వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

పటాన్‌చెరులో డివైడర్‌ను ఢీకోన్న స్కూటీ…ఇద్దరు విద్యార్థుల మృతి
సూర్యాపేటలో లారీని కారు ఢీకొట్టడంతో ఒకరు మృత్యువాత

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 1 : వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. సంగారెడ్డి  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. డివైడర్‌ను ఢీ కొని ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన పటాన్‌చెరు పట్టణం నోవోపాన్‌ సవిూపంలో జాతీయ రహదారి రోడ్‌పై సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..స్కూటీ పై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు ఆర్‌ భరత్‌ చందర్‌ (19), పి నితిన్‌ (18) అక్కడిక్కడే మృతి చెందగా ఎ వంశీ(19) తీవ్రగాయాలయ్యాయి.

గాయపడిన వంశీని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. వీరంతా సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూలో చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇకపోతే సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

జిల్లా కేంద్రంలోని హైటెక్‌ బస్టాండ్‌ ఎదురుగా జాతీయ రహదారి వద్ద ముందుగా వెళ్తున్న లారీని అతివేగంగా వొచ్చిన కారు వెనుక నుండి ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *