప్రస్తావించాయి. ఈ దాడి అన్యాయం అయిందని, చట్టవిరుద్దమైందని, ఒక విధంగా ఇది దురాక్రమణేనని ఆ దేశాలు తేల్చి చెప్పాయి. అంతార్జాతీయ చట్టాలను గౌరవించాలని, యూన్‌ ‌చార్టర్‌కు, అంతర్జాతీయ మానవతా చట్టానికి కట్టుబడి ఉండాలని ఆ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. ఈ డిక్లరేషన్‌పై అన్ని దేశాలు ఏకాభిప్రాయానికి రావడం వెనుక ఇండియా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తున్నది. ఏదిఏమైన ఇప్పుడు భారత్‌పైన బృహత్‌ ‌బాధ్యత ఉంది. జీ20లో ఉన్న దేశాలన్నీ ప్రధానమైనవే. అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం ఈ దేశాలమధ్యే జరుగుతుంది. ప్రపంచ జీడిపిలో 85 శాతం వాటా ఈ దేశాలదే. అలాగే ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు ఈ దేశాల్లోనే నివసిస్తున్నారు. ప్రపంచ భూభాగంలో దాదాపు సగం వరకు ఈ దేశాల పరిధిలోనే ఉంది.

ఇంతటి ప్రాధాన్యత ఉన్న జి20 అధ్యక్ష పదవి భారత్‌కు ఈసారి సంక్రమించడం నిజంగా సంతోషించాల్సిన విషయమే. అయితే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఆహార లోటు, ఇందన ధరలు, కొరోనా లాంటి దీర్ఘకాలిక మహమ్మారి లాంటి దుష్ప్రభావాలతో ప్రపంచం కొట్టుమిట్టాడుతున్న వేళ భారత్‌ ఈ ‌బాధ్యతలను స్వీకరించడం కూడా ఒక సవాలే. అయితే ప్రధానికూడా దీన్ని చాలెంజీగా తీసుకున్నారు. ప్రపంచంలో వర్గాలు ఉండ •కుండా ఒకే ఒక వర్గం ఉండాలన్నదే భారత్‌ ‌ప్రయత్నం. ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్‌ అనే మంత్రంతో ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన విప్లవానికి భారతదేశం పిలుపునిస్తున్నట్లు మోదీ ఆ సదస్సులో ప్రసంగించడం సభ్యదేశాధినేతలను ఆకర్షించింది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్‌ అనే మంత్రంతో ప్రపంచ ఆరోగ్యాన్ని బలోపేతం చేసేదిశగా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు తెలియజేసిన మోదీ పట్ల ప్రశంసల జల్లులు కురిశాయి.

వొచ్చే ఏడాది సెప్టెంబర్‌ 9, 10 ‌తేదీల్లో దిల్లీ లో జరిగే 18వ జీ20 సదస్సుకు భారత్‌ ‌నేతృత్తం వహించనుంది. ఈ శిఖరాగ్ర సభ చిహ్నాన్ని ఇప్పటికే ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అయితే దీనిపై దేశంలోని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ చిహ్నం బిజెపి పతకానికి దగ్గర పోలిక ఉన్నట్లుగా వారు విమర్శిస్తుండడం వేరే విషయం. అధ్యక్షుడిగా ఎన్నికైన అవకాశాన్ని పురస్కరించుకుని దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రంగాలకు సంబంధించి దాదాపు 200 సమావేశాలను నిర్వహించేందుకు అధికార బృందం కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నది. దానివల్ల ఉజ్జ్వల భారతీయ సంస్కృతి వెల్లడవుతుందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *