ఆషాఢమాసపు సుమూహర్తం
ఆసన్నంకాగా,
ఋతుపవన రాకతో
పులకరించిపోయి
నయనానందకర నాట్యాలతో
మురిపిస్తూ,
ఆనందాల మెరుపులతో
మైమరిపిస్తూ,
సంగీతస్వరాలతో
సవ్వడి చేస్తూ,
వినువీధుల దారులెంట
విహంగమై తరలుతూ,
అల్లంత దూరాన ఉన్న
ప్రకృతి కాంతని పెనవేసుకుని
తమకాన్ని తీర్చుకోడానికి
కొండాకోనలను
తడుముకుంటూ,
కొమ్మా రెమ్మను పలకరిస్తూ,
పైరుగాలి పైటను
సవరించుకుంటూ,
జలరాశులు నింపుకొన్న
పరువాల పయోధరాలు
విచ్చేస్తున్నాయి
పచ్చదనపు నెచ్చెలికై
పరుగులు తీస్తూ…
ధరణి అంతా
నీటి ముత్యాలు అద్దగా…
రైతన్న మదిలో
ధైర్యాన్ని మొలకెత్తించే
సంజీవనిగా…
– వేమూరి శ్రీనివాస్
9912128967
తాడేపల్లిగూడెం


