రాధాకిషన్‌ రావుకు 12 వరకు రిమాండ్‌ పొడిగింపు

ఫోన్‌ ట్యాంపిగ్‌లో ఒక్కొక్కరే బయటకు వొస్తున్న బాధితులు
షేర్లు బలవంతంగా రాయించుకున్నట్లు కేసు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు టాస్క్‌ ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధా కిషన్‌ రావుకు ఈనెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్‌ పొడిగించింది. నేటితో రాధాకిషన్‌ రావు కస్టడీ ముగియడంతో ఆయనను ఉదయం నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. దీంతో రాధాకిషన్‌కు ఈ నెల 12 వరకు రిమాండ్‌ కొనసాగిస్తున్నట్ల కోర్టు తెలిపింది. జైల్‌లో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతించడం లేదని ఈ సందర్భంగా కోర్టుకు రాధా కిషన్‌ తెలిపారు. జైల్‌ సూపరింటెండెంట్‌ను కూడా కలవనీయడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులను కోర్టు ప్రశ్నించింది. లైబ్రరీతో పాటు జైలు సూపరింటెండెంట్‌ను కలిసేలా అనుమతిస్తూ కోర్టు ఆదేశించింది. ఇకపోతే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టు అయిన మాజీ టాస్క్‌ ఫోర్స్‌ డీసీపీ రాధా కిషన్‌ రావు బాధితులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు.

2024 ఏప్రిల్‌ 4 బుధవారం నాడు టాస్క్‌ ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధా కిషన్‌ రావుపై మరో కేసు నమోదైంది. క్రియా హెల్త్‌ కేర్‌ సంస్థ డైరెక్టర్లతో కలిసి తనపై ఉన్న షేర్లు బలవంతంగా రాయించుకున్నారని చైర్మన్‌ వేణుమాధవ్‌ చెన్నుపాటి జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. అంతే కాక తనపై ఉన్న యాజమాన్య హక్కులను కూడా మార్పిడి చేశారని బాధితుడు పోలీసులకు తెలిపారు. దీంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు రాధా కిషన్‌ రావుతో సహా ఇన్‌ స్పెక్టర్‌ గట్టుమల్లు, ఎస్‌ ఐ మల్లికార్జున్‌ పలువురు పోలీస్‌ అధికారులపై కేసు నమోదు చేశారు.

2018 నవంబర్‌ లో తనను టాస్క్‌ ఫోర్స్‌ ఆఫీస్‌ తీసుకువెళ్లి పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించారని వేణుమాధవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాధా కిషన్‌ రావు అరెస్ట్‌ కావడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసానని తెలిపారు. రాధాకిషన్‌ తో సహా నలుగురు అధికారులపై ఐపీసీ సెక్షన్‌ 386,365,341, 120(బీ) రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టైన రాధాకిషన్‌ రావు ప్రస్తుతం చంచల్‌ గూడ జైల్లో ఉన్నారు. బుధవారంతో ఆయన కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరుచగా ఈ నెల 12 వరకు రిమండ్‌ విధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *