బిఆర్‌ఎస్‌లో మునుపటి ఉత్సాహం కరువు
కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని సిపిఐ పట్టు
లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పోటీకి సిద్ధమవుతున్న బిజెపి
(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, మార్చి 7 : ఉద్యమాల ఖిల్లా వరంగల్‌పై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత గొప్ప రాజకీయ చైతన్యం గల జిల్లాగా ఉమ్మడి వరంగల్‌కు మొదటి నుండీ పేరుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కొనసాగిన ఏ ఉద్యమాలకైనా వరంగల్ ముందు వరుసలో నిలబడుతూ వొచ్చింది. అంతటి చైతన్యం గల జిల్లాకు ప్రాతినిధ్యం వహించాలని రాజకీయ పార్టీలన్నీ పోటీపడుతున్నాయి. త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను గెలువాలన్న లక్ష్యంగా ఈ పార్టీలు గెలుపు గుర్రాలను ఎంచుకునే కార్యక్రమంలో మునిగిపోయాయి. అయితే దాదాపు అన్ని పార్టీల నుండి కూడా వరంగల్ పార్లమెంట్ (ఎస్సీ) స్థానానికి పోటీ పడేందుకు ఎక్కువ సంఖ్యలోనే ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. కాని, ప్రస్తుతం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న బిఆర్‌ఎస్‌లో మాత్రం మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. తాజా శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు కాస్త డీలా పడ్డట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే కొందరు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్, బిజెపి కండువాలను కప్పుకోగా, మరి కొందరు ఊగిసలాడుతున్నట్లు వార్తలు వొస్తున్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో ఓటమికి సిట్టింగ్ ఎంఎల్‌ఏల పనితీరే కారణమన్నది స్పష్టం కాగా, ఎంపీల విషయంలోనూ ఇప్పుడు అదే పరిస్థితి ఎదురవుతున్నది. వరంగల్ పార్లమెంటు స్థానంలో రెండు సార్లు గెలిచిన పసునూరి దయాకర్‌ను మార్చి కొత్తవారికి ఈసారి టికట్ ఇవ్వాలని బిఆర్‌ఎస్ అధిష్టాన వర్గం ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఇప్పటికే ఈ వాసన పసిగట్టిన దయాకర్ పార్టీ మారుతాడన్న ప్రచారం జరుగుతుండడంతో అధిష్టానం మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. తాజా శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూపిన వర్ధన్నపేట మాజీ శాసనసభ్యుడు కూడా వరంగల్ స్థానంపైన ఆశపెట్టుకున్నట్లు తెలుస్తున్నది. తనను కాదన్న పరిస్థితిలో ఆయన మరో పార్టీ కండువ కప్పుకోవడానికి సిద్దపడ్డట్లు వార్తలు వొచ్చాయి. దాన్ని ఆయన కాదని కొట్టిపారేసిన ఆ ‘త్రెట్’ మాత్రం బిఆర్‌ఎస్‌కు లేకపోలేదు. కాంగ్రెస్‌లో కూడా ఈ స్థానం విషయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిరది. కాంగ్రెస్ ఇవ్వాళో రేపో మొదటి జాబితాను ప్రకటించనుంది. అయితే ఆ పార్టీలో వరంగల్ చిక్కుముడిగా తయారైంది. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సిపిఐ ఈ స్థానాన్ని తమకు కేటాయించాలని పట్టుపడుతుంది. లేదా ఖమ్మం స్థానాన్ని అయినా కేటాయించాలంటూ దిల్లీలో అధిష్టానంతోనే ఆ పార్టీ సీనియర్ నాయకులు చర్చలు జరుపుతుండడంతో ఇప్పుడప్పుడే వరంగల్ అభ్యర్థిని ప్రకటించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని స్పష్టమవుతున్నది. వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1952లో తప్ప ఉభయ కమ్యూనిస్టుల్లో ఏ ఒక్క పార్టీ కూడా ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించింది లేదు. ఆనాడు ప్రొగ్రెసివ్ డెమక్రటిక్ ఫ్రంట్ పేర పెండ్యాల రాఘవరావు వరంగల్ పార్లమెంటుకు మొదటిసారిగా ఎన్నికైనారు. ఆ తర్వాత ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని స్టేషన్ ఘణపూర్, పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గలేదు. అందుకే తమకు ఖమ్మం లేదా వరంగల్ కేటాయించాలని పట్టుపడుతున్నది సిపిఐ. కాగా ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీని తెలంగాణ నుండి ముఖ్యంగా ఖమ్మం నుండి బరిలో దింపాలని రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చినప్పటి నుండి కాంగ్రెస్ మంతనాలు చేస్తున్నది. అంతేగాక పొత్తులో భాగంగా కేటాయించిన ఖమ్మం జిల్లా పరిధిలోని కొత్తగూడెంను ఇప్పటికే సిపిఐ గెలుచుకుంది. కాబట్టి కాంగ్రెస్ అదే జిల్లాలో పార్లమెంటు స్థానాన్ని ఇచ్చే పరిస్థితి ఉండదు. అందునా అక్కడ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లేదా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు తమ కుటుంబ సభ్యులకోసం అడుగుతున్నారు. అందుకే వరంగల్‌ను కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది. దశాబ్ధాల కాలంగా జిల్లాలో పేదల పక్షాన అనేక పోరాటాలు చేసిన చరిత్ర సిపిఐకి ఉంది. ఉమ్మడి జిల్లాను నుండి నేటి వరకు భూపోరాటాలు మొదలు అనేక సమస్యలపై చేసిన ఉద్యమాలతో ఆ పార్టీ పేద ప్రజల గుండెల్లో నిలిచింది. ఈ పార్టీ అనుబంధ ఏఐటియుసి, ఎల్‌ఐసి. బ్యాకింగ్ రంగాల్లో మంచి పట్టుఉంది. ఒకవేళ తమ పార్టీకి ఈ స్థానాన్ని కేటాయిస్తే జిల్లాలో పేరున్న సీనియర్ జర్నలిస్టు బీఆర్ లెనిన్‌ను నిలబబెట్టి గెలిపించుకుంటామంటుంది సిపిఐ.
లెనిన్ వరంగల్ ఉమ్మడి జిల్లా సిపిఐ కార్యదర్శిగా కొనసాగిన బీఆర్ భగవాన్‌దాస్ కుమారుడు. పూర్వం భగవాన్‌దాస్ పార్టీకి చేసిన సేవల గుర్తింపుగా ఆయన్ను గెలిపించుకుంటామంటుంది సిపిఐ నాయకత్వం. తెలంగాణ ఉద్యమకాలంలో జర్నలిస్టుల పక్షాన ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక కార్యక్రమాలను చేపట్టి, ప్రజలను ఉద్యవోన్ముఖులను చేసిన పేరు లెనిన్‌కు ఉంది. అయితే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని స్టేషన్‌ఘనపూర్ మినహా మిగతా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్‌వే కావడంతో తమ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందంటూ ఆ పార్టీ నుండి పోటీ పడుతున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. ఇక్కడి నుండి పోటీ చేసేందుకు దాదాపు నలభై మందికిపైగా ఆసక్తి చూపుతూ దరఖాస్తులు చేసుకున్నా, ప్రధానంగా అద్దంకి దయాకర్, దొమ్మాట సాంబయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన అద్దంకి దయాకర్‌కు అసెంబ్లీ టికెట్ వొచ్చినట్లే వొచ్చి పోవడంతో ఆయనకే వరంగల్ టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకుంటున్నారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలను సాధించుకోవాలనుకుంటున్న బిజెపి కూడా పోటీకి సిద్దమైంది. ఆ పార్టీ నుండి మాజీ ఎంఎల్‌ఏ, రాష్ట్ర ఎస్సీ మోర్చ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, చింతా సాంబయ్య, మాజీ డిజిపి కృష్ణప్రసాద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాగా బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపి పసునూరి దయాకర్, వర్దన్నపేట మాజీ ఎంఎల్‌ఏలు కూడా బిజెపి అవకాశమిస్తే పార్టీ మారడానికి ఉవ్విళ్ళూరుతున్నట్లు వార్తలు వొస్తున్నాయి. అందుకే ఇప్పటివరకు అటు బిఆర్‌ఎస్ గాని, ఇటు బిజెపిగాని మొదటి విడుతలో ప్రకటించిన పేర్లలో వరంగల్ లేకపోవడం గమనార్హం.





