ప్రజాస్వామ్యన్ని పరిరక్షించి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయ నాయకులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం పరిపాటి. .అటువంటి పాలకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. కానీ నేటి ప్రజాప్రతినిధుల్లో చాలా మంది క్రిమినల్ నేరాలను ఎదుర్కొంటూ పరిపాలనలో భాగస్వాములు కావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. .ఇటువంటి నేరమయ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి నేడు గొడ్డలి పెట్టుగా పరిణమించాయి. నాలుగు దశాబ్దాల పూర్వం వరకూ భారత రాజకీయాలలో ప్రజాప్రతినిధులుగా కేవలం నాయకత్వ పటిమ, సేవా స్ఫూర్తి గలవారే ముందుకు వచ్చే వారు.ఎందుకంటే ఆనాడు రాజకీయాలంటే సేవ చేయడమే..పైగా వారు రాజకీయాలలోనికి రావడం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారంలో తమ స్వంత ఆస్తులను సైతం పోగొట్టుకుని అత్యుత్తమ సేవలు అందిస్తూ ప్రజల మదిలో సుస్ధిర స్ధానం సంపాదించుకున్న నేతలే మనకు ఎక్కువ మంది కనిపిస్తారు..ఆ రోజుల్లో రాజకీయం అనే పదమే చాలా పవిత్రంగా ఉండేది.కాల గమనంలో నేరగాళ్ల పరోక్ష అండదండలతో ఎన్నికల్లో నాయకులు నెగ్గడం మొదలయ్యింది. ఇప్పుడు ఏకంగా నేరచరితులే నేరుగా నేతలుగా అవతారాలెత్తి దర్జాగా చట్టసభల లోనికి అడుగు పెడుతున్నారు..ఇది నిజంగా దురదృష్టకరం.
స్వాతంత్య్రం సిద్ధించి నాలుగు దశాబ్దాల తర్వాత రాజకీయాలలో నేర స్వభావం ఉన్న వారి ప్రమేయం క్రమేపీ పెరుగుతూ వస్తోంది. ఈ పరిస్ధితులు లో రాజకీయాలలో సచ్ఛీలురులకు స్థానమే లేకుండాపోతోంది. నేరచరిత్ర కలిగిన వారు పార్లమెంటుకు, వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికయ్యే సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఎన్నికల్లో నేర చరిత నాయకుల సంఖ్యతో పాటుగా కోటీశ్వరుల సంఖ్య కూడా అదే దామాషాలో వృద్ధి చెందుతోంది. ఇటువంటి స్ధితిలో నేడు రాజకీయం–నేరం కలగలిసి కాపురం చేస్తున్నాయి. రాజకీయ పార్టీలకు నేరస్తులకు మధ్య ఉన్న సంబంధం రోజు రోజుకు బలపడుతుంది అని వివిధ గణాంకాలు కూడా చెబుతున్నాయి.ఎన్నికల్లో విజయం సాధిస్తున్న ప్రతి ముగ్గురిలో ఒకరు నేరచరిత్ర కలిగిన వారేనని ఒక సంస్థ అద్యయనంలో తేలింది. స్వచ్ఛమైన రాజకీయాలు, విలువలతో కూడిన సేవా తత్పరులు, అభివృద్ధి రాజకీయాలు కనుచూపు మేరలో కనిపించని స్థితి నేడు నెలకొంది.
అంతే కాదు మన ప్రజాస్వామ్యంలో సేవకులెవరో నేర చరితులెవరో గుర్తించడం అనేది సాధ్యం కానిదిగా ఉంది..ఎందుకంటే నేడు ప్రజాప్రతినిధుల ముసుగులో ఎందరో నేర చరితులు శాసన కర్తలుగా చెలామణీ అవుతున్నారు.అంటే చట్టాలను ఉల్లంఘించేవారే చట్టసభల సభ్యులుగా ఎన్నిక కాబడి చట్టాలను తయారు చేస్తున్న దుస్ధితి నేడు మన ప్రజాస్వామ్యంలో మనకు కనిపిస్తూ ఉంది నేర చరితులు,చట్ట సభలకు ఎన్నిక అయితే వారు నేరాల నుంచి బయట పడటానికి, ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికి, అక్రమ ఆస్తులు పోగేసుకోవడానికి తమ పదవులు వాడుకుంటారు తప్ప చట్ట సభల గౌరవాన్ని నిలిపి ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రజల ప్రయోజనాలు కాపాడాలి అనే స్పృహ ఏ మాత్రం కానరావడం లేదు.
■ఎన్నికల సంస్కరణలు విషయమై జరిపిన ఒక అధ్యయనంలో ప్రజా ప్రతినిధులుగా పోటీ పడుతున్న వారిలో సచ్ఛీలురు ఏ విధమైన అవినీతి మచ్చ లేని వారికి విజయావకాశాలు కేవలం 6 శాతంగా ఉంటే అవినీతి నేర ప్రవృత్తి కలిగిన 94 శాతం మందికి విజయావకాశాలు ఉన్నట్లు తెలిసింది..దీనిని బట్టి చూస్తే ప్రజాస్వామ్యం నేరస్వామ్యంగా ధన స్వామ్యంగా మారిన పరిస్ధితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నేటి ఎన్నికల విధానంలో ప్రజాప్రతినిధుల తీరును గత కొంత కాలం నుండి ఎన్నికల ప్రక్రియ, ఓటుస్వేచ్ఛ, ప్రజాస్వామిక సంస్కరణల దిశలో పలు స్థాయిల్లో పరిశీలన చేస్తూ ఎప్పటి కప్పుడు నివేదికలు సమ ర్పిస్తున్న అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రజాస్వామ్య సంస్కరణల సంస్ద విశ్లేషించి ఇస్తున్న నివేదికలలో 2004లో లోకసభకు ఎన్నికైన వారిలో 24 శాతం సభ్యులపై క్రిమినల్ కేసులు ఉండగా, 2009 నాటికి ఆ సంఖ్య మరో ఆరు శాతానికి పెరిగి 30 శాతానికి చేరుకుంది.ఇది 2014 లో 34 శాతానికి పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజాగా నేడు లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రస్తుత లోక్ సభ సభ్యులు తమ అఫిడవిట్ లో పేర్కొన్న విషయాలను విశ్లేషిస్తూ అందించిన నివేదిక పరిశీలిస్తే చాలా ఆశ్చర్య పడే విషయాలు బయటపడ్డాయి.ఈ నివేదిక ప్రకారం ప్రస్తుత లోక్ సభ సభ్యులు 514 మందిలో 225 మంది అనగా 44 శాతం మంది అంటే దాదాపు సగం మంది క్రిమినల్ కేసులు కలిగి ఉన్నారని తేలింది.వీరిలో హత్య, హత్యాయత్నం,మానవ అపహరణ అత్యాచారం వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులున్న వారు ఉండటం విచారించదగ్గ విషయం.
వీటిని దృష్టిలో ఉంచుకునే రాజకీయాల్లో క్రిమినల్ కేసులు కలిగిన వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోదించాలని పలు మార్లు న్యాయ స్ధానాల్లో ప్రజా ప్రయోజన వాజ్యాలు దాఖలు అయ్యాయి. సుప్రీమ్ కోర్టు కొన్ని మార్గదర్శక సూత్రాలు కూడా ప్రకటించడం జరిగింది.నేర చరిత కలిగిన వారి వివరాలు వెబ్ సైట్ లో ఉంచాలని పత్రికలలో,సామాజిక మాధ్యమాలాలో విస్తృత ప్రచారం కల్పించాలని నిబంధనలు పేర్కొంది అయితే సాధారణ ప్రజలు ఈ వెబ్ సైట్లు చూసి, పత్రికలలో చూసి ఓటు వేస్తారు అనుకుంటే అది హాస్యాస్పదం అవుతుంది.ఎన్ని నిబంధనలు ఉన్నా కూడా నేర చరితులను ఎన్నికలలో పోటీ చేయకుండా కట్టడి చేయలేక పోతున్నారు.
■ప్రస్తుతం ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరాలు రుజువై, శిక్ష పడిన నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు.
ఏదైనా ఒక కేసులో రెండేళ్లు, అంతకు పైబడి జైలుశిక్ష పడిన ప్రజాప్రతినిధుల చట్టసభల సభ్యత్వం తక్షణం రద్దు కావాలి. ఆ అనర్హత వారికి ఆరేళ్ల పాటు వర్తిస్తుంది.అయితే, నేరం రుజువై శిక్ష పడిన వారికే కాకుండా అభియోగాలు ఎదుర్కొంటూ క్రిమినల్ కేసులు నమోదైన వారిని కూడా అనర్హుల్ని చేయాలని ఉన్నత న్యాయస్ధానంలో పలు ప్రజా ప్రయోజన వాజ్యాలు దాఖలు అయ్యాయి. అయితే ఇలా కేసులు నమోదు అయిన వారిని కూడా అనర్హులు చేయడాన్ని ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు.ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారం లో నాయకులు ఉద్యమాల చేపట్టే సమయంలో కొన్ని అరెస్టులు జరుగుతూ ఉంటాయి.ఇది చట్ట ప్రకారం సహజంగా జరిగే ప్రక్రియ..పై ప్రతిపాదన అంగీకరిస్తే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రతిపక్షాలను అణగద్రొక్కడానికి ఈ అస్త్రాన్ని ఎక్కువగా ఉపయోగించు కుంటాయి. చిన్న చిన్న కేసుల విషయంలో కూడా రాజ ద్రోహం వంటి కేసులు పెట్టి తమకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను ఎన్నికల బరిలో లేకుండా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.దీనికి రాజ్యాంగ బద్ధ వ్యవస్ధలను సైతం ఉపయోగించుకుంటాయి. అయితే దీనికి పరిష్కారం ఏమిటంటే రాజకీయ నాయకులపై నమోదు అయిన కేసులను సత్వరమే పరిష్కరించే దిశగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి సత్వరం తీర్పులు ఇవ్వాలి. అయితే కార్యాచరణలో మాత్రం ఒక్క అడుగు ముందుకు పడటం లేదన్నది సత్యం.దీని కారణంగా క్రిమినల్ కేసుల గల రాజకీయనాయకులపై నమోదు అయిన కేసుల విచారణ దశాబ్దాల కాలం పడుతూ ఉంది.ఈ లోగా నేర చరిత గల నాయకులు అధికారాన్ని తమ చేతుల్లో తీసుకుని స్వప్రయోజనాల కోసం వ్యవస్ధలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు.అవసరం అయితే తమపై గల కేసులను కొట్టి వేయించుకోవడానికి కూడా వెనుకంజ వేయడం లేదు.
■ప్రస్తుతం చట్ట సభలలో దాదాపు సగం మంది క్రిమినల్ కేసులు కలిగిన వారు ఎన్ను కోబడుతున్నారు అంటే ఎవరిని తప్పు పట్టాలి?..అటువంటి వాళ్ళను చట్ట సభలకు పంపిన వారిది కాదా? ఒక విధంగా చూస్తే ఓటర్లలో చాలా మంది నేర నేపధ్యం కలిగిన వాళ్ళను ప్రజలు హీరోలుగా గుర్తించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్న సంఘటనలు తక్కువేం కాదు.నేర చరిత కలిగిన వారిని హీరోలుగా భావిస్తూ సేవా దృక్పధం కలిగిన నేతలను తుక్కు తుక్కుగా ఒడిస్తున్న సందర్భాలు మనం అనేకం చూస్తున్నాం. ప్రజలు మాత్రం బాధ్యతారహితంగా ఓటు వేసి రాజకీయ పక్షాలు, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకోవడం ఎంత వరకూ సమంజసం.? ఈ సంక్లిష్ట సమస్య పరిష్కారానికి రాజకీయ పక్షాలు నేర చరిత కలిగిన వారిని ఎంపిక చేయకూడదు అని చెప్పడం కన్నా ఎన్నికల సంగ్రామంలో నిలబెట్టిన అటువంటి వారిని ప్రజలు ఓడించేందుకే సిద్ధ పడాలి. విజ్ఞత కలిగిన ఓటర్లు ఈ బాధ్యత చేపట్టాలి.అప్పుడు ఏ రాజకీయ పక్షం కూడా నేర చరితులను ఎన్నికల్లో నిలబెట్టే ధైర్యం చేయదు.అలా కాకుండా నేర చరిత కలిగిన వారిని మనం గెలిపిస్తూ ఉన్నంత కాలం నేర చరితులకు పార్టీలు టిక్కెట్లు ఇవ్వక పోయినా ఇండిపెండెంట్లుగా పోటీ చేసి ఎన్నిక కాబడటం ప్రజాస్వామ్యం అపహాస్యం కావడం తధ్యం..





