రాయితో దాడిలో కారు అద్దాలు ధ్వంసం సురక్షితంగా బయటపడ్డ రాహుల్
కోల్‌కతా, జనవరి 31 : పశ్చిమబెంగాలో లోని మాల్దాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కారుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త నెలకొంది. అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా భయాదోళనకు గురయ్యారు. దాడి నుంచి రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపట్డారు. దాడి తర్వాత రాహుల్ కారు దిగి బస్సులో కూర్చున్నారు. మాల్దా జిల్లాలోని హరిశ్చంద్రపుర్‌లో రాహుల్ ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగిందని బెంగాల్ కాంగ్రెస్ చీప్ అధీర్ రంజన్ చౌదరి తెలిపారు. ఇలాంటి దాడులు సరికాదన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టినప్పటి నుంచి నిత్యం దుండగులు ఆటంకాలు సృష్టిస్తున్నారని, ఇటీవల మణిపూర్‌లో రాహుల్ యాత్రను అడ్డుకున్న సంగతి తెలిసిందే.. తాజా గా పశ్చిమ బెంగాల్లో రాహుల్‌ను అడ్డుకోవడం కూడా రాజకీయ కుట్రలో భాగమేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర కాన్వాయ్‌పై బెంగాల్, బీహార్ సరిహద్దులో దాడి జరిగింది.
బెంగాల్‌లోని మాల్దాలో ఈ ఘటన చోటుచేసుకోగా.. గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో రాయి విసరడంతో కారు వెనుక అద్దాలు పగిలిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి వెల్లడిరచారు. ఘటన నేపథ్యంలో మాల్దాలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను కొందరు టార్గెట్ చేశారని అక్కడి నేతలు పేర్కొన్నారు. ఈ దాడి ఘటన వెనుక అధికార పార్టీకి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. రాహుల్ న్యాయ యాత్రకు పదే పదే అడ్డంకులు జరుగుతున్న నేపథ్యంలో తగిన భద్రత కల్పించాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ పంపారు.
ఈ క్రమంలోనే మాల్దాలోకి ప్రవేశించిన తర్వాతే అయన భయాలు నిజమయ్యాయి. బెంగాల్-బీహార్ సరిహద్దుల్లో ఈ దాడికి పాల్పడిరది ఎవరన్నదానిపై విచారణ జరపాలని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రదీప్ భట్టాచార్య డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. మరోవైపు తృణమూల్ ప్రభుత్వం ఈ యాత్రకు సహకరించడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. ముర్షిదాబాద్ జిల్లాలోకి అడుగుపెట్టిన తర్వాత రాహుల్ బస చేయాల్సిన స్టేడియానికి కూడా అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ తెలిపింది. ఇది కుట్రలో భాగంగానే జరిగిందని ఆరోపించింది.





