- గుర్తింపు కార్డులు అందజేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
- రోజుకు కనీసం 5 లీటర్ల నీళ్లు తాగాలని సూచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : 10 వేల మంది రోగులకు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని, అందులో 5 వేల మందికి 2016 రూపాయల ఆసరా పెన్షన్లు ప్రభుత్వం ఇస్తున్నదని మంత్రి హరీష్ రావు తెలిపారు. మంగళ వారం వెంగళరావు నగర్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో నిర్వహించిన డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పెన్షన్లు అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కేసీఆర్ డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పెన్షన్ అందించడం చాలా సంతోషకరం..వారికి నా కృతజ్ఞతలు. దేశంలో డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది కేవలం ముఖ్యమంత్రి నాయకత్వంలో సాధ్యమైందని పేర్కొన్నారు. కిడ్నీ రోగుల కోసం బడ్జెట్లో 100 కోట్లు ప్రభుత్వం కేటాయించింది..డయాలసిస్ రోగుల కోసం సింగిల్ యూజ్ ఫిల్టర్ తెచ్చిన ఏకైక మొదటి రాష్ట్రం తెలంగాణ..ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 3 మాత్రమే డయాలసిస్ సెంటర్లు హైదరాబాద్లో ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత 103కు పెంచుకున్నామని మంత్రి తెలిపారు. జిల్లాలలో 83 చోట్ల డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసాం.
రాష్ట్రం ఏర్పడిన తరువాత దాదాపు 700 కోట్లు కిడ్నీ రోగుల కోసం ఖర్చు చేసింది..ఏడాదికి కిడ్నీ మార్పిడి 150 వరకు ప్రభుత్వ హాస్పిటల్స్లలో 10లక్షలు ఇచ్చి ఉచితంగా చేస్తున్నాం..సింగిల్ యూజ్ డయాలసిస్ సిస్టం, డయాలసిస్ రోగులకు ఉచిత బస్ పాస్లు, ఇప్పుడు ఆసరా పెన్షన్స్ వంటివి ప్రభుత్వం కల్పిస్తుంది..అవసరమైన వారికి ప్రభుత్వమే ఆరోగ్య శ్రీ కింద పది లక్షలు ఇచ్చి ఉచితంగా కిడ్నీ మార్పిడి చేస్తుంది. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేసుకున్న వారికి జీవితకాలం ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. గాంధీ, ఉస్మానియా, నిమ్స్లలో ఈ సేవలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. గాంధీలో 40 కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నం.
కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఉచితంగా ప్రభుత్వ దవాఖానాల్లో జరుగుతుంది. కిడ్నీ వ్యాధి రాకుండా స్వచ్ఛమైన నీరు అందిస్తున్నాం..ప్రతి వందలో 20 మందికి షుగర్, బీపీ వ్యాధులు వొస్తున్నాయి…చిన్న వయసులో కూడా వొస్తున్నాయి. అవసరం లేకున్నా మందులు వాడొద్దు. వైద్యుల సూచనల మేరకే మందులు వాడాలి. అనవరంగా మందులు వాడటం వల్ల కిడ్నీ వ్యాధులు వొస్తున్నాయి. డయాలసిస్ నిర్వహణ బాధ్యతలు ఉస్మానియా, నిమ్స్, గాంధీ నెఫ్రోలజీలకు అప్పగించాం..డయాలసిస్ పెన్షన్స్ ఎవరికి రాకున్నా మా దృష్టికి తీసుకురండి..రోజుకు కనీసం 5 లీటర్ల నీళ్లు తాగితే చాలా రోగాలకు చెక్ పెట్టొచ్చు..రాష్ట్రంలో 45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నం. దేశంలో డయాలిసిస్ పేషంట్లకు, ఎయిడ్స్, ఫైలేరియా పేషంట్లకు పెన్షన్ ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రతీ నెల వేయి కోట్లు ఖర్చు చేస్తుంది. మహారాష్ట్రలో వేయి రూపాయల పెన్షన్, కర్ణాటకలో 600 మాత్రమే ఇస్తుంటే, తెలంగాణ రాష్ట్రం 2016 రూపాయలు అందిస్తుందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు.


